Saturday, May 28, 2011

"లాభసాటి...........వ్యాపారాలు"

వెండీ, బంగారం, ఇతర లోహాలూ, పప్పులూ, వుప్పులూ, ఆయిల్లూ, ఇతర కమోడిటీలూ, షేర్లూ, డెరివేటివ్ లూ, రియల్ ఎస్టేట్.....ఇవేవి కాదు....ఇవాళ లాభసాటి వ్యాపారాలు రెండే రెండు--రాజకీయాలూ, భక్తీ!

రాజకీయాలగురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది; భక్తి గురించి యెంత యెక్కువ మాట్లాడినా యెవడూ లెఖ్ఖచెయ్యడు!

ఇవాళ (27-05-2011) ఈనాడు ప గో జి ఎడిషన్లో మెయిన్ హెడ్డింగ్--"లక్ష తమలపాకు అర లక్ష". అంటే ఒక్కో ఆకూ 0.50 పైసలు!

మా చిన్నప్పుడు, మిగిలిన కులాలవాళ్ల సంగతేమోగానీ, బ్రాహ్మణ ఇళ్లల్లో, యెంత పేదవారైనా, చందన చర్చలూ, తాంబూల చర్వణాలూ వుండేవి. (చదవండి శ్రీపాద వారి రచనలు.)

చందనం సంగతి ప్రక్కనపెడితే, మా చిన్నప్పుడు (శ్రీపాదవారి చిన్నప్పుడు కాదుస్మీ!) ఓ మోద తమలపాకులు అంటే 150 ఆకుల లెఖ్ఖ. మోద పదిహేను పైసలు. అంటే 10 ఆకులు ఓ పైస. మరీ సరుకు లేకపోతే, మోద పావలా! ఆకులని అరటి తడపలలో చుట్టి, ఆరారగా తడుపుతూ, తాజాగా వుంచుతూ, మనం కొన్నాక కూడా మరోసారి తడిపి మన చేతుల్లో పెట్టేవాళ్లు! 

అవీ, వయోవృధ్ధుడి అరచేయి పూర్తిగా చాపితే యెంత వుంటుందో అంత సైజులో, (ముదిరిపోయి, ముట్టుకుంటే పిట్లిపోయేవి కాదండోయ్!) వయసులో వున్న ఆడవారి అరచేతులంత మృదువైన లేత తమలపాకులు! ఓ మోద తెచ్చుకొంటే, నెల్లాళ్లూ భార్యా భర్తలిద్దరికీ సరిపోయేవి. 

భోజనమయ్యాక, పడక మంచమ్మీద చేరి, ఆకులకి సున్నం రాసి, మధ్యకి మడిచి, సున్నితంగా క్రింది చివళ్లు త్రుంచి, తొడిమనుంచీ ఈనెలని తొలగిస్తూ ఆకుని రెండుగా విభాగించి, కాస్త పచ్చ కర్పూరం, రెండు కుంకంపువ్వురేకలూ, కొంచెం కుజానా పువ్వూ విదిల్చి, కొంచెం వక్కపొడివేసి, చిలకచుట్టి, వ్రేళ్లకి తగిలించుకొని, భర్తకోటి నోటికందించి, తానోటి నోట కరచుకొని.....ఇలా....ఓహ్!  (మా అమ్మకి నేను యెడపిల్లాడిగా వున్నప్పుడు, ఆ సమయంలోకూడా అమ్మ ప్రక్కనే వుంటే, మానాన్న తన నోట్లోంచి "తమ్మి" నేరుగా నా నోట్లో పెట్టి, పోయి ఆడుకో అనేవారు!)   

ఇప్పుడు మోద అంటే 100 ఆకులేనట! అవీ, మొదటి నాణ్యత ఆకులు (పైన చెప్పినంత మృదువైనవీ లేతవీ కాకపోయినా, ఒకే సైజు వుండేవి) మోద 300 నించీ 450 వరకూ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదలైన రాష్ ట్రాలకి యెగుమతి అయిపోతాయట. (అక్కడ అసలైన శివసేన, బీజేపీ మార్కు హిందువులుంటారట. అక్కడ అవి యెంతకు అమ్ముకుంటున్నారో మరి!)

మొన్నటి వర్షాలవల్లా, వరదలవల్లా రోజుకి కేవలం 100 లారీల సరుకే యెగుమతి అవుతూందటకానీ, ఇంతకు ముందు రోజూ 300 నించి 400 లారీల సరుకు యెగుమతి అయ్యేదట!

రైతులు తమ పంటకి పెట్టుబడి కూడా రావడంలేదు అని యెంతొస్తే అంతకి తెగనమ్ముకుంటుంటే, దళారులు బాగుపడుతున్నారట! (ఇది అన్ని పంటలకీ సామాన్యమే కదా??--అర్థాంతరన్యాసం!)

చెప్పొచ్చేదేమిటంటే--మాకు తెలిసినవాళ్లమ్మాయి ఒకావిడ యేదో నోము పట్టి, ప్రతీరోజూ కొంతమంది దంపతులకి తాంబూలాలు ఇచ్చి, వాళ్ల కాళ్లు మ్రొక్కి, ఆశీర్వాదం తీసుకొంటుంది--తన సౌభాగ్యం కోసం. 

రిటైరయిపోయి వున్న నేనూ, కేవలం గృహిణి అయిన మా ఆవిడా యెప్పుడూ తనకి అందుబాటులో వుంటాం. వుద్యోగులైన మా తమ్ముడూ, మరదలూ సెలవు రోజుల్లోనే అందుబాటులో వుంటారు. మొన్న మా ఆఖరి తమ్ముడూ మరదలూ ఎల్ టీ సీ మీద వచ్చి ఓ 20 రోజులుంటే, ఆవిడ యెంత సంతోషించిందో--ఒకే ఇంట్లో ముగ్గురు జంటలు దొరికారు అని!

విషయమేమిటంటే, ఓ రోజు తాంబూలాలు యథావిథిగా ఇచ్చేసి, "పిన్నిగారూ! తమలపాకులు యెంతరేటు పెట్టినా దొరకడంలేదు. మీకిచ్చినవి దయచేసి మీ ఫ్రిజ్ లో పెట్టి, మళ్లీ నేనడిగినప్పుడు ఇవ్వండీ! ప్లీజ్!" అంది. 

కళ్లనీళ్ల పర్యంతమైన మా ఆవిడ "దానికేం భాగ్యం అమ్మా! అన్నీ దాస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్లు!" అని హామీ ఇచ్చేసింది.

ఇంకో రెండు మూడు రోజులుపోయాక, మా ఆవిడ "యెంత ఫ్రిజ్ లో పెట్టినా, కరెంటు పోతూండడంతో కొంచెం వాడిపోతున్నాయమ్మా. కావాలంటే ఇవాళ తీసుకెళ్లు. లేకపోతే యేమీ చెయ్యలేను" అన్న మా ఆవిడతో, "సరే ఇచ్చెయ్యండి పిన్నిగారూ" అని ఓ యెనిమిదో పదో ఆకులు తీసుకొని, తన బ్యాగ్ ఓ సారి తడిమి ఓ అర్థరూపాయి మా ఆవిడచేతిలో పెట్టింది!

"అదేమిటీ?" అంటే, "ఆకులు ఫ్రీగా తెస్తే వ్రతఫలం దక్కదు! అందుకని...." అందావిడ.

మా ఆవిడ, "బాగుందమ్మ! ప్రతిఫలం ముట్టింది!" అంటూ ఆ అర్థరూపాయిని ముద్దుపెట్టుకొంది నవ్వుతూ!

(అంతకు ముందోవారం క్రితం, "పిన్నిగారూ! అరటిపళ్లు దొరకటంలేదు....మీ వీధిలోకొస్తే ఓ రెండు డజన్లు కొనిపెట్టండి. నేను తీసుకొంటాను యెంత రేటైనా" అంటూ, "ప్రస్తుతానికి తాంబూలంలో యెండు ఖర్జూరాన్ని వుంచి ఇస్తున్నాను. యేమీ అనుకోకండి. పండుకి అదే ప్రత్యామ్నాయమట. కానీ, తాంబూలంలో అరటిపండు పెట్టి ఇస్తేనే తాంబూలం ఇచ్చినట్టు ఓ తృప్తి!" అంటూ నిట్టూర్చింది!)

ఇది జరిగిన, జరుగుతూన్న, జరగబోతున్న కథ! సరే.

నిన్ననో మొన్ననో అక్కడెక్కడో, అభయాంజనేయస్వామికో, భయాంజనేయ ప్రసన్నానికో, యెవరికో "లక్ష తమలపాకుల పూజ" చేశారట. 

వాడెవడో వొళ్లు బలిసిన భక్తుడు, లక్ష (చిన్నా, చితకా సైజులవి కలుపుకొని) తమలపాకులనీ, ఓ యాభై వేలకి కొని, (లక్షా ఒకేచోట దొరకవు కాబట్టి అనేక వూళ్లలో అనేకమందినుంచి సేకరించి, 'నా స్వంతం కోసం కాదు....స్వామి పూజకోసం' అంటూ డబాయించి బేరమాడి, ఆకుకి ఓ పైసో, అరపైసో తగ్గించమని బ్లాక్ మెయిల్ చేసి మరీ) ఆ స్వామికి పూజ చేస్తే, లాభం యెవరికి? ముక్తీ, మోక్షం యెవరికి?

(ఇంకా "హనుమజ్జయంతి" సందర్భంగా, శుక్రవారం (27-05-2011 న) యెన్ని లక్షల తమలపాకులతో ఆయనని పూజించారో శనివారం పేపర్లు చూస్తేగానీ తెలీదు).

నిన్ననే, ప గో జి, కాళ్ల మండలం, సీసలి గ్రామంలో, షిర్డీ సాయి పాలరాతి విగ్రహానికి యేకంగా 1,110 కిలోల (ఇదివరకు వెయ్యి కిలోలు విన్నాం--మరి ఈలెఖ్ఖేమిటో? చివర యెనిమిది చేర్చలేదెందుకో ఆ వె పం లు!) బియ్యంతో వండిన అన్నంతో "అన్నాభిషేకం" నిర్వహించారు. పత్రికల్లో ఆ ఫోటోలు--అన్నంతోపాటు అవేవో పూలో, పిండివంటలో--సహితంగా బాబా విగ్రహం తలమీదనించి పోసేస్తున్నట్టు ఫోటోలు కూడా ప్రచురించారు పత్రికల్లో!

(ఈ లెఖ్ఖలు ఇలా 18 నించీ 108 కీ, 1080 కీ, నూటపదహార్లకీ, వెయ్యినూట పదహర్లకీ--ఇలా పెరగడం చూస్తుంటే, మా లాలిగాడూ, వాడి "బదారు" పువ్వుల వైనం గుర్తొస్తోంది! ఆ వైనం మరో టపాలో.)

ఆ తరవాత ఆ అన్నం యెవరైనా తినడానికి యోగ్యంగా వుందో, లేదో! మరి ఆ అన్నాన్ని యేమి చేశారో!

అదీ భక్తంటే!

భక్తి వ్యాపారులూ జిందాబాద్!

9 comments:

voleti said...

షిర్డీ సాయిబాబా బతికినన్నాళ్ళూ విగ్రహారాధన వద్దని మొత్తుకున్నాడు.. అతన్ని దర్శించడానికి మైల, గీల అక్కర లేదు.. మరి ఈనాటి బడా భక్తులు, ఎంతో ఖరీదైన పాలరాయి విగ్రహాలు, ఏ.సీ హాళ్ళు, పాలతో, అన్నంతో అబిషేకాలు.. ఒకటా రెండా ఎన్నని చెప్పాలి..ఇదో వ్యాపారం
(ఈ డబ్బు పేదలకు పంచితే ఆ బాబా ఎంతో సంతోషిస్తాడు కదా)..కమిటీ సభుల్లో చాలా మంది బ్రాహ్మణులు కాని వాళ్ళు వుండి విరాళాలు స్వాహా చేస్తారు.. అది తప్పులేదు కాని, మామూలు గుళ్ళో బ్రాహ్మడి పళ్ళెంలో ఓ రూపాయి పెట్ట డానికి బాధపడతారు..

LBS తాడేపల్లి said...

షిర్డీసాయిబాబా విగ్రహారాధన వద్దన్నారనేది నిజం కాదు. ఆయన స్వయంగా షిర్డీలోని చిన్నచిన్నదేవాలయాల్ని మరమ్మత్తు చేయించారు. ఈనాటి సమాధిమందిరాన్ని కట్టిన బూటీగారు ఆ మందిరపు మధ్యహాల్లో మురళీధరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటే ఆయన సరేనన్నారు గానీ వద్దనలేదు. కానీ ఆ తరువాత కారణాంతరాల వల్ల ఆ ప్రతిష్ఠ జఱగలేదు. ఈనాటి పాలఱాతి విగ్రహాలు మాత్రం భక్తుల అభీష్టమే.

శ్రీ సాయి మడీ, మైలా వద్దన్నారనేది కూడా నిజం కాదు. అలా అన్నట్లు ఆయన జీవిత చరిత్రలు సాక్ష్యమివ్వడం లేదు.

voleti said...

అభిషేకాలు (లీటర్ల కొద్దీ పాలతో, కే.జీల కొద్దో అన్నంతో) చెయ్యమని చెప్పారా? విగ్రహారాధన చెయ్యొద్దని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు... బాబా గారు జీవన విధానం చదివితే చాలు..ఆయనది ఏ ఆర్భాటము,ఖరీదైన, సుఖవంతమైన జీవన విధానము కాదు.. అదే నేటి సమకాలిన బాబాల ఆశ్రమాలు ఒక్కసారి చూడండి.. మనసార "సాయి" అని పిలిచిన పలుకుతానన్న బాబాకి ఇవన్నీ ఎంతవరకూ అవసరం (అదీ కూడా ఓ వ్యాపార కేంద్రం లా డెవలప్ అవడం)

LBS తాడేపల్లి said...

బాబాగారు ఏ విధమైన కొత్త మతాన్నీ స్థాపించలేదు. "ఇది వద్దు, అది కావాలి" అని చెప్పడానికి ! ఉన్న హిందూమతాన్నే ఆచరణలో పెట్టమన్నారు. తన దగ్గఱకు వచ్చిన భక్తులు వారివారి ఇలవేల్పుల్ని పూర్వీకుల మాదిరే పూజిస్తే చాలునని ఆయన చాలా సార్లు చెప్పారు. ఉన్న హిందూమతంలో అభిషేకాలున్నాయి. వేడుకలూ ఉన్నాయి.

భక్తులు ఎలా పూజిస్తున్నారనేదీ, ఎంత ఖర్చు పెడుతున్నారనేదీ భగవంతుడికి అవసరం లేదు. ఆ లెక్కలు ఆయన వేసుకోడు. ఫలానా అర్చావిధానం అవసరమా ? కాదా ? అనేది ఆయా భక్తులే ఆలోచించుకోవాలి. మనం చెప్పేది కాదు. దేవుడు చెప్పేదీ కాదు. ఎందుకంటే ఒకఱి పద్ధతి ఇంకొకఱిది కాదు.

voleti said...

ఇక్కడ సమస్య భక్తి పేరుతో డబ్బుని, విలువైన ఆహార పదార్ధాలని వృధా చేస్తున్నారని. మా ఇష్టం అంటే ఎవరైం చెయ్యగలరు.
సనాతన హిందూ ధర్మ శాస్త్రం లో భగవంతుని చేరే మార్గం, పూజా విధానాలు చాలా విపులంగా చెప్పబడింది. అయితే దేవునికి భక్తునికి మధ్య పూజారి వ్యవస్థ ఒకటి వుంది..పూజార్లు దేవుని పేరు చెప్పి, మిగతా కులాల వార్ని మోసం చేసారనే కదా నేటి ఆధునిక భారతంలో బ్రాహ్మణ వ్యవస్థ ని కూలదోసి, మిగిలిన మతాల వైపు, హిందూ దేవాలయాల్ని కాకుండా ఇతర దేవుళ్ళ వైపు ప్రజల్ని మళ్ళించారు..
అయితే బాబా గారు కుల, మతాలకి అతీతం.. పూజారి లేకుండా బాబా గార్ని నేరుగా తాకి అభిషేకాలు, పూజలు చెయ్యొచ్చు..మరి ఎక్కువ మంది క్రిష్టిషన్ మతం లోకి వెళ్ళడానికి కారణం కూడా ఈ మడి,తడి, ఆచార వ్యవహారాలు లేని మతం కనుక.ఇవన్నీ ఆ మతం లోకి,బాబాని పూజించే భక్తుల విమర్శ (హిందూ మతం మీద).
మరి ఇప్పుడు పై ఆచారాల్లో పూజార్ల (బ్రాహ్మణులు కాని వారు) ఎంత దోస్తున్నా కోట్లు సంపాదిస్తున్నా (ఊదా: కె.ఎ.పాల్) ఎవరూ మాట్లాడరు..దేవాదాయశాఖ వారు హిందూ దేవాలయాల్ని అదుపులోకి తీసుకున్నట్లే విలాసవంతమైన బాబా మందిరాలను, చర్చి లను ఎందుకు స్వాధీన పర్చుకోరు?

LBS తాడేపల్లి said...

ఓలేటిగారూ ! మీరు ఏమంటున్నారో ఏమీ అర్థం కాలేదు.

బ్రాహ్మణ పూజారులు దేవుడి పేరు చెప్పి జనాన్ని మోసం చేశారా ? మోసమంటే ఏంటి ? క్లియర్‍గా డెఫినిషన్ ఇవ్వండి. పూజారిగా ఉండడమే మోసమా ? లేక బ్రాహ్మణుడుగా పుట్టడమే తప్పా ? ఒక బ్రాహ్మణుడు చెయ్యిచాచి నోరు తెఱిచి ఒక అయిదో పదో భక్తుల దగ్గఱ అడుక్కుంటే అది మోసమా ? కంపెనీలు ఏడాదేడాదికీ మన మీద డబల్ డబల్ ఛార్జీలేసి దోచేసి బలిసిపోతూంటే దాని గుఱించి మాట్లాడేవాడు లేడు. అది మోసం కాదు. వాడు ఒక టీవీ ముప్ఫైవేలకు అమ్మితే ముప్ఫైవేలు చేయడానికి అందులో ఏముందని ఎవడూ అడగడు. నోరు మూసుకుని కొనుక్కుంటున్నారు, స్టేటస్ అనుకుంటూ ! బ్రాహ్మణులు మోసం చేశారనుకుంటే మఱి ఆ మోసగాళ్ళు బాగుపడాలి కదా ? ఏదీ ? వేలాదిమంది పూజారులు ఆర్థిక బాధలతో అలమటిస్తున్నారేం ?

ఎక్కువ మంది క్రిస్టియానిటీలోకి వెళుతున్నారా ? ఎక్కడ వెళుతున్నారు ? ఎక్కువ అంటే ఎంత మీ దృష్టిలో ? రాష్ట్రంలో వాళ్ళ జనాభా పది శాతానికి మిందనే సత్యం మీకు తెలుసా ?

షిర్డీసాయిబాబాయే కాదు. హిందూ దేవుళ్ళంతా కులమతాలకు అతీతులే. అయినా అశుచిగా తనకు పూజలు చేయమని బాబా ఎక్కడా చెప్పలేదు.

మడీ, తడీ తప్పా ? శుచీ, శుభ్రం పాటించడం నేఱమా ? అవి ఉండాలని బోధిస్తే పాపమా ? దైహిక, మానసిక, ఆధ్యాత్మిక శుచి బోధించనిది మతం ఎలా అవుతుంది ? మలవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా ఇల్లంతా తిరగమని చెబితే అది విశ్వజనీన విశాల హృదయమా ? అంట్లూ ముట్లూ అలాగే ఉంచుకొని పూజలు చేసి చూడండి. మేం చెప్పడం దేనికి ? మీకే తెలుస్తుంది త్వరలో వాటి ఎఫెక్టు.

మీ వాదనల వెనుక మతగ్రంథాలెప్పుడూ చదివి ఎఱుగనితనం కనిపిస్తోంది. ఆ లోపాన్ని సరిదిద్దుకోండి. ముందు నాలుగైదు పుస్తకాలు చదవండి.

కృష్ణశ్రీ said...

డియర్ voleti!

మీ అభిప్రాయాలు బాగానే వున్నాయి. మీరు మాట్లాడింది తరతరాల సమాజ చరిత్ర గురించి.

మూఢ భక్తిలో భాగంగా, అహారపదార్థాలని వేస్ట్ చెయ్యడంపై నాతో యేకీభవించినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ LBS తాడేపల్లి!

మీరు బాబా భక్తులవడంతోపాటు, రీసెర్చ్ బాగానే చేసినట్టున్నారు. సమకాలీన సమాజం గురించి మీరు చెపుతున్నవి బాగానే వున్నాయి.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

పై ఇద్దరు వ్యాఖ్యాతలూ!

మీ యిద్దరి దృక్కోణాలనీ బాగా సవరించుకొని, బాగా పై యెత్తునించి వీక్షించండి.

నేను వ్రేలెత్తి చూపించినది ఆంజనేయుణ్ణో, బాబానో కాదు. దేశంలో ఇప్పటికీ 35 శాతమో యెంతో మంది ఒకపూట తినడానికి తడువుకొంటున్న సమయంలో, ఆహార ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొన్న వేళలో, తానెన్ని పాపాలు చేసినా, తనకెంత భక్తి వున్నా, ఇలా అన్నపదార్థాలూ, పూజా పత్రాలూ అంతంతరేటు పెట్టికొని, పూజలు చేయిస్తూ, దళారులని పోషించడం అవసరమా?!

అదే సమయంలో సామాన్య భక్తులకీ, ఆచారాలప్రకారం నోములూ అవీ నోచుకొనేవాళ్లకీ వాటిని అందుబాటులో లేకుండా చెయ్యడం యెంతవరకూ సమర్థనీయం?

వీటిలో యెవరి పాత్ర యెంత? నూట యెనిమిదీ, వెయ్యీ యెనిమిదీ, వెయ్యీ యెనభై, పదకొండువందల పదహారూ, రేపు లక్షా పదకొండువేల నూటపదహార్లూ--ఇలా యెవరు యెందుకు పెంచుతున్నారు?

ఆలోచించండి.

అసలు షిరిడీ సాయికి, ప్రపంచానికి తెలిసిన చరిత్ర అంటూ యేదీ లేదు అనీ, ఆయన ప్రవచనాలు అంటూ యేమీ లేవు అనీ, ఆయన సో కాల్డ్ శిష్యులూ, భక్తులూ "ఇలా, అలా అంటూ" చెప్పినట్టు భావించబడుతున్నవే ఆయన జీవిత చరిత్రగా పరిగణింపబడుతున్నాయి అనీ నేనంటే, "నాస్తికుడు" వంటి తిట్లతో నామీదకి వొంటికాలిమీదొస్తారు యెందరో!

"కల్ట్ బిల్డింగ్" గురించి నేను మొన్నీమధ్యనే వ్రాసిన టపా చదవండి. త్వరలో ప్రచురించబోయే ఇంకో టపా కూడా చదవండి.

మీ అభిప్రాయాలు చెప్పండి.

ఆరోగ్యకరమైన చర్చ యెప్పుడూ మంచిదే....కాసేపు ఆవేశ కావేషాలని ప్రక్కన పెడితే!

మీకూ, మీలాంటి పాఠకులకీ నా ధన్యవాదాలు మరోసారి.