Thursday, April 28, 2011

అంత్యక్రియలు అనే.....2



హై డ్రామా

(నా టపా మీద వెంటనే వ్యాఖ్యానించినవాళ్లకి నా ధన్యవాదాలు. త్వరలోనే జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దయచేసి నిరీక్షించండి.)

సన్యక్+ఆధి (సమాధి) అట! నా ఇన్నాళ్ల జీవితంలో ఈ “డెఫినిషన్” యెప్పుడూ వినలేదు! (ఇది యెవరైనా చెప్పారా, లేక ఈనాడువారు కనిపెట్టారా అన్నది కూడా నాకు తెలీదు.)

ప్రేత కర్మలూ, అపర కర్మలూ చేయించేవాళ్లు వేరే వుంటారు. వాళ్లు పట్టు వస్త్రాలు ధరించరు. ఆ కర్మలు జరిపిస్తున్నంతకాలం వేరే నియమాలు పాటిస్తారు. దైవార్చన, పూజా పునస్కారాలు చెయ్యరు. దేవాలయాల్లోకి వెళ్లరు. (శివాలయాలకి ఈ నిబంధన లేదు). వాళ్లలో (క్షమించండి) ‘ప్రేతకళ‘ వుట్టిపడుతూ వుంటుంది అని జనవాక్యం. 

నాకు తెలిసీ, మామూలుగా పురోహితులూ, వేదపండితులూ వగైరాల కుటుంబాల్లో యెవరిదైనా మరణం సంభవించినా, అలాంటి వాళ్ల చేతే కర్మలు జరిపించుకొంటారు కానీ, తామే ఆ కర్మలు నిర్వహింప చెయ్యరు. మరి యఙ్ఞాలూ, యాగాలూ చేయించారంటున్న అవధానులూ, ఇతర వేద పండితులూ, పట్టు వస్త్రాలు ధరించి, ఖననం చేయించడం యేమిటి?

వాళ్లు చేయించిన పధ్ధతీ, చదివిన సో కాల్డ్ మంత్రాలూ వింటే, అంతకు ముందు ప్రత్యేకంగా తయారు చేసుకొని, బట్టీ పట్టి, చదివి, నిర్వహింపచేసినట్టు అనిపిస్తూంది. (ఇలాంటి సందర్భం వాళ్లకి యెదురవడం మొదటి సారే అని నా అనుమానం.) బెంగుళూరు బృందం వారు టీవీలో కనపడలేదు కానీ, వాళ్లు యెక్కడో కూర్చొని, మంత్రాలు చదువుతూనే వున్నారు. వేద పఠనం లో వీళ్లకి బాగానే చేదోడు అయ్యారు. 

(నేను చూసినవాటికి, ఈనాడు వారు ఇవాళ (28-04-2011) ప్రచురించిన కథనంతో అనుసంథానం చేస్తూ వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే.)

ముందురోజు రాత్రే తవ్వించి (మట్టి బయటికి మోస్తున్న సేవాదళ్ కార్యకర్తల ఫోటో కూడా ప్రచురించారు అంతకు ముందు రోజు) వుంచిన గుంత ని గ్రానైట్ రాళ్లతో తాపడం చేసి, 6’ X 3’ (అటు ఆరు, ఇటు మూడు—యెవరికైనా అదే ప్రాప్తం చివరికి అంటారు పెద్దలు!) “సన్యక్” లో, వుదయం 7-35 కి, “పవిత్ర” గంగ, నర్మద తదితర నదుల ఒడ్డు నుంచి తెచ్చిన “సప్త మృత్తిక” (మట్టి) చల్లారట. 

7-45 కి గంగ, యమున, సరస్వతి(??!!), గోదావరి, కృష్ణ, పెన్నా తదితర పవిత్ర నదుల నుంచి తెచ్చిన జలాల్ని వేదమంత్రాలు చదువుతూ, గుంతలో చల్లారట.

8-35 కి ……”ప్రముఖులు”……చివరిసారిగా “నివాళు”లర్పించారట. 

9-00 కి ……ప్రభుత్వం తరఫున………..”నివాళు”లర్పించారట.
(ఇవన్నీ నేను చూడలేదు. అందుకనే “ట” లతో)

9-10 కి ……దశదానాలు (లవణదానంతో సహా) చేయించారు. (ఈనాడు లో ‘బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము తదితర లోహాలని‘ అని వ్రాశారు. మా చిన్నప్పుడు జీళ్లు అమ్మే అబ్బాయి, “ఇత్తడీ, రాగీ, కంచూ, సేవెండీ, వెండీ, బంగారాలకి జీళ్లు….జీళ్లు…" అని సరదాగా అమ్ముకోడం గుర్తొచ్చింది నాకు.)

ఇంకా, గోవుని…..దానం చేశారు అని కూడా వ్రాశారు. (గోవు మీద వస్త్రం కప్పి వుంచడం తో అది మూపురం వున్నదా లేనిదా తెలియలేదు నాకు. ఈ మధ్య ఇదోటి కదా….మూపురం లేని ఆవులు ఆవులే కాదు, అవిచ్చే పాలు ఆవు పాలే కదుట.)

9-15 కి “ప్రాణోత్కారణ” దోష పరిహారార్థం కోసం “ఉపనిషత్తుల రెండో భాగం”లోని “వేద మంత్రాలను”………దోషాలు అనుభవించినా……తొలగిపోవటానికి….చదివారట. (నిన్నటి పేపర్లో కూడా ఈ వుపనిషత్తుల రెండో భాగం……..మంత్రాల ప్రసక్తి వచ్చింది. ఆ విలేకరికి ఇవన్నీ యెవరైనా చెపితే వ్రాశాడో, తనకి తోచినవి తోచినట్టు వ్రాశాడా అని నా అనుమానం).

(ఈ టపా పూర్తిగా వ్రాసేద్దామనే వుంది కానీ కుదరడం లేదు……అందుకే……)

…….ఇంకోసారి.

8 comments:

జిగురు సత్యనారాయణ said...

కృష్ణ శ్రీ గారు,
మీరు గోదావరి జిల్లా వారా? అపర పండితుల విషయములో మీ భావాలు గోదావరి జిల్లా వారి భావాలకు దెగ్గరగా ఉన్నాయి. వారికి ఈ విషయాలలో పట్టింపులు ఎక్కువట. అపరం చేసే వారిని వివాహాది శుభ కార్యాలకు పిలవరు. కాని ఈ పట్టింపులు అంతటా ఒకేలా లేవు. నాకు తెలిసి గుంటూరు జిల్లా లో పూర్వాపరములు ఒకరే చేపిస్తుంటారు. (ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టడము లేదు, ఏవరి అభిప్రాయాలు వారివి. అయితే ఆ అభిప్రాయాలు అంతట ఒకేలా ఉండవు అని చెప్పటమే నా ఉద్దేశ్యము)

మీకు వేద పండితులు అపరం చేపించ కూడదు అనే భావన ఉన్నట్టు అనిపిస్తుంది. వేదోక్తమైన కర్మ కాండ వేద పండితులు కాక మరెవరు చేయించాలని మీ ఉద్దేశ్యము?

Anonymous said...

కృష్ణశ్రీ గారు, మీరు పాటించేది ప్రాంతీయ ఆచారమా? లేదా శాస్త్రపరంగా అందుకు నిభంధనలు ఏ గ్రంధంలోనైనా చెప్పబడిందా? తెలియజేయగలరు. చావుపుట్టుకలు రెండూ పవిత్రమైనవే ఇది కేవలమాత్మ బట్టలు మార్చుకునే ప్రక్రియ అని భగవద్గీత చెబుతుంది.
శ్రాద్ధ కర్మలను ఆచరించే బ్రాహ్మలు దేవతారాధన చేయరు అనడం సరికాదు, శ్రాద్ధ కర్మల్లోనే దైవప్రార్థన కూడా వుంటుంది అని ఎక్కడో విన్నాను. గయలో శ్రాద్ధం విష్ణు పాదాల వద్ద పెడతారు. మరి విష్ణువును ధ్యానించకనే ఆపని చేస్తారా.

భాస్కర రామిరెడ్డి said...

కృష్ణ శ్రీ గారూ, మీ అనుమతితో ఇక్కడ ప్రచురించిన కొన్ని వ్యాఖ్యలకు ప్రాచుర్యం కల్పించ దలచు కున్నాను. మీకభ్యంతరమైతే వెంటనే తెలియ చేయండి. ఆపి వేస్తాను.

Manjusha kotamraju said...

Krishna sree గారు చెప్పింది నిజమె,శ్రాద్ధ కర్మలు,పూజలు ఒక్కరు చెయరండి ? శ్రాద్దం పెట్టించిన పూజారి తొ మనం వ్రతాలు ,పెళ్ళిళ్ళు చెయించము.. ఇంక ఎవ్వరు లెరు అనె తప్పని పరిస్థితులలొ చెయిస్తారెమొ మరి ??...ఏ మంత్రాలు ఎక్కడ చదువుతారొ పొరపాటున అని ఒక భయమెమో మనలొ..

A K Sastry said...

డియర్ జిగురు సత్యనారాయణ!

నేను ప.గో.జి వాణ్నే అని నా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది కదా?

"అంతటా ఒకేలా 'యెందుకు' లేవు?" అనేదే నా ప్రశ్న.

కర్మకాండ వేదోక్తమైనా, దాన్ని జరిపించేటప్పుడు వేదాలు చదవరు. వేద పండితులు అవి జరిపించరు.

ఈనాడులో వ్రాసిన "వుపనిషత్తులలో రెండో భాగం.....వేద మంత్రాలు" అనేవి "స్మార్తం" లో రెండో విభాగం.

ఇంకా వివరాలు కావాలంటే, మీ ఇంట్లో పూజలూ, వ్రతాలూ చేయించే పురోహితుణ్ని అడగండి. వారికి తెలియకపోతే, ఇక్కడగానీ, నా మెయిల్ ఐడీకిగానీ వ్రాయండి.

నెట్ లో కూడా "దుర్గేశ్వర" లాంటి కొంతమంది వున్నారు. వాళ్లని అడిగినా సరే.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Snkr!

నేను పాటించేది, వేదోక్తమైన, శస్త్రోక్తమైన ఆచారమే. (అది కూడా, నా వ్యక్తిగత నమ్మకాలని ప్రక్కన పెట్టి, మన హిందూ సంస్కృతిలో భాగంగా మాత్రమే!). బాబా మరణ వార్త విన్నాకా, ఆయన సమాధి జరిగాకా, (రెండు సార్లూ) సచేల స్నానం చేసి, జంధ్యం మార్చుకున్నాను. ఈ విషయంలో మీకేమైనా సందేహాలుంటే, మీ ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసే పురోహితులని సంప్రదించి, తీర్చుకోగలరు.

శ్రాధ్ధ కర్మలు (ఆచరించడం కాదు--చేయించే బ్రాహ్మణులు) "ఆ రోజుల్లో" దేతవార్చన, ఆరాధనా చెయ్యరు. శ్రాధ్ధ కర్మల్లో దైవ ప్రార్థన వుంటుంది....యే "పని" అయినా "శుక్లాంబరధరం...."తొనే ప్రారంభం అవుతుంది. (నా తరవాతి టపా చదవండి.)

గయ శ్రాధ్ధం సంగతి కూడా పైన చెప్పినట్టే!

ఇంకేమైనా సందేహాలు వున్నా, ఇక్కడే తీర్చుకోవచ్చు.

A K Sastry said...

డియర్ భా రా రె!

చాలా సంతోషం. నేను ప్రచురించే యే వ్యాఖ్య అయినా త్రికరణశుధ్ధిగా చేసినవే. అందులో యేమీ సందేహం లేదు.

మా నాన్నగారు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ లలో పండితులు. ఇంకా, గణితం, సామాన్య శాస్త్రాల్లోనూ, సాంఘిక శాస్త్రాల్లోనూ నిష్ణాతులు. ఆయనకి రావలసిన ప్రాచుర్యం రాలేదు....అప్పటి పరిమిత వనరుల కారణంగా.

ఆయన పదవీ విరమణ చేసేటప్పటికి (1970) ఆయన పింఛను రూ.35/-. కమ్యుటేషను తరవాత రూ.17-50 పై. నెలకి. (ఇప్పుడు మా అమ్మగారి ఫేమిలీ పెన్షను రూ.3 వేలచిల్లర అనుకోండి. అది వేరే సంగతి.)

నా వ్యాఖ్యలకి ప్రాచుర్యం కల్పిస్తామంటే అంతకన్నా నాకు కావలసిందేముంది!

తప్పకుండా చెయ్యండి.

యెవరికి యే సందేహాలున్నా తీర్చడానికి నేనెప్పుడూ సిధ్ధమే.

అనేక ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Manju!

"ఇంకెవ్వరు లేరు అనే తప్పని పరిస్థితి" ఐనా, వాళ్లు రారు. (మన పురోహితులనీ, వాళ్ల శిష్య ప్రశిష్యుల్నీ సంప్రదించి, ముక్క కొంచెం తక్కువ అయినా 'అడ్జస్ట్' అవండి అని మనకు ముందే చెప్పి, వాళ్లని పంపిస్తారు.) డబ్బుకి కక్కుర్తిపడితే తప్ప!

మన భయమేకాదు....పెళ్లిలో తద్దినం మంత్రాలు చదవడం గురించి యెన్ని జోకులు లేవు?!

ధన్యవాదాలు.