Wednesday, April 13, 2011

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి......



......కళ్యాణం అనే ఓ ప్రహసనం

నిన్న (12-04-2011) అనూచానంగా వస్తున్న శ్రీ సీతారామ కళ్యాణం తో పాటు, "పుష్కర పట్టాభిషేకం" కూడా ఘనంగా, అత్యంత వైభవంగా జరిపిస్తామని ప్రకటించారు.

నాకు ఙ్ఞానం తెలిసినప్పటినుంచీ, ప్రతీ యేడూ జరిగే కళ్యాణాన్ని రేడియో ద్వారా వినడం, తరవాత టీవీలో చూడడం మా నాన్నగారు చేసిన అలవాటు. (అలాగే రిపబ్లిక్ డే పెరేడ్).

మహామహులు అనర్గళంగా వ్యాఖ్యానం చేస్తుంటే, భక్తిభావమో యేదో గానీ, రోమాలు నిక్కబొడుచుకొని, కళ్ల నీళ్లు తిరిగేవి. ఆ రోజులు పోయాయి.

యెందుకంటే......నిన్న జరిగింది చూశాక, యెవరైనా వొప్పుకుంటారు--అది ఒక "తంతు" లేదా "ప్రహసనం" గా మారింది అని.

ముఖ్యంగా, ఇదివరకు వ్యాఖ్యాతలు అక్కడ జరుగుతున్న విశేషాలని మంత్రాలతో సహా విననిచ్చి, మధ్య మధ్యలో వ్యాఖ్యానించేవారు. 

నిన్నటి ఇద్దరు వ్యాఖ్యాతలూ (దూరదర్శన్ లో నాక్కనిపించింది ఇద్దరే మరి) రామదాస విరచితమైన దాశరథీ శతకం లోని నూటయెనిమిదో యెన్నో పద్యాలన్నీ చదివేశారు. మధ్య మధ్యలో అవేవో రామాయణాల్లోని శ్లోకాలు కూడా.

అవి కాకుండా, వాళ్లు చెప్పిన వ్యాఖ్యానమల్లా, "స్వామికి పట్టు పుట్టాలూ, నగలూ అలంకరిస్తున్నారు." "అదిగో! పచ్చల పతకం!" (చింతాకు పతకం ప్రసక్తి రాలేదు యెందుకో!) "మధుపర్కాలు సమర్పించారు." "స్వామికి చెమటలు పట్టకుండా, వీవెనలు వీస్తున్నారు!" (ఇది చాలాసార్లు చెప్పబడింది--వింజామరలూ లాంటి మాటల మార్పిడితో) "జీలకర్రా, బెల్లం పెడుతున్నారు" (దాని అవసరం వగైరాలు), "ముత్యాల తలంబ్రాలు పోసుకొంటున్నారు" "కళ్యాణం అయిపోయింది"--ఇలాగే సాగింది.

ఇదివరకు, కన్యావరణం దగ్గరనించీ, ప్రవరలు చెప్పడం వినిపించి, యఙ్ఞోపవీత ధారణ నుంచీ, పాద ప్రక్షాళణం, ముహూర్తం, మధుపర్క ప్రాశన, తలంబ్రాలు, సప్తపది జరిపించి, మంగళహారతి ఇచ్చేవారు.

ఇప్పుడు--ముందే అనేక "పట్టుపుట్టాల"తోపాటు, మధుపర్కాలనీ పెట్టేసి, నగల అలంకరణకి అనవసర ప్రాథాన్యం ఇచ్చి (ఒక్కో నగనీ 'అర్చక స్వామి' ఓ పది నిమిషాలసేపు అందరికీ.....అంటే టీవీ కెమేరాలకి.....చూపించడం), ముఖ్యమంత్రీ, మరింతమందీ ముత్యాల తలంబ్రాలనీ, పట్టు వస్త్రాలనీ, చెవులమీదనించి దౌడలమీదువా గడ్డం క్రిందనించి కండువాలు కప్పేసుకొని, నెత్తిమీద 'పళ్లాలలో' మోసుకొంటూ.....కారు దిగినప్పటినించీ, కళ్యాణ వేదిక వరకూ......మధ్యలో అవి క్రింద పడేస్తూ, యెడం చేతితో తీసి పైన పెట్టుకొంటూ, అడ్డమైనవాళ్లూ అవి క్రింద పడిపోకుండా వాళ్ల 'నెత్తిమీద చేతులు' వేస్తూ.....ఇవన్నీ అయ్యాక, అప్పుడు "ముహూర్తం". 

కనీసం అందరూ తెచ్చిన వాటిని సంప్రోక్షణ కూడా చెయ్యకుండా, వాడెయ్యడం. అన్నన్ని బట్టలూ, చీరలూ కప్పెయ్యడం యెందుకో మరి. 'స్వామికి చెమటలు పట్టకుండా......' అంటూ వ్యాఖ్యానాలు. నిజానికి మానవమాత్రుడెవరైనా అన్ని బట్టలు కప్పేస్తే, చెమట ధారలుగా మారి, క్రింద ఓ మడుగైపోయేది. స్వామి కాబట్టి తట్టుకున్నాడు. 

అప్పటివరకూ, అలంకరింపబడుతున్నవాటిని చేతులతో ముట్టుకొంటూ మాత్రమే వున్నారు జీయరు స్వాములు. ముఖ్యమంత్రి వచ్చాక చిన జీయరు స్వామి మైక్ అందుకొని, రామాయణమ్మీద వ్యాఖ్యానం మొదలెట్టారు. అది వినపడకుండా, వ్యాఖ్యాతలు.....మామూలే.....పద్యాలూ, శ్లోకాలూ, ఆనందరాముడు, అందాల రాముడు, కళ్యాణరాముడు అంటూ వర్ణనలూ, చెమటపట్టకుండా అని వ్యాఖ్యలూ!    

.........తరువాయి మరోసారి.

4 comments:

Unknown said...

meeru cheppindi aksharaala correct.
ninnati vyakyanam chaalaa chappagaa saagindi. kalyanam choostunna anubhooti ledu.

Anonymous said...

ఇప్పుడు--ముందే ... అప్పుడు "ముహూర్తం".

papers lo photos choosi nenu alage anukunnanu...

A K Sastry said...

డియర్ msrmurty!

నాతో యేకభవించినందుకు చాలా సంతోషం. నాకైతే, చేదుగా, వెగటుగా కూడా అనిపించింది.

ధన్యవాదాలు.

A K Sastry said...

పై అన్నోన్!

సంతోషం.

ధన్యవాదాలు.