Saturday, May 7, 2011

ఆత్మ…..-2



…..శాంతి 

ఇంక, దేహాన్ని వీడిన ఆత్మ ప్రయాణం యెలా సాగుతుంది? అది భువర్లోకంలో యెంతకాలం వుండాలి?

ఇంగ్లీషువాళ్లు మనకి అంటకట్టినవి—“మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్”—వాడి (ఆయన) ఆత్మకి శాంతి కలుగు గాక! లాంటివి!

ఆత్మకి శాంతి యెప్పుడు కలుగుతుంది? “ప్రేతశ్చ దహంచైవ తాపోపశమనార్థం” అంటూ, ఆ ఆత్మని అవాహన చేసిన బొమ్మరాయికి (గులక రాయికి) వుదకంతో (నీళ్లతో) అభిషేకం చేసి చల్లబరచినప్పుడే. (ఖననం చెయ్యబడ్డవాళ్ల ఆత్మలకి మంత్రం కొంచెం మారుతుంది కానీ, పధ్ధతి వొకటే)

సరే. ఆ ఆత్మ చల్లబడి, (శరీరంలో యే రంధ్రంలోంచీ మళ్లీ చొరబడలేక), ఆ చుట్టుప్రక్కలే తిరుగుతూ వుంటుంది. 

కర్మ చేసే వ్యక్తి, “నిత్యవిధి” చేస్తూ, (వుడకేసిన అన్నాన్ని, ఆ ఆత్మకి నైవేద్యం పెడుతూ, దాన్ని ప్రతీరోజూ కాలవ/నది లో కలిపేస్తూ) ఆ నీటిని భూశయనం చేసిన ప్రదేశంలో పైన కట్టిన ఆ”పిడత”లో పోస్తూ, ఆ నీళ్లు చుక్క చుక్కగా ఆ ప్రదేశం పై పడుతుంటే, ఆ ఆత్మ నెమ్మది నెమ్మదిగా ప్రయాణం ప్రారంభిస్తుంది—పైకి—అంటే “భువర్లోకానికి”. 

ఆ మధ్యలో యెన్నెన్నో అడ్డంకులు—“వైతరణి” లాంటివి! “పుత్” అనే నరకం లాంటివి! (అపుత్రస్య గతిర్నాస్తి!). 

దానికోసం, “గోదానం” చేస్తే, ఆ గోవుతోక పట్టుకొని, జీవుడు వైతరణిని దాటుతాడు(ట). ఆ దానం పుత్రులే చెయ్యాలి. “పున్నామ నరకం” దాటాలంటే, పుత్రులే కావాలి. కాబట్టే “అపుత్రస్య……”.

ఈ లోపల, మనకి ఓ నెల ఐతే, ఆత్మలకి ఓ రోజు(ట). అందుకనే “మాసికాలు” పెడతారు. (త్రైపక్షికాలు అంటే, 45 రోజులకి పెట్టేవి—అంటే టిఫిన్లలాంటివేమో నాకు తెలీదు). అలా 12 మాసికాలు పెట్టేటప్పటికి, ఆత్మ 12 రోజుల యాత్ర పూర్తిచేసుకొని, తన పూర్వీకులని చేరుకొంటుంది(ట).

13వ రోజున, ఆ ఆత్మని (జీవుడిని) మంత్రసహితంగా, వాడి ముత్త ముత్తాత ఆత్మతో “సపిండీకరణం” చేస్తారు. అప్పటికి వాడి ముత్త ముత్తాత స్వర్లోకానికి గమించినట్టే! అక్కడినించీ, తన ముత్తాత (తాత తండ్రి); తాత (నాన్న తండ్రి) నాన్న (తండ్రి) కి “పిండాలు” పెడితే సరిపోతుంది.

ఆత్మ భువర్లోకానికి చేరాక, మనకి ఒక సంవత్సరమైతే, వాళ్లకి ఓ రోజు(ట). అందుకని, సంవత్సరానికొకసారి “తద్దినాలు” పెడతారు. ఆ రోజున, “పితృ, పితామః, ప్రపితామః” లకి పిండాలు పెట్టి, అవి ఓ కాలవలో కలిపెయ్యడమో, ఓ ఆవుకి పెట్టడమో చేస్తే, వాళ్ళు ఆ ఆహారాన్ని నేరుగా తిన్నట్టే భావిస్తారు. ఇంకా ఓ పిడికెడు అన్నాన్ని “భోక్తల” కి వడ్డించే ముందు తయారు చేసి, ఆ ముద్ద (పిడచ)--తంతు ముగిశాక, ఓ యెత్తైన ప్రదేశంలో పెట్టి, ఓ కాకి ఆ పిడచని తినాలని యెదురు చూస్తారు. అలా యే కాకీ రాకపోతే, ఆయనకి ఇంకా తీరని కోరికలు వున్నాయనీ, అవి తీరుస్తామనీ మ్రొక్కుకొంటారు. (పియ్యి తినెడు కాకి పితరుడెత్లాయెరా? అని వెక్కిరించాడు వేమన!)

భోక్తలు (అంటే భోజనం చేసేవాళ్లు) ఇద్దరుంటారు. ఒకళ్లని “విశ్వేదేవతల” ప్రతినిధి గానూ, ఇంకొకరిని పితృ దేవతల ప్రతినిధిగానూ ఆవాహన చేసి, తృప్తిగా భోజనాలు పెడతారు—పెసర ముద్ద పప్పూ, నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్లూ, చారూ, గారెలూ, ఇంకా వోపిక వుంటే బూరెలూ, అరిశెలూ, (వాటిన్నింటికీ సరిపడా ఆవునెయ్యితో), అన్నం పరమాన్నం, పెరుగూ తో. (వంటకాల్లో వాడవలసిన కూరలూ, పదార్థాలకి కొన్ని నిషేధాలు వున్నయి. అవి వాడరు.)

అలా ప్రతి సంవత్సరం (అంటే వాళ్లకి ప్రతి రోజూ) పితృ దేవతల ఆకలి తీరుస్తారు.

(ఈ విషయమ్మీద ప్రస్తుతానికి టపాలు ముగిద్దామనుకొంటున్నా--మిగతా టపాలు వెనకబడుతున్నాయని. మళ్లీ యెవరైనా అడిగినప్పుడో, నాకు సమయం దొరికినప్పుడో మళ్లీ కొనసాగిస్తాను.)

అందుకే………మరోసారి.

No comments: