Sunday, May 29, 2011

"మా" లాలిగాడు......



.....వాడి "బదారు పువ్వులు"!

"లాలిగాడు"! కొంతమంది "లాల్ గాడు"; "లాలుగాడు" ; "లల్లీగాడు" అనికూడా పిలిచే వాడి పేరు (గాడు మినహా) వాళ్లమ్మా నాన్నా పెట్టారోలేదోగాని, "వాడు" కులరీత్యా మాలవాడు; వృత్తిరీత్యా యాదవుడు--గో, మహిష (గేదెలని ఇలా అనచ్చా?!) పాలుడు! (లాలూ ప్రసాద్ యాదవ్ కి వీడి పేరే పెట్టారేమో తెలీదు.)

మా వయసు యేడెనిమిదేళ్లప్పుడు, వాడి వయసు మొదటి ముఫ్ఫైలలో అనుకుంటా! 

ఓ బ్రాహ్మణ భూస్వామి పొలంలోని కళ్లంలో ఓ పాకవేసుకొని, కాపలా నిర్వహిస్తూ, ఆయన ప్రోద్బలంతోనే, ".....పాల" వృత్తిని స్వీకరించాడు......యెప్పుడో తెలీదు. తెల్లవారుతూనే లేచి, ఓ నాలుగు కిలోలు నడిచి, గోదావరి వొడ్డువరకూ వెళ్లి, అక్కడనించి వాళ్ల భూస్వామి గారి ఆవులనీ, గేదెలనీ తోలుకొంటూ, దారిలో మిగిలినవాళ్ల పశువులని కూడా తోలుకొంటూ, తన "ఇంటి" దాకా తీసుకెళ్లి, పగలంతా ఆ చుట్టుప్రక్కల మేపి, సాయంత్రానికల్లా మళ్లీ తోలుకొంటూ, యెవరి పశువులని వాళ్లకి అప్పచెప్పేవాడు.

విశేషమేమిటంటే, వూరి జనాలెవరూ "గడియారాలు" చూడవలసిన అవసరం వుండేదికాదు. వాడి "మంద" మా యింటిదాకా వచ్చేసరికి వుదయం ఖచ్చితంగా 9.00; సాయంత్రం శీతాకాలమైతే 3.00, వేసంకాలమైతే 4.00!

ఇంక, వర్షాలు వెనకబట్టగానే, దగ్గరలోని మెరకలో, స్వయంగా రాగిడిమట్టితో ఇటుకలు తీసి, యెండాక "ఆఁవ" వేసి, వ్యాపారం చేసేవాడు. యేదో వేణ్నీళ్లకి చన్నీళ్లు! వాడికి భార్య వుండేది. సంతానం సంగతి తెలీదు. ఆవిడకూడా వాడికి సహకారం అందించేది--మట్టి తొక్కీ, నీళ్లు కలిపీ, యెండిన ఇటుకలని పేర్చీ, కాల్చడానికి సరిపడా పుల్లలూ అవీ సేకరించీ--ఇలా "కార్యేషు దాసీ......" వగైరాల్లా!

ఇంక, దసరాలకీ, అట్లతద్దికీ, పగటివేషాలు వేసేవాడు. ఇంటింటికీ తిరిగి, యెవరేమిస్తే అవి తీసుకొనేవాడు. దసరాల్లో వచ్చినవాటితో పేదలకి "అన్నదానం" చేసేవాడు! అట్లతద్దికి వచ్చినవి, గొంతెమ్మ పండుగకి ఖర్చుచేసేవాడు! (మిగిలినవాళ్ల మందిరాలు సామాన్యంగా వుంటే, లాలిగాడి మందిరం ప్రత్యేకంగా మెరిసిపోయేది!)

వాడు వేసిన వేషాల్లో నాకు గుర్తున్నవి రెండే రెండు--ఒకటి కాళిక వేషం, రెండోది అర్థనారీశ్వరుడి వేషం!

వాడి వెనక ఇద్దరో ముగ్గురో డప్పులవాళ్లూ, ఓ హార్మణీవాడు కూడా వచ్చేవారు. మాఇళ్లకి ఓ ఫర్లాంగు దూరం వాడొచ్చాడంటేనే, పిల్లలందరూ పొలోమంటూ "లాలిగాడొస్తున్నాట్ట" అంటూ పరిగెత్తేవాళ్లం--యేవేషం వేశాడో చూద్దామని! 

కాళిక వేషం వేశాడంటే, మేకప్పు యెలా చేసుకొనేవాడో వూహించలేముగానీ, నోట్లోంచి భయంకరంగా వ్రేళ్లాడుతున్న, రక్తం బొట్లు కారుతున్న, యెర్రని నాలుకా, ప్రక్కన తెల్లని కోరలూ, ఓ మెరుస్తున్న అట్ట కిరీటం, బానపొట్టా, నల్లటి గౌనుతో దుస్తులూ, వంటిచుట్టూ ఆకులూ, కొమ్మలూ, ఓ చేతిలో ఓ త్రిశూలం, ఇంకో చేతిలో ఓ కల్లు ముంతా! (నిజంగానే కాళికాదేవి రాక్షసుల రక్తం, కల్లూ తాగేదిట!)

విపరీతమైన ఆవేశంతో చిందులు చేస్తూ వచ్చేసేవాడు....వాడి నడుంచుట్టూ ఓ బలమైన త్రాడు కట్టి, దాంతో వెనక్కి లాగేవాడు ఒకడుండేవాడు! (వాడి ఆవేశం లో నిజంగా "కల్లు" పాత్ర కూడా వుందని అనుకొనేవారు జనాలు! అది నిజం భక్తి తో వచ్చిన పూనకమో, కల్లు మహాత్మ్యమో యెవరికీ తెలీదు!) చంటి బిడ్డ తల్లులు వాళ్లకి తమ కొంగులు కప్పేసేవారు.....తాము చూడకుండా వుండలేరు కాబట్టి.....పిల్లలు దడుచుకుంటారేమోనని! మేమైతే, వాడో అడుగు ముందుకు వేస్తే, కెవ్వుమని అరచుకుంటూ నాలుగడుగులు వెనక్కి వేస్తూ, అలాగే అనుసరించేవాళ్లం.

ఇంక అర్థనారీశ్వర వేషం వేస్తే, (మామూలుగా వాడెప్పుడూ జుట్టూ, గడ్డం, మీసం గొరిగించుకున్న దాఖలాల్లేవు.....వాటంతట అవి వూడిపోవడమే! మాకు తెలిసేటప్పటికి తన జుట్టు చక్కగా పిలక జడ వేసుకొని, నెత్తిమీద చుట్ట చుట్టి, పైన తలపాగా కట్టేవాడు. మెలిత్రిప్పిన మీసాలూ, చిన్న పిల్లి గడ్డం లాంటిదీ కూడా వుండేవి.) జుట్టుని మధ్యపాపిడి తీసి దువ్వి, శివుడి పోర్షనుని చుట్టచుట్టీ, రెండో వైపుని వాలుజడ అల్లి, పువ్వులు కుట్టుకొనీ, సగం మీసం, సగం గడ్డం గొరిగించుకొనీ, ఓ నల్లటి బట్టని వాడి దేహంలో సగభాగం కప్పేలా తలపైనుంచి వ్రేళ్లాడేసుకొనీ, ఓ వైపు సగం రవికా, కాలికి చీరా చుట్టుకొని, రెండో వైపు చాతీ అనాఛ్ఛాదితంగా, మొలకి గేదె చర్మం చుట్టుకొని, శివుడి వైపు నెత్తిమీద మెరుస్తున్న ఓ అట్ట నెలవంకా, ఆ పైన నెత్తికి చిల్లు పెట్టిన ఓ రబ్బరు ఆడపిల్ల బొమ్మా, దానికి క్రింద చిల్లులోంచి ఓ రబ్బరు గొట్టం, ఆ గొట్టం చివర, చంకక్రింద ఓ రబ్బరుబ్లాడరూ, దాంట్లో నీళ్లూ! అదీ వాడి వేషం. తలపై వ్రేళ్లాడే గుడ్డని కాసేపు శివుణ్ని కప్పుతూ, కాసేపు పార్వతిని కప్పుతూ, నటించేవాడు!

మా సరదా యేమిటంటే, ప్రతీ యింటిముందూ వాడు కాసేపు ఆడగానే, వాళ్లిచ్చినది తీసుకొని వెళ్లిపోబోతూంటే, "లాలీ! గంగని వదులు!" అని అరిచేవాళ్లం. తన చంకలోని బ్లాడరుని ఓ సారి వత్తితే, కొప్పులోని బొమ్మ నెత్తిమీంచి ధార పైకి చిమ్మేది!

చిత్రమేమిటంటే, వాడోసారి తనచేతిలోని పెద్ద బాణాకర్ర చుట్టూ ఓ కాలు మెలివేసుకొని, కుంటుకుంటూ, గుండ్రాలు తిరుగుతూ డ్యాన్సు చేస్తూ అడుక్కోడానికి వస్తే, మా తాతగారు వాణ్ని గుర్తుపట్టలేదు. "చెయ్యి ఖాళీలేదు. పైకెళ్లు" అన్నారాయన! వాడు "పైకెళ్లమంటే పోతామేటండి?" అన్నాడు కొంచెం వెకిలిగా పళ్లు బయటపెట్టి. అంతే.....ఆయనకి చిర్రెత్తుకొచ్చి, తనచేతిలోని పెద్ద కర్రతో వాడిమీదకి వొంటికాలిమీద వెళుతూ, "భడవకానా....." అంటూ వొకటి వెయ్యబోయారు. "....అయ్ బాబోయ్! నేనండి...." అంటూ తనవేషం కొంచెం తొలగించి చూబించేసరికి, మా తాతగారు మళ్లీ "భడవకానా! నువ్వట్రా!" అని నవ్వుతూంటే, మా ఇంటిల్లపాదీ వొకటే నవ్వు! తరవాత వాడెప్పుడు కనిపించినా, ఆయన "భడవకానా" అంటూనే, చేతిలోయెంతవుంటే అంతా వాడి చేతిలో పెట్టేసేవారు! అంత సహజంగా వుండేవి వాడి వేషాలు.

ఇంక "బదారు" సంగతి యేమిటీ అని విసుక్కొంటున్నారా! అక్కడికే వస్తున్నా!   

(.......మరోసారి!)

No comments: