.....శాంతి
ఆత్మలగురించి వ్రాయడం మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది. 28-09-2009 న నా ‘ఓసామా’ బ్లాగులో ఆత్మల గురించి టపా వ్రాశాను. దానిమీద వచ్చిన వ్యాఖ్యల గురించి వేరే కొన్ని టపాలు వ్రాయ వలసి వచ్చింది. అదంతా గతం.
మరి ఇప్పుడు మళ్లీ ఇంకో టపా వ్రాయాలని……యెందుకో అనిపించింది.
జీవి మరణించడం అంటే దేహత్యాగం చెయ్యడం. జీవుడు (ఆత్మ) భువర్లోకానికి చేరడానికి ‘కర్మ‘ చేసే కర్తలు దోహదం చేస్తారు. భువర్లోకమెక్కడ వుంది? భూమి చుట్టూ ఆవరించిన వాతావరణానికి పైన, మేఘాల క్రింద వుంది. (నువ్వు చూసొచ్చావా అని అడగకండి.....మన పురాణాలూ, భగవద్గీతలూ అవీ నమ్మితే)
‘పునరపి జననం, పునరపి మరణం‘ అని చెప్పాడు శంకరాచార్యులు.
‘యఙ్ఞమువలన మేఘము కలుగును; (మేఘము వలన వర్షము కలుగును); మేఘము వలన (వర్షము వలన) అన్నము పుట్టును‘ అన్నాడు గీతాకారుడు.
మన ప్రాచీన మహర్షుల దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస నుంచి, అరవిందుడినుంచి, జిడ్డు కృష్ణమూర్తి నుంచి, ఙ్ఞానులూ, యోగులూ, సన్యాసులూ, ఆధ్యాత్మిక గురువులూ, యెవరు చెప్పినా, మనిషి ప్రయత్నించవలసింది ఈ జనన మరణ వలయాన్ని చేదించి, పునర్జన్మ లేకుండా ‘మోక్షాన్ని‘ అంటే కనీసం ‘స్వర్లోక‘ ప్రాప్తిని సాధించమని. అంతే కదా?
(మళ్లీ స్వర్లోకమంటే యేమిటి అంటారా? భూలోక, భువర్లోకాలపైన వుండేది స్వర్లోకం. స్వః+లోకము=(రుగాగమ సంధి అయి) స్వర్లోకము. స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం. అంతేగానీ ఆ లోకం స్వర్గం కాదు!)
అక్కడ చేరితే, క్రమక్రమంగా మహర్లోకానికీ, జనలోకానికీ, తపోలోకానికీ, సత్యలోకానికీ జీవుడు (ఆత్మ) చేరుకోవచ్చు. అందుకే దాన్ని మోక్ష సాధన అన్నారు.
తేలిగ్గా స్వర్లోకానికి చేరడానికి సాధనంగా విశ్వామిత్రుడు “గాయత్రి”ని మనకి ప్రసాదించాడు అని ఇదివరకే చెప్పాను. ఆ మంత్రాన్ని అనుష్టించడం ద్వారా స్వర్లోక ప్రాప్తిని సాధించవచ్చు. (గాయత్రిని ఇష్టం వచ్చినట్టు 'పాడద్దు', సెల్ ఫోన్ లో రింగ్ టోన్లుగా పెట్టుకోవద్దు అని నేనే కాదు, గరికిపాటివారు కూడా టీవీల్లో మొత్తుకొంటున్నాడు.)
(పైనున్న లోకాలు యేడూ కాకుండా, క్రింద మరో యేడు లోకాలున్నాయనీ, మొత్తం 14 లోకాలనీ పెద్దలు చెప్పారు. క్రింద వున్నవి, “అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ” లోకాలు. వాటి గురించి మరో టపా వ్రాస్తాను.)
ఇంక, “నేను క్రితం జన్మలో ఫలనా, ఈ జన్మలో నేను, వచ్చే జన్మలో ఫలనా” అని యెవరైనా ప్రకటిస్తే, ఆయన “ముముక్షువు” కాదు….జన్మరాహిత్యం కోసం ప్రయత్నించడంలేదు….లౌకికంగా ఇంకా బోళ్లు సుఖాలూ, శుభాలూ పొందాలి అనీ, యే సీ లూ, ఖరీదైన కార్లూ, వాటర్ బెడ్లూ, కోట్లాదిగా ధనం, బంగారం, వెండీ, ప్లాటినం, అనేకమంది ప్రముఖ శిష్యులూ కలిగి వుండాలని కోరుకున్నట్టే కదా అర్థం? అలాంటివాళ్లు ప్రపంచంలో యెవరైనా వున్నారా? వుండేవాళ్లా?
కొన్ని నమ్మకాలని హేతువాదులు మూఢ నమ్మకాలు అంటారు. అలాంటి వాటిలో పునర్జన్మ అనేది వొకటి.
అలా అని మన పూర్వులు యెంతో దీక్షతో తపస్సు చేసి, దర్శించి, చెప్పిన విషయాలని మూఢ నమ్మకాలు అనకూడదు కదా?
(ఇది యెవరిమీదో విమర్శ కాదు—గమనించండి.)
మన ప్రాచీన విఙ్ఞానం యెంత గొప్పదో ఒక్కసారి గుర్తు చెయ్యడానికే.
ఇంక, దేహాన్ని వీడిన ఆత్మ ప్రయాణం యెలా సాగుతుంది? అది భువర్లోకంలో యెంతకాలం వుండాలి? అక్కడేమి జరుగుతుంది?
……ఇంకోసారి.
4 comments:
"స్వ:" అనగానేమి వివరించగలరు.
నాకెందుకో ఈ జన్మరాహిత్యం కాన్సెప్టు అంతగా నచ్చదండీ. మానవసేవే మాధవసేవ అంటూ మరి ఆ సేవను కోల్పోయే "భాగ్యం" కోసం ఎందుకు ప్రయత్నిచాలో అర్ధంకాదు. ఈ సమయంలో రామదాసు కోరిన కోరికనొక్కసారి గుర్తుతెచ్చుకోవాలి.
(నేనంత వుత్తముణ్ణికాదుగానీ నాకు ఈ సోకాల్డు ఇహమే నచ్చింది :D పరం మీద నమ్మకంలేదు)
అయ్యబాబోయ్ ఎన్నో కొత్త విషయాలు, తర్వాత టపా కోసం నిరీక్షణ..
బాగా చెప్పారు, లోకాల గురించి
డియర్ Indian Minerva!
భూః అంటే యేమిటి? భూలోకం. అదే మనం నేడు నివశిస్తున్న భూమి. అలాగే స్వః. అంటే అదో లోకం. దానిపేరది! ఇంకేమి వివరించగలను?
"శ్రీ రామదాసు" సినిమా ప్రకారం అలా అనుకుంటున్నారేమో! రామదాసు కూడా మోక్షాన్నే కోరాడు. ఆయన కీర్తనలు చదవండి/వినండి.
ఇంక, మానవసేవే మాధవ సేవ.....కొన్ని శతాబ్దాలుగా ఈ కాన్సెప్ట్ లేదంటారా? వుంది. కానీ సేవ అంటే....జీవుడి జీవ యాత్రని సాధ్యమైనంతవరకూ సుఖంగా (కష్టరహితంగా) గడపడానికి తోడ్పడడం. ఆపై, సాధ్యమైనంత తక్కువ వేదన (బాధ) తో శరీర త్యాగానికి దోహదం చెయ్యడం!
అందుకే, మరణించబోతున్న వ్యక్తికి వాళ్ల జీవితకాలం లో తీర్చుకోలేని కోరికలని, వాళ్ల వారసులు, "మేము తీరుస్తాము" అని చేతిలో చెయ్యివేసి ప్రమాణం చేసి, ఆ జీవుడు వెళ్లిపోవడానికి దోహదం చేస్తారు. (అలా చేస్తే అది 'ప్రేతాత్మగా' వుండిపోదు అని మన పెద్దలు చెప్పింది.)
28 రోజులపాటు, సత్యసాయి జీవుడిని "గమించకుండా" సో కాల్డ్ "ఆధునిక వైద్య" పధ్ధతుల ద్వారా "జీవింప" చెయ్యడం ఆయనకి "సేవ" చేసినట్లా? ఆ జీవుడు యెంత "మరణ" వేదన అనుభవించడో కదా?
ఇంక జీవుడు (ఆత్మ) అంటే యేమిటి? మనం తీసుకొనే "శ్వాస" మాత్రమే! ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు కొందరు. అంటే, మన ఆత్మని మనం తెలుసుకోవడమే అని అర్థం కావడంలేదూ? అలాగే, సమస్థ జీవులకీ "శ్వాస క్రియ" జరుగుతుంది యేదో ఒక రూపం లో. చెట్టూ పుట్టలకి కూడా!
వెంటిలేటర్ అంటే యేమిటి? మన యిళ్లలో వేడిగాలి బయటికి పోవడానికి పెట్టుకొనే గోడపైని చిన్న కిటికీల్లాంటివి కాదు. ముక్కుకీ, నోటికీ సంబంధం లేకుండా, వూపిరి తిత్తులకి నేరుగా శ్వాసని సరఫరా చెయ్యడానికి, నోట్లోంచి పెట్టే ఓ సన్నని ప్లాస్టిక్ గొట్టం! (ఆత్మ దేహాన్ని వదలి వెళ్లకుండా తాత్కాలికంగా చేసే యేర్పాటు!)
ఇలాంటి కేసులకే, "యుథనేషియా" అనీ, దాన్ని అనుమతించాలనీ ప్రచారం జరుగుతోంది!
ఇంకేమైనా సందేహాలున్నా, వ్రాయండి. నా బుర్రకి తట్టినంతవరకూ జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు.
డియర్ గిరీష్!
చాలా సంతోషం!
మన ప్రాచీన విఙ్ఞానాన్ని గ్రహించడంలో మీ ఆసక్తికి స్వాగతం.
తప్పక వ్రాస్తాను. చదువుతూ వుండండి.....వ్యాఖ్యలూ, నా సమాధానాలూ కూడా.
ధన్యవాదాలు.
Post a Comment