Thursday, September 22, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 5



గాలి మీద దర్యాప్తులు

అన్నట్టు, మొన్న అమర్ సింగ్ కిడ్నీలూ అవీ నిజంగానే పాడయిపోయి, నిమ్‌స్ లో చేరాడట. పాపం అపార్థం చేసుకున్నాము!

ఇంక గాలి బెయిలు విషయంలో "రెండురోజుల" వాదనలు అని వ్రాశాను. కానీ, "ఐదు"రోజులు వాదనలు జరిగాయట!

తీరా కోర్టు, సీ బీ ఐ కస్టడీకి పంపిస్తూ, ఆయన్ని తన లాయర్ల సమక్షంలోనే విచారించాలి అని చెప్పారాయె. 

వాళ్లేమో, లోపాయకారీగా అదేదో స్టేషన్ లాకప్పు సెల్ లో పెట్టి, యే అర్థరాత్రో వాళ్ల బుర్రల్లో యేదో మెరిస్తే, వెంటనే వచ్చేసి, ప్రశ్నించేస్తున్నారట. 'యేమో, నాకు గుర్తులేదు, గుర్తు తెచ్చుకొని చెపుతాను....' అంటే, సహకరించడం లేదు.....అడ్డగోలు సమాధానాలు ఇస్తున్నాడు....డొంకతిరుగుడుగా మాట్లాడు తున్నాడు....మా సహనాన్ని పరీక్షిస్తున్నాడు.....ఇలా యాగీ చేస్తున్నారు! 

"అవసరమైతే", నార్కో యెనాలిసిస్ కోసం ప్రయత్నిస్తారట....దానికీ ఆయన పర్మిషన్ కావాలని మరిచిపోతున్నారు! అయినా "ట్రూత్ సీరమ్" (అనబడే సోడియం పెంటథాల్) ఇస్తూ మాట్లాడించడం, వాళ్లు మాట్లాడిందాన్ని, "బిట్వీన్ ది లైన్స్" చదువుకొని, నిర్ధారణలకి వచ్చెయ్యడం, తీరా ఆ సాక్ష్యాలు కోర్టుల్లో చెల్లకపోవడం....ఇదంతా ఇంకో ప్రహసనం!

ఇంక ప్రతిరోజూ, "దర్యాప్తు వూపందుకొంది"; "ముమ్మరమైంది" అని విశేషణాలతో వార్తలు! ఇంతాజేసి యేమి ముమ్మరం అయ్యింది అంటే, ఇంకా కొన్ని వందలమందికి నోటీసులు ఇచ్చాము, ఒక్కొక్కళ్లనీ కొన్ని గంటలపాటు "విచారణ" చేస్తున్నాము....అంటూ చెప్పడం! అదీ నడుస్తున్న డ్రామా! 

ఇంక బళ్లారిలో "గాలికి ఆకు కదిలినా" అది గాలి వల్లనే అని పుట్టించేస్తున్నారు. ఓ లారీ కేబిన్ పై, సంచులలో నింపిన కొన్ని కోట్ల డబ్బుని, టర్పాలిన్లు కప్పి, యెక్కడికో రవాణా చేసేస్తుంటే, (అది కూడా యెవరో ఆచూకీ చెపితే) ఆ డ్రైవరునీ, సంచులు పెట్టినవాడినీ అరెస్టు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారట! 

ఆ డబ్బు ఫలానా బ్యాంకులో డ్రా చేశారు అని చెపుతున్నారు. (ఇంకా విచిత్రం యేమిటంటే, కొన్ని కట్టలమీద "2009 వ సంవత్సరం" స్టాంపులు వుండడంతో, రెండు సంవత్సరాలనుంచీ ఆ డబ్బు యెక్కడ దాచారు? అంటూ పరిశోధనట! బ్యాంకుల గురించీ, నోట్ల కట్టల గురించీ వీళ్లకి కనీస పరిజ్ఞానం లేదనుకోవాలా మనం?!). ఆ డ్రైవర్లూ వాళ్లూ యేమి చెపుతారు? 

ఆ బ్యాంకు ఖాతాలో ఆ డబ్బు యెప్పుడెప్పుడు, యెవరెవరు డిపాజిట్ చేశారో యెదురుగుండా కనిపిస్తూనే వుంటుంది! ఆ మాత్రానికి ఈ డ్రామాలు యెందుకు? 

ఇంక, శ్రీనివాసరెడ్డిని మళ్లీ బళ్లారికి తరలించి, ఓ రోజంతా ఓ బ్యాంకులో దర్యాప్తు చేశారట! ఆయన బ్యాంకు లాకర్లు తెరిస్తే, 14 కిలోలో యెంతో బంగారం, కొన్ని కోట్లూ దొరికాయన్నారు. 

మర్నాడు, ఆ లాకర్లు ఇంకెవరి పేరుమీదో వున్నాయి అనీ, వాళ్లు ఈయనకి 'బినామీ'లు గా భావిస్తున్నారు అనీ ఇంకో వార్త! 

ఈలోపల కస్టడీ ముగిసేపోయింది! మళ్లీ చంచల్ గూడా జైలుకి తరలింపు....అక్కడ ఆయన గుళ్లలోనూ, ఆధ్యాత్మిక పుస్తకాలతోనూ కాలక్షేపం! "ప్రత్యేక" పూజలకి అవకాశం వుందా అని కూడా కనుక్కున్నారట! యేమో, చంచల్ గూడా శివుడికీ, ఇంకా అక్కడ దేవుళ్ల అదృష్టం బాగుంటే భవిష్యత్తులో వాళ్లకీ బంగారు కిరీటాలు అమరుతాయేమో! 

ఇలాంటి డ్రామాలవల్లా, దర్యాప్తులవల్లా, నిజాలు బయటికి వస్తాయి అంటే యెవరైనా నమ్ముతున్నారా?

No comments: