Tuesday, September 13, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 4గాలి అరెస్టు

ఇంక, అరెస్ట్ అయినవాళ్లిద్దరికీ బెయిలు ఇవ్వాలి అని వాళ్ల తరఫు న్యాయవాదులూ, ఇవ్వడానికి వీల్లేదు అని సీబీఐ న్యాయవాదులూ పూర్తిగా రెండురోజులు వాదించుకున్నారు. నిన్న (12-09-2011) ఐతే, వుదయం 11 నుంచి సాయంత్రం 6 వరకూ నడిచాయట. చివరికి రాత్రి 9 కి "తీర్పు రేపిస్తాం" అన్నారట.

(బెయిలు నిరాకరించి, 19 వ తేదీవరకూ సీబీఐ కస్టడీ విధించారు అనీ, వారు వెంటనే "ప్రశ్నల పరంపర" ప్రారంభించారు అనీ ఇవాళ (13-09-2011) వార్త. అందరూ వూహించినదే! "న్యాయం జరగడమే కాదు, 'జరిగినట్టు కనిపించాలి' కూడా" అన్నాట్ట వెనకటికెవడో! అందుకోసమే ఈ "డ్రామాలు"! లేకపోతే, రెండురోజులపాటు ఈ వాదనలెందుకు? కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయంటే.....పోవూ మరి!)

ఇంతకీ యెవరి వాదనల్లో "పస" వుందో మీరే ఆలోచించండి.

సీబీఐ వారి వాదనలు : 

 • లీజు పొందిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపలేదు. కానీ ఆ పర్మిట్లతో ఇంకోచోట త్రవ్విన ఖనిజం యెగుమతి చేశారు.


 • త్రవ్వకాలగురించి సమాచారం యెవరూ ఇవ్వడం లేదు. ఆయనకి భయపడుతున్నారు. 


 • లీజు పొందిన ప్రాంతం లో లభించే ఖనిజం కన్నా, యెక్కువ నాణ్యమైన ఖనిజం యెగుమతి చేశారు. 


 • వుపగ్రహ చిత్రాలూ వగైరా సీడీలూ, డాక్యుమెంట్లూ సీల్డ్ కవర్లో సమర్పించాము.


 • సంవత్సరానికి 18 కోట్లు జీతం పొందారు. ఆస్తి అప్పుల పట్టీలో, డైరెక్టర్లుగా గాలి దంపతులే సంతకాలు చేశారు. జాతీయ సంపదని దోచుకున్నారు!


 • ఇంట్లో వుంచుకున్న 5 కోట్ల నగదుకీ లెఖ్ఖలు లేవని తేలింది. దాన్ని తాడిపత్రి బ్యాంకునించి తెచ్చారు. 


 • బెయిలు మంజూరు చేస్తే, పారిపోయే అవకాశం వుంది.


డిఫెన్స్ న్యాయవాదులు : 

 • లీజుకి సంబంధించిన ఫైళ్లన్నీ అందుబాటులో వున్నాయి. అధికారులెవరో వారికి తెలుసు. వాళ్లెవరినీ పిలిచి విచారించకుండా, వీళ్లని అరెస్ట్ చేసి, వివరాలు చెప్పమంటామనడం యేమిటి? కేసు నమోదు చేసి రెండేళ్లయినా, ఇప్పటిదాకా ఆధారాలు యెందుకు సేకరించలేదు? అరెస్ట్ ను సమర్థించుకోడానికే వివరాలు సేకరించాలని కస్టడీ అడుగుతున్నారు!


 • ముడుపులు తీసుకున్నారంటున్న అధికరులని యెందుకు వదిలేస్తున్నారు?


 • లీజు పొందినచోటకాకుండా, వేరేచోట (కర్ణాటకలో) తవ్వారంటున్నారు. ఆ భూమి కర్ణాటకలో వుందని, సరిహద్దు నిర్ణయం జరగకుండా యెలా నిర్ధారిస్తారు?


 • సరిహద్దు వివాదాలగురించి సుప్రీం కోర్టులో పలు కేసులున్నాయి. అవి తేలేదాకా యెందుకు ఆగలేదు? 


 • ఇప్పటికే ఆధారాలు (సీడీలూ, డాక్యుమెంట్లూ) వున్నాయంటూ, మళ్లీ కస్టడీ యెందుకు?


 • బ్యాంకు ఖాతాల్లో యెగుమతుల వివరాలు అన్నీ వున్నాయి కదా? కేసు డైరీ యెందుకు లేదు? అరెస్ట్ తరవాత, ఎఫ్ ఐ ఆర్ లో సెక్షన్లని సవరించారు.


 • వ్యక్తిగత స్వేచ్చ వుల్లంఘన జరిగింది.


(పేకాట ఆడేవాళ్లు ఓ సామెత చెప్పుకుంటారు--మన పేక మనం యెప్పుడైనా చూసుకోవచ్చు, ముందు ప్రక్కవాళ్ల పేకలని చూసి గుర్తు పెట్టుకోవాలి--అని. అలా, 'మన లీజులు మనం యెప్పుడైనా త్రవ్వుకోవచ్చు, ముందు.......' అనుకున్నాడేమో ఆయన!)

నిజానిక్కూడా, వీళ్లు "ఇంటరాగేట్" చెయ్యగానే, ఆయన అన్ని "నిజలూ" కక్కేస్తాడా....."మూడో డిగ్రీ" వుపయోగిస్తే తప్ప? రేపెప్పుడో కడుపునొప్పో, కాలునొప్పో అని హాస్పిటల్లో చేరతాడు. రోగీ పాలే కోరాడు, వైద్యుడూ పాలే ఇమ్మన్నాడు అన్నట్టు సరిపోతుంది. అమర్ సింగ్ నిన్న "నిమ్‌స్"లో చేరలేదూ?

......మరోసారి.

No comments: