గాలి అరెస్టు
ఇంక అరెస్టు యెలా జరిగింది?
సీబీఐ బృందం జగన్ అక్రమ ఆస్తులు, ఎమార్ ప్రాపర్టీస్ కేసులతో బిజీగా వుండడంతో, "గాలి" 'నాదాకా రావడానికి ఇంకా టైముందిలే' అనుకుంటూండగా, అదనపు ఎస్పీ ఖాన్ జేడీ ఆదేశాలపై కొద్దిరోజుల క్రితమే బళ్లారి చేరి, పరిస్థితులని అధ్యయనం చేసి, యెప్పటికప్పుడు సమాచారం జేడీ కి చేరవేశారట.
జనార్దన్ రెడ్డి ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులు, పని మనుషులు తదితర వివరాలు సేకరించారట. ఆదివారం జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లలోనే వున్నారని నిర్థారించుకున్నారట.
(ఇక్కడో చిన్న విషయం గుర్తొచ్చింది నాకు. పూర్వం రాజులు తమ కోటల్లో రహస్య మార్గాలనీ, నేల మాళిగలనీ వగైరాలు నిర్మించిన మేస్త్రీలని పని పూర్తవగానే చంపేశేవారట--ఆ రహస్యాలు బయటికి పొక్కకుండా. పాపం టిప్పు సుల్తాన్ తన కోటలో మురుగునీటి పారుదల మార్గాల్లో ఓ చోట అంతరాయం యేర్పడినప్పుడు దాన్ని బాగుచేసినవాడిని చంపడం మరిచిపోయాడో, సహాయం చేశాడు కదా అని కృతఙ్ఞత చూపాడో! బ్రిటీష్ నక్కలు వాణ్ని పట్టుకొని, ఆ మార్గం తెలుసుకొని, రాత్రికి రాత్రి కోటలో చేరి, వుదయమే టిప్పు బహిర్భూమికి వెళుతూండగా కాల్చి చంపేసి, "వాహ్యాళికి వెళుతుంటే చంపేశాము" అని చరిత్రలో రాసేశారు!)
ఆదివారం మధ్యాహ్నం జేడీ తన సిబ్బందితో బళ్లారి పయనమయ్యారట. బెంగుళూరు సీబీఐ డీఐజీ హితేంద్ర ని కూడా బళ్లారి వచ్చెయ్యమన్నారుట.
అప్పటికే అక్కడవున్న ఖాన్--"వారందరికీ" మారుపేర్లతో హోటళ్లలో గదులు సిధ్ధం చేశారట!
ఆదివారం అర్థరాత్రి రెండు గంటల సమయానికి జేడీ బృందం బళ్లారి చేరిందట. అప్పటికే హితేంద్ర బృందం బళ్లారి పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో దిగారట. అధికార వాహనాలు కూడా వాడకుండా మామూలు అతిథుల్లా ప్రవర్తించారట! అర్థరాత్రి బళ్లారి ఎస్పీ తో మాట్లాడి, పోలీసు రక్షణ యేర్పాటు చేసుకున్నారట. మహిళా సిబ్బందిని కూడా రప్పించారట.
"ఒక గంట" మాత్రమే విశ్రాంతి తీసుకొని, నాలుగ్గంటలకల్లా అరెస్టు ప్రయత్నాలు మొదలెట్టారట.
వుదయం ఆరుగంటలకల్లా, జేడీ జనార్దనరెడ్డి ఇంటితలుపూ, ఖాన్ శ్రీనివాసరెడ్డి ఇంటి తలుపూ తట్టారట.
సీబీఐ నుంచి వచ్చాము, సోదాలు చెయ్యాలన్నారట. జనార్దనరెడ్డి తన భార్యతో మాట్లాడాక, ఆయన్ని అరెస్టు చేస్తున్నాము అని ప్రకటించారట. ఆటునుంచి శ్రీనివాసరెడ్డిని కూడా ఖాన్ తీసుకొచ్చారట. ఇద్దరినీ తీసుకొని, జేడీ హైదరాబాదు బయలుదేరారట వెంటనే.
దాడుల విషయం బయటికి పొక్కేలోపే, వాళ్ల బృందం బళ్లారి శివార్లు దాటేసిందట.
మీడియావాళ్లు వుదయం యేడున్నర గంటలకే విషయం తెలుసుకొని, కర్నూలు జాతీయ రహదారి పొడుగునా, టోలుగేట్ల దగ్గర కెమేరాలు పెట్టుకొని, వాళ్లని వెంటాడారట.
జనార్దనరెడ్డి ఇంట్లో మూడు కోట్లూ, శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఒకటిన్నర కోట్లూ నగదూ, బంగారు "నగలూ" స్వాధీనం చేసుకుని, ఇన్‌కమ్ టేక్స్ వాళ్లకి సమాచారం ఇచ్చి, మంగళవారం న్యాయ స్థానానికి అప్పగించారట! (ఈ బృందాలు యెప్పుడు యెలా హైదరాబాదు చేరాయో సమాచారం లేదు.)
జనార్దన రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకొన్న (యెన్నో తెలీదు) కోట్ల ఖరీదైన కార్లని హైదరాబాదు తరలించడానికీ, జాగ్రత్తగా కాపాడడానికి యేర్పాట్లు చేస్తున్నారట.
హెలికాప్టరుని తరలించాలా వద్దా అని గుంపుతెంపులు పడుతున్నారట.
అదండీ వాళ్ల ఘనకార్యం!
(ఇదంతా ఈనాడు సెప్టెంబరు 7, బుధవారం పేపర్లో వచ్చింది మాత్రమే).
......మరోసారి.
No comments:
Post a Comment