Wednesday, November 9, 2011

మన దేవుళ్లు



అంటూ.....సొంటూ

మన పెద్దలు విధిగా పాటించేవారు వీటిని. 

"పచనం" చేసిన యే పదార్థమైనా....అంటే "వండబడిన"......(వుడకబెట్టినా, వేయించినా, నానబెట్టినా....ఇలా) పదార్థాలు, తినుబండారాలు యేవైనా "అంటు". ఈ పదంతోనే "అంట్లు తోముకొనైనా బతకొచ్చు" లాంటి నానుడులు పుట్టాయి. 

ఇంతకీ అంటు అంటే యేమిటి? ఆ పదార్థాన్నిగానీ, అవి వండబడిన పాత్రని గానీ "చేత్తో" ముట్టుకోకుండా వుంటే మంచిది. ఒకవేళ ముట్టుకున్నా, వెంటనే చెయ్యి కడుక్కోవాలి! కారణం? 

సైన్స్ చెపుతోంది.....పచనం చెయ్యబడ్డ యే పదార్థమైనా, మామూలు "రూమ్ టెంపరేచరు" కి వేడి తగ్గగానే, "సూక్ష్మ జీవులు" విజృంభిస్తాయి. ఆ పదార్థాలమీద "కాలనీలకి కాలనీలు" నిర్మించుకొని, వాటిపని అవి చేసుకుపోతాయి (ఆ పని.....ఆ పదార్థాన్ని 'శిథిలం ' చెయ్యడం!). ఆ క్రమంలో మనం  పదార్థాని/పాత్రని ముట్టుకుంటే, మనచేతికి ఆ సూక్ష్మజీవులు అంటుకొని, మళ్లీ కాలనీలు నిర్మించడం ప్రారంభిస్తాయి! దానివల్ల మన ఆరోగ్యానికి హాని జరగొచ్చు. 

ఈ మధ్య మా స్నేహితుడొకడు నలభై యేళ్ల తరవాత కలిశాడు. హైదరాబాదులో, ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో 2096 ఫ్లాట్లు వున్నదాంట్లో, ఓ బ్లాకులో, 19వ అంతస్థులో ఫ్లాట్ కొనుక్కొని, దాంట్లో నివశిస్తున్నాడట.....హాయిగా! 

మనమే అన్నన్ని నివాసాలు కట్టించుకోగలుగుతున్నాము. 

చీమలు, తమ అపార్ట్మెంట్ బ్లాకుల్లొ (పుట్టల్లో), కొన్ని వేల కాలనీలనీ, కొన్ని లక్షల "అపార్ట్మెంట్ బ్లాకులనీ/బిల్డింగులనీ", కొన్ని కోట్ల నివాసాల్నీ యేర్పాటు చేసుకొంటాయి. 

మరి సూక్ష్మజీవులు? కొన్ని లక్షల కాలనీల్లో, కొన్ని కోట్ల బ్లాకుల్లో, కొన్ని శతకోట్ల నివాసాలు యేర్పరచుకొంటాయి! అందుకు వాటికి పట్టే సమయం, కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే! 

ప్రకృతిలో మనకి ప్రసాదింపబడ్డ అనేక ఓషధులూ, రసాయనాలూ వగైరాలు అత్యంత శక్తివంతమైనవి, ప్రభావశీలమైనవి. 

తెల్లటి "పాలరాయి" మధ్యలో నల్లటి చారలూ, వలయాలూ యేర్పడ్డానికి కారణం అవే. 

నీటికి వున్న శక్తి యేమిటి? కొండల్లోని పెద్ద పెద్ద రాళ్లని కరిగించుకొంటూ వస్తూ, చిన్న చిన్న రాళ్లని దొర్లిస్తూ, వాటిని గులకరాళ్లుగా, గరుకు ఇసుకగా, మెత్తటి ఇసుకగా, సిలికాన్ వగైరాలున్న సూక్ష్మ ఇసుకరేణువులుగా మారుస్తుంది కదా?  

మరి, తెల్లని పాలరాయితో చెక్కిన దేవుళ్ల విగ్రహాలు కొన్నాళ్ల తరవాత, ప్రతీరోజూ "నీళ్లతో" అభిషేకాలు చేస్తున్నా, నల్లటి మచ్చలు యేర్పరచుకుంటూండడానికి కారణం యేమిటి? 

మరదే! 

ఈ సోదంతా యెందుకు......అసలు యేం చెప్పదలచుకున్నావు? ..... అనడుగుతారా ..... వస్తున్నా ..... అక్కడికే వస్తున్నా! 

మొన్నోరోజు మా జిల్లాలో ఓ "ఆలయం"లో......51 కిలోల బియ్యంతో వండిన పెరుగన్నంతో ఈశ్వరుడికి అభిషేకం చేశారట! (అభిషేకం చేసి వూరుకున్నారా? లింగం అంతా పెరుగన్నం మెత్తి, చంద్రవంకా, త్రిశూలం, మొహమ్మ్మీద బొట్టూ, జటాజూటం, గంగా వగైరాలని కూడా ఆ పెరుగన్నంతొనే టిర్చిదిద్ది, పేపర్లో ఫోటో వేయించుకున్నారు!) 

అరసవిల్లిలో, తెప్పోత్సవంలో, "......లూ, అరటిపళ్లూ విసురుతూ" భక్తులు అత్యుత్సాహంగా......"తరించారు"ట! 

(మావూరి చుట్టుప్రక్కల, అలా రథమ్మీదకి కొబ్బరిచిప్పలు విసరగా, అవి కణతకి తగిలి మరణించిన అర్చకుల దాఖలాలున్నాయి. 

ఓ నదిమీద రైలు వెళుతుంటే, కిటికీల్లోంచి డబ్బులు (కాయిన్లు) విసిరేసి, దణ్నం పెట్తుకుంటున్నారంటే, దానివల్ల యెవరికీ హానిలేదు.....ఒళ్లు కొవ్వెక్కి, వాళ్ల డబ్బులు నదిలో పారవేస్తున్నారు....అనుకోవచ్చు. మరి ఆహార పదార్థాలమాటో?) 

ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటండయ్యా అంటే, "మూఢ భక్తులారా! తెలివి తెచ్చుకోండి! మూర్ఖ పూజారులారా! ఇలాంటివి ప్రోత్సహించడం మానండి! దేవుళ్లని "అంట్ల" పాలు చెయ్యకండి! 

వింటారా? 

8 comments:

G.P.V.Prasad said...

మీ భాధ అర్ధంకాలేదు.

Anonymous said...

ఈ రొజులలొ మంచి మాటలు వినేది ఎవరు

Anonymous said...

పైన మీరు చెప్పినది అంటోసొంటో తరవాత సంగతి కానీ, మన సినిమా పాటలలో గానీ, అనేక ఫైటింగు సీన్లలో గానీ తినే వస్తువులను పాడి చేస్తున్నారు. ఎంత డబెట్టి వాళ్ళు కొనుక్కునా వాటిని తినేవాళ్ళు తినకుండా చేసే హక్కు వాళ్ళకు లేదు. అందుకని; తినుబండారలను తినకుండా పాడిచేసే వాళ్ళని శిక్షించే చట్టం ఒకటుంటే బాగుంటుంది. పైగా, అన్నీవున్నా కూడా సామాన్యునికి దొరకని కరువు కాలం కూడానూ....

y.v.ramana said...

మన హీరోల అభిమాన సంఘాలు చేసే పాలాభిషేకాల హాడావుడి మూఢ భక్తి కిందకి వస్తుందా?
ఈ మధ్య రాజకీయ పార్టీలు కూడా మా నాయకుణ్ణి కించ పరిచారంటూ వారి విగ్రహాలకి పాలాభిషేకాలు చేసి తమ వంతు పాత్రని పోషిస్తున్నయ్యి కదా!
ఆహార పధార్ధాలు వృధా కాకూడదంటూ మీరు రాసిన పోస్టు చాలా బాగుంది.

A K Sastry said...

డియర్ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు!

ఇందులో అర్థం కాకపోడానికేముందో నాకు అర్థం కాలేదు. అయినా నాబాధ గురించి మీరు బాధ పడకండి.

A K Sastry said...

పై అన్నోన్!

యే రోజులలో అయినా మంచి వుంటుంది. వినేవాళ్లూ వుంటారు. అందుకే చెప్పేవాళ్లూ వుంటారు.

A K Sastry said...

డియర్ RADHAKRISHNA!

అబ్బే....సినిమాల్లోదంతా నటన! ఆ సీన్లు అయిపోయాక, ఓ ఐదారుశాతం పాడైనా, మిగిలినవాటిని బాగానే వుపయోగిస్తారు.

మీరన్నట్టు ఓ చట్టం వుంటే బాగానే వుంటుంది గానీ, చట్టాలూ, చట్టుబండల వల్ల కన్నా, వ్యవస్థలో మార్పు రావాలంటే, మనలోనే మార్పు రావాలి. అవునా?

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ yaramana!

గత నాలుగేళ్లుగా తరచూ ఇలాంటి విషయాలమీద, పాలాభిషేకాలతోసహా, వ్రాస్తూనే వున్నాను. మీకు నచ్చినందుకు సంతోషం.

ధన్యవాదాలు.