విచారణలు
మామూలుగా మనం మన సినిమాల్లో వినే "యూ ఆర్ అండర్ అరెస్ట్" అనే మాటల తరవాత, అమెరికాలాంటి దేశాల్లో ఆ మాటలన్న పోలీసు అధికారి కొన్ని మాటలు చెపుతాడు--అలా చెప్పకపోతే, అది రికార్డుకాకపోతే, ఆ అరెస్టు చట్టవిరుధ్ధం!
ఆ మాటలు--"ప్రపంచంలో యెవరికైనా వొక్క ఫోన్ కాల్ మాత్రమే చేసుకొనే హక్కు మీకు వుంది. ఇక్కడనుంచీ, యేమీ మాట్లాడకుండా మౌనంగా వుండే హక్కు మీకు వుంది. ఇకనుంచీ మీరు యేమి మాట్లాడినా, దాన్ని మీకు వ్యతిరేకంగా కోర్టులో వుపయోగించబడే అవకాశం వుంది......" ఇలా!
ఇవి దశాబ్దాలుగా చెప్పబడుతున్న స్టాండర్డ్ మాటలు. వాటికి ఓ అందమైన పేరుకూడా వుంది! అలాంటి అరెస్టులెక్కడా? గాలి అరెస్టులెక్కడా?!
నిన్ననో మొన్ననో మా జిల్లా ఓ వూళ్లో, ఒకతన్ని పోలీసులు "ప్రశ్నించడానికి" అని పిలిపించి, డైరెక్టుగా కోర్టులో దింపి, న్యాయమూర్తిని అడగ్గానే అయన రిమాండు విధించాడట అతనికి.
"హాత్తెరీ! నన్ను ఇలా మోసం చేస్తారా....ముందు చెపితే నేను బెయిలుకి యేర్పాట్లు చేసుకొనేవాణ్ని కదా? నేను జైలుకి రాను" అంటూ ఓ మూడు నాలుగు గంటలు వీరంగం చేశాడట! ఊహుఁ! ఇలాంటివి మనదేశంలో చెల్లుతాయా!
చట్టం ప్రకారం అన్నీ పుస్తకాల్లో వున్నాయి....కానీ అరెస్టు చేసినా 24 గంటలలోపు మేజిస్ట్రేటు ముందు హాజరు పరచకపోవడం, యే శనివారం సాయంత్రమో అప్పుడే అరెస్ట్ చేసినట్టు హాజరుపరిచి, బెయిలు యేర్పాట్లు చేసుకోడానికి అవకాశం ఇవ్వకుండా, రిమాండు విధింపజేసి, ఆ మర్నాడు సెలవు కావడంతో, వెంటనే సెంట్రల్ జైలుకి తరలించడం....ఇలాంటి చిన్నెలు చాలా చేస్తారు పోలీసులు!
మొన్నీమధ్యనే, వరల్డ్ బ్యాంక్ ఛెయిర్మన్ అనుకుంటా అదేదో హోటల్లో ఆరోపణలు యెదుర్కొంటే, ఆయన్ని అరెస్టు చేశారు. తరువాత విచారణలో ఆ ఆరోపణలు తప్పని ఋజువు అవగానే, విడుదల చేశారు! అలా సరైన న్యాయ విచారణ పధ్ధతులకి యెవరూ అతీతులు కారు...సాక్షాత్తూ ప్రథాన మంత్రి అయినా, అధ్యక్షుడైనా!
మన సీబీఐ వారు మాత్రం, ప్రతీరోజూ వివిధ కేసుల్లో తమ దర్యాప్తులని "ముమ్మరం" చేసుకుంటూ పోతున్నారు--కొన్ని రీముల కాయితాల రికార్డులని తయారుచేసుకొంటూ పోతూ....."ఇంకా చాలామందిని అరెస్టు చేసే అవకాశం వుంది" అనికూడా చెపుతున్నారు!
యెన్ని కొండలని తవ్వుతారో, చివరికి యెన్ని యెలకలని పడతారో!
చూద్దాం!