Monday, September 12, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 3



గాలి అరెస్టు

ఇంకెవరైనా చేస్తే నేరం, మనం చేస్తే అది వ్యూహం అన్నట్టుంది సీబీఐ వ్యవహారం. 

హోటళ్లలో గదులు బుక్ చేసుకోవాలంటే, మన ఫోటో ఐడీ అడిగి, దాని వివరాలు వాళ్ల రికార్డులో వుంచుకుంటున్నారు. 

అయినా, అలాంటిదేమీ లేకుండా, మారుపేర్లతో, కనీసం ఓ పది గదులు హోటళ్లలో బుక్ చెయ్యగలిగారంటే, లొసుగు యెక్కడ వుంది?

తమ అధికార హోదాని వుపయోగించో, ఇన్‌ఫ్లుయెన్స్ వున్న ఓ స్థానిక పెద్దమనిషిని బ్లాక్ మెయిల్ చేసో సాధించి వుంటారు. (సాధారణంగా హోటళ్లలో గదులు ఇచ్చే రిసెప్షన్ లో వుండే వుద్యోగులని యెవరూ "ఫలనా గది వాళ్లకే యెందుకు ఇచ్చావు?" అని ప్రశ్నించరు. తరవాత యేమైనా కొంప ములిగితే, వాళ్లని మూసేసి, వుద్యోగాలు పీకేస్తారంతే!) 

మరి అలా సీబీఐకే సాధ్యం అనుకుంటే, మనం మూర్ఖులమే! 

సామాన్య నేరస్థులనుంచి, తీవ్రవాదులవరకూ అందరికీ అది సాధ్యమే కదా? ఇంక మనవాళ్ల ఇంటలిజెన్స్ ఇలా యేడుస్తోంది అని తిట్టుకొని యేమి లాభం?

అందుకే తీవ్రవాదులు హైకోర్టునే కాదు, సుప్రీం కోర్టుని కూడా పేల్చేస్తాం అని బెదిరించగలుగుతున్నారు!

ఇంక సోదాలు చెయ్యడానికి అని చెప్పి వెళ్లినవాళ్లు, అరెస్టు చెయ్యవలసిన అవసరం యేమి వచ్చింది? 

సొదాలపేరుతో, బంగారం , వెండీ వస్తువులని స్వాధీనం చేసుకొని, కోర్టులో డిపాజిట్ చెయ్యడం యెందుకు?

ఒకవేళ ఆయన "అక్రమంగా" సంపాదించాడు అని రేప్పొద్దున్న కోర్టు నిర్ధారించి, ప్రభుత్వానికి జరిగిన నష్టానికిగానూ, ఆయన ఆస్తులని జప్తు చెయ్యండి అంటే--అప్పటికి ఆ ఆస్తులు అన్నీ కరిగిపోతాయనో, అన్నీ మూట కట్టుకొని, యే చైనాకో, జపాన్ కో పారిపోతాడని భయమా? అలా పారి పోవడానికి ఆయనేమైనా షా ఆఫ్ ఇరానా? ఇమెల్డా మార్కోసా?

నిజంగా ఖత్రోచీలనీ, యాండర్సన్లనీ మాత్రం గుట్టు చప్పుడుకాకుండా వాళ్ల దేశాలకి పారిపోనిస్తారా!

కార్లూ, హెలికాప్టరూ స్వాధీనం చేసుకోవాలా? లేకపోతే వాటిని స్వయంగా నడుపుకొంటూ, ఇతరదేశాలకి యెగిరిపోతాడా? అయినా అంత అవసరం ఆయనకి యేమిటి?

సత్యం రామలింగరాజు సంగతి వేరు. ఆయన జైల్లో కాకుండా బయట వుంటే, సాక్ష్యాధారాలని నిర్మూలించడానికి అవకాశం వుండేది.

గాలి విషయంలో, కొన్ని లక్షలు ఖర్చుపెట్టి సేకరించిన శాటిలైట్ ఇమేజస్ తో సహా అన్నీ రికార్డెడ్ గా వున్నాయంటున్నారు. వాటి ఆథారంగానే నిర్ణయానికి వచ్చామంటున్నారు--కేసులు కోర్టులో విచారణ చెయ్యడానికి!

ఇదంతా చూస్తుంటే, సీబీఐ అధికారులు వాళ్ల సొంత ఇమేజ్ ని పెంచుకోడానికో, లేక కొంతమంది రాజకీయులకి మేలు చెయ్యడానికో ఈ డ్రామాలన్నీ ఆడుతున్నట్టులేదూ?
  
......మరోసారి.

No comments: