Sunday, May 1, 2011

అంత్యక్రియలు అనే.....4ఆచారాలు

శైవ మతస్తులు--బ్రాహ్మణులూ, సాలి, కంసాలి, రజక మొదలైన కులస్థులు--మరణం సంభవించగానే, దేహాన్ని వీలైనంతవరకూ పద్మాసన స్థితిలో కూర్చోబెట్టి, రావలసిన వాళ్లందరూ వచ్చాక, వెదురు కర్రలతో ఓ మందిరం కట్టి, దానికి రంగు కాగితాలతో అలంకరించి, దేహాన్ని అందులో కూర్చోబెట్టి, తల ముందుకు వాలకుండా వెనక ఓ గుంజకి త్రాళ్లతో కట్టి, వాహకులు అంతిమ యాత్ర నిర్వహించేవారు, బుక్కా చల్లుతూ (బుక్కాతోపాటు పువ్వులూ, చిల్లర పైసలూ పైకి యెగరేసేవారు కొంతమంది), వాయిద్యాలతో (అవి వాయించే పధ్ధతిని "చావు డప్పులు" అనేవారు). తరవాత అదే స్థితిలో "ఖననం" చేసేవారు (మందిరం మినహా). 

(చాలా వూళ్లలో 'శైవ కులస్థుల శ్మశానాలు' వేరే వుంటాయి గమనించండి. ఈ మధ్య అవి--ఈ ఆచారం చాలా మటుకు అంతరించడంతో--ఆక్రమణలకి గురి అయ్యాయని ఆందోళనలు సైతం జరుగుతున్నాయి!) 

మా తెలుగు మేష్టారొకాయన యేదైనా ప్రశ్న వేసినప్పుడు యెవరైనా తలను అటూ, ఇటూ వూపుతుంటే, "కంసాలి శవం లా యేమిటా బుర్ర వూపడం--నోరు విప్పి యేడువు!" అని తిట్టేవారు.

క్రిస్టియన్లు, దేహాన్ని ఓ తెల్ల వస్త్రంలో చుట్టి, (వీలైనంతవరకు "మమ్మిఫై" చేసి), శవపేటికలో వుంచి, శవపేటికకి చుట్టుప్రక్కల రంధ్రాలు చేసి, ఆ శవపేటిక పళంగా సమాధి చేస్తారు. మృతుడికి సంబంధించిన ఆడవాళ్లు కూడా ఈ "బరియల్" ని చూస్తారు. 

మహమ్మదీయులైతే, మూతతో వున్న పల్లకీ లాంటి శవపేటిక (అందరికీ ఒకటే) లో దేహాన్ని మోసుకొచ్చి, అంతకు ముందే తవ్వి వుంచిన గోతిలో ఆ దేహాన్ని మాత్రమే (పేటిక కాకుండా) వుంచి, సమాధి చేస్తారు. ఆడవాళ్లు శ్మశానానికి వెళ్లరు. 

పార్శీలైతే, వాళ్ల ఆచారం ప్రకారం దేహాన్ని ఓ యెత్తైన కొండ మీదికి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు(ట.)......గ్రద్దలకీ, రాబందులకీ ఆహారంగా.

ఇంకా కొన్ని దేశాల్లో, మతాల్లో వివిధ (వింతైన) ఆచారాలు వున్నాయట.

సిక్కులూ, బౌధ్ధులూ మొదలైనవాళ్ల గురించి పెద్దగా పైకి రాలేదు కాబట్టి మనకి తెలీదు.

శంకరాచార్యులవారు యేడేళ్లకే సన్యాసం స్వీకరించి, దేశమంతా పర్యటించి, అప్పటి సో కాల్డ్ పండితులనందర్నీ తన "తర్క, మీమాంస" శాస్త్రాల పాండిత్యంతో వోడించి, "దాసోహం" అనిపించుకొన్నాడు. హైందవాన్ని సంస్కరించాడు.

ఆమ్రపాలి ఆయనని "శృంగారం గురించి మీకేమి తెలుసు?" అని అడిగేసరికి, జవాబుకి ఓ సంవత్సరమో యెంతో గడువడిగి, అప్పుడే మరణించిన కాశీ రాజో యెవరో, వాడి దేహంలో (పరకాయ ప్రవేశ విద్యతో) ప్రవేశించి, 'తన అనుభవాలని ' ఆమెకి చెప్పి, ఆమెని కూడా జయించాడు(ట).   

తెనాలి రామలింగడు తన "తిలకాష్ట మహిష బంధనా"లతో అలాంటి కొంతమంది మహా పండితులని వోడించాడు.   

......మరోసారి.

12 comments:

Indian Minerva said...

నేను ఎవరో కౌముండకుడనే ఆయన భార్య అడిగినట్లు చదివాను. ఆవిడపేరే ఆమ్రపాలినా? సరస్వతీదేవి సరస్వతీ పీఠాన్నధిరోహించే విషయమై ఒక అభ్యంతరాన్ని లేవనెత్తుతుందనీ, ఈయన సమాధానమిచ్చి మరీ పీఠాన్ని అధిరోహిస్తారనీ చదివాను.

ఆత్రేయ said...

శంకరులు మండన మిశ్రుడు అనే (మిధిల , బీహార్ ) తత్వ వేత్త భార్య ఉదయ భారతి తో కామశాస్త్రమ్ లో వాదన కోసం, (ఆయనకు స్వయం గా ఆ శాస్త్రం లో ప్రవేశం లేక పోవటం వల్ల అప్పుడే చనిపోయిన కాశిరాజు శరీరం
లోకి పరకాయ ప్రవేశం చేసి ఆ శాస్త్రం లో పరిజ్ఞానం సంపాదించి మరీ గెలిచారు) అటుపిమ్మట మండన మిశ్రుడు శ్రీ సంకరులకు శాశ్వత శిష్యులయ్యారు.

Indian Minerva said...

ఆత్రేయ గారు: వివరించినందుకూ, సరిచేసినందుకూ Thanks

కృష్ణశ్రీ said...

డియర్ Indian Minerva!

ఈ విషయంలో అనేక కథనాలున్నాయి--మన ఇతిహాసాల్లాగే.

కౌముండకుడనే పేరు నాకు గుర్తులేదు. ఆయన భార్య పేరు ఆమ్రపాలినా అన్నది కూడా నాకు తెలీదు.

సరస్వతీ పీఠం అధిరోహించడానికి కొంతమంది అభ్యంతరం చెప్పారనీ, (నిజంగా అర్హతలేనివాళ్లు ఆ పీఠాన్ని అధిరోహించలేరు అనీ) అయినా శంకరులు తెగించి ఆ పీఠాన్ని అధిరోహించగలిగారు అనీ ప్రచుర కథనం. ఇందులో ఆమ్రపాలో, ఇంకెవరో ప్రసక్తి లేదు. (సరస్వతీ పీఠం యెక్కడో హిమాలయాల్లో వుంది అంటారు--మిథిల, బీహారు, మహారాష్ట్రలకి దీనితో సంబంధం లేదు.)

నా ఇబ్బందల్లా, నాకు దొరికిన కాస్త సమయంలోనే ఓ టపా వ్రాయడానికి ప్రయత్నిస్తానా.....కొన్ని పేర్లూ అవీ "చప్పున" గుర్తుకి రావు. అందుకే "అదేదో", "వాడెవడో" అని వ్రాసేస్తాను. (ఆలస్యమైతే ఆ టపా "స్టేల్" అయిపోతుందని నా ఆదుర్దా. అంతకన్నా యేమీ లేదు. అయినా చాలా మందికి కోపాలు వస్తున్నాయి--అసలు విషయం వొదిలిపెట్టి!).

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ ఆత్రేయ!

మండన మిశ్రుడి కథ నాకు తెలుసు. ఉదయభారతి గురించి వినలేదు. మండన మిశ్రుణ్ని జయించడం ఆయన జైత్రయాత్రలో ఓ పెద్ద మైలు రాయి.

పై వ్యాఖ్యకి నా సమాధానం చదవండి.

"శ్రీ" శంకరుణ్ని, "సంకరుడు" చెయ్యద్దు దయచేసి!

అయినా ఇక్కడ "ముఖ్య విషయం" ఆయన "హైందవాన్ని" సంస్కరించాడు అనేదే కదా? అప్పట్లో, ఇప్పటిలాగే, ప్రతీవాడూ ఓ పండితుడు. తన మతం, అభీష్టం, దేశంలో అందరూ ఆచరించాలని పట్టు పట్టేవారు. శైవానికీ, వైష్ణవానికీ మధ్య గొడవలు పేట్రేగి, జనం నిజంగా కొట్టుకు చచ్చేవారు! అందుకే ఆయన "అద్వైతాన్ని" ప్రవచించాడు.

అది వొప్పుకుంటే చాలు.

కృష్ణశ్రీ said...

డియర్ Indian Minerva!

మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు.

Indian Minerva said...

అయ్యో... నాకు కోపం రావటమేమిటండీ... ఏదో నాకు తెలీక నేను మిమ్మల్నడుగుతుంటేనూ. మీకలా అనిపించేలా నేనేమైనా రాసుంటే క్షమించండి.

ఆత్రేయ said...

శంకరులు అనే మాట తప్పుగా పడటానికి కారణం నేను కాదు ట్రాన్స్లిటరేషన్.
నా సవరణ సరియినదే అని నేను నమ్ముతున్నాను
తెలియక పోతే / గుర్తులేక పోతే నేను రాయను.
ధన్యవాదములు

కృష్ణశ్రీ said...

డియర్ Indian Minerva!

కోపాలు వస్తున్నది మీకు కాదు. వాడెవడో అనగానే, "వాణ్ని" అవమానించేశానంటూ యెగిరిపడుతున్నవాళ్లకి. (నా "సాహితీ" బ్లాగులో, "యేకవచన ప్రయోగం" టపా చదవండి!)

బై ద వే, మీ క్రొత్త టపా (ఎలియన్స్) చదివాను. చాలా బాగుంది. వెంటనే ఫాలో అవడం మొదలు పెట్టాను.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ ఆత్రేయ!

తప్పు మీది కాదని తెలుసు. కానీ, పబ్లిష్ చేసేముందు ఒకసారి "ప్రివ్యూ" చూడడం అలవాటు చేసుకోండి.

మీరంత ఘంటాపథంగా చెపుతున్నారంటే, వాటి మూలాలు మీకు తెలిసే వుంటాయి అనుకుంటా. తప్పకుండా సరియైనవే అనుకుంటాను.

మరోసారి ధన్యవాదాలు.

దుర్గావఝుల said...

కృష్ణశ్రీ గారు, నాదో సందేహం ఈ సందర్బంలో గరుడపురాణ పఠనం ఆవశ్యకత కేవలం మనో వ్యాకులత నివారణ కోసమేనా?

కృష్ణశ్రీ said...

డియర్ దుర్గావఝుల!

ఈ విషయం నాకు నిజంగా తెలియదు. అసలు ఈ ఆచారం యెప్పుడు, యెందుకు ప్రవేశ పెట్టారో మరి. బహుశా, శ్మశాన వైరాగ్యం నుంచి తొందరగా బయటికి వస్తారనీ, ఆత్మ సుఖంగానే వుంటుంది అనే ధైర్యం కోసమూ అయ్యుంటుంది.

ఇప్పుడు సింపుల్ గా "ఘంటసాల భగవద్గీత" తో సరిపెడుతున్నారు. యెవరింట్లోనైనా అది వినిపిస్తే, "యెవరో?" అని సందేహం వచ్చేస్తూంది!

ధన్యవాదాలు.