Wednesday, January 19, 2011

ఆంగ్ల సంవత్సరాది - 3

......వచ్చిన 2011

2. మోర్ లూ, మాగ్నాలూ వగైరా మన వీధి చివరి చిల్లరకొట్లనేకాదు, చిన్న చిన్న 'డిపార్ట్ మెంటల్ స్టోర్లు' అనబడే ఆధునిక చిల్లర కొట్లనీ, ఇంకా పెద్ద స్థాయి "చెర్మాస్", "చందనా బ్రదర్స్" లాంటివాటిని కూడా మింగేస్తాయా?

జ : ఇది కూడా పూర్తిగా అసాధ్యం. 

యెందుకంటే.....

వుత్పాదిత వస్తువులని వినియోగదారుకి చేర్చే "వాణిజ్యం" లో ముఖ్యమైన లింకులు 'హోల్ సేలర్స్', 'రీటెయిలర్స్'. వాణిజ్యం మొదలైనప్పటినుంచీ, కొన్ని వందల సంవత్సరాలుగా వీళ్లు వున్నారు. ఈ రీటెయిలర్స్ లో--డిపార్ట్ మెంటల్ స్టోర్లూ, చైన్ స్టోర్లూ, మెయిల్ ఆర్డర్ బిజినెస్లూ, చిల్లర కొట్లూ, హాకర్లూ, పెడలర్లూ--ఇలాంటివి భాగాలు.

డిపార్ట్ మెంటల్ స్టోర్లు అంటే 'గుండుసూది దగ్గరనించీ, మోటార్ కారు వరకూ' అన్ని వస్తువులూ 'ఒకే కప్పుక్రింద' దొరికే దుకాణం--అని ఓ పెద్ద పేరు. "బ్లూమింగ్ డేల్స్" "టిఫ్ఫనీస్" మొదలైనవి ఇలాంటివి. (మోర్లూ అవీ దాదాపు ఇలాంటివే. రిలయన్స్ లాంటివాళ్లయితే, 'బ్యాక్ వర్డ్ ఇంటెగ్రేషన్' కి కూడా వెళ్తున్నారు.) 

చైన్ స్టోర్స్ అంటే, ఒక కంపెనీ, తన వుత్పాదనలని, తన బ్రాండుతో, అనేక పట్టణాల్లో, తానే దుకాణాలు తెరిచి, యేజంట్ల ద్వారా అమ్ముకోవడం. "బాటా" ఓ చక్కని వుదాహరణ. ఇప్పుడు ఇవీ లేవు. దానికి అనేక కారణాలు.

మెయిల్ ఆర్డర్ అంటే, యెక్కడో ఓ దుకాణం పెట్టుకొని, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, పోస్టు ద్వారా ఆర్డర్లు స్వీకరించి, వస్తువులని వినియోగదారులకి పోస్టులోనే పంపించడం. (ఇప్పుడు "ఆన్ లైన్" షాపింగులు కూడా). వుదాహరణకి, "బర్లింగ్టన్స్" లాంటివి. మనదేశంలో ఓ నలభయ్యేళ్లక్రితమే, "15 రూపాయలకే ట్రాన్సిస్టర్" అని, గడ్డి పంపించడం లాంటివాటితో అప్రతిష్ట పాలయ్యాయి.

హాకర్లూ, పెడలర్లూ అంటే బళ్లమీదా, సైకిళ్లమీదా వీధుల్లో అరుచుకొంటూ అమ్ముకునేవారు. వీళ్లు అప్పటికీ, ఇప్పటికీ తమ వ్యాపారం సాగిస్తూనే వున్నారు. యెటొచ్చీ, మనుషులు మారుతూ వుంటారు--బాగుపడిన వాళ్లు స్థిర దుకాణాలు పెట్టుకొంటే, పడని వాళ్లు వ్యాపారం మానేస్తారు. ఆ స్థానం లో మరొకరు వస్తారు.

ఇక మిగిలినది "చిల్లర కొట్ల" వాళ్లే. వీళ్లకి వున్న అనుకూలత యేమిటంటే, ప్రతీ వీధి చివరా, అందరికీ అన్ని సమయాల్లోనూ, అందుబాటులో వుండడమే. మూడ్డబ్బుల బెల్లం, కానీ కాప్పొడుం కొనుక్కొనే వాళ్ల దగ్గరనించీ, పావుకేజీ పంచదారకోసం బజారుదాకా యేమి పోతాం అనుకునే వాళ్ల వరకూ అక్కడికే వెళతారు!

వీళ్లు యెన్ని తుఫాన్లు వచ్చినా, వొరిగి వుంటూ, మళ్లీ నిలబడే గడ్డి మొక్కల్లాంటివాళ్లు. అందుకే వీళ్లకి ఢోకా లేదు. 

ఇక చర్మాస్, చందనాస్ లాంటివాళ్లు వాళ్ల ప్రత్యేకతల్ని నిలబెట్టుకుంటూ, "యెక్కడికో దూరంగా వెళ్లి యెందుకు మోసపోతారు మీరు? మేం మీకు అతి దగ్గరలోనే వుండగా!" లాంటి ప్రకటనలు ఇవ్వకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నంతకాలం, వాళ్లకీ ఢోకా లేదు.

.....మిగతా మరోసారి.

No comments: