Friday, April 29, 2011

అంత్యక్రియలు అనే…..3


హై డ్రామా

(మొదలు పెట్టడం “శుక్లాంబరధరం……” అనీ, “ఆచమ్యా….కేశవాయస్వాహా….” అనీ, “పవిత్రం ధృత్వా…..” అనీ, మళ్లీ “ప్రాచీనావీతి” అంటూ జంధ్యం మార్పించి, ఆ తరవాత ‘పవిత్రాన్నీ’, ‘జంధ్యాన్నీ’ మరిచిపోయారు!) 

9-25 కి “ఆవు పంచకం”, పేడ, పాలు, పెరుగు, నెయ్యి “కలిపి” అందులో “దర్భ” ముంచి,…..చల్లిస్తూ….మంత్రాలు చదివారు(ట).

రాముడు-భీముడు సినిమాలో అనుకుంటా—రమణారెడ్డి హోటల్లో పేపరు చదువుతూ, “రోజుకి 8 లీటర్లు పాలిచ్చే ఆవు” అని చదివి, “పాలా….పంచితమా!” అంటూ వెక్కిరిస్తాడు. తెలుగువాళ్లెవరూ ఆ డైలాగ్ నీ, పంచితం అనే మాటనీ మరిచిపోరు. మరి “పంచకం” యెక్కడనించి వచ్చిందో!

మామూలు వ్యవహారంలో దీన్ని “పంచ గవ్య ప్రాశనం” అంటారు. అంటే, “గో పంచితం (మూత్రం), గోమయం (పేడ), గోక్షీరం (పాలు), గోదధి (పెరుగు), గోఘృతం (నెయ్యి)”—వీటిని “విడివిడిగా”—ప్రాశనం (అన్నప్రాశనం తెలుసుగా?)—తినిపించడం! నిజానికి ఈ “ప్రాశనం” ఇప్పుడు యెవరైనా చేస్తున్నారోలేదోగాని, ప్రతీ పూజా కార్యక్రమం లోనూ, వేదపఠన కార్యక్రమంలోనూ, బ్రహ్మోత్సవాలు మొదలైనవాటిలోనూ, ఇదో “ప్రముఖ” కార్యక్రమంగా ప్రకటించబడుతుంది. 

(ఓ నలభై యేళ్ల క్రితం, నరసాపురంలో “సరిపల్లివారి” ఇంటిలోనూ, తూర్పు గోదావరి జిల్లా (“వెల్ల” అనుకుంటా) లోనూ, “పచ్చ కామెర్లు” నివారణకి, “అరుకు” మందు ఇచ్చేవారు. బత్తిన సోదరుల “వుబ్బసానికి చేప మందు”లా. వాటి రహస్యం వాళ్ల కొంతమంది కుటుంబ సభ్యులకే తెలుసు!)

ఇక, పార్థివ దేహాలకి, పంచగవ్యాలతో “సంప్రోక్షణ” చేస్తారు. అక్కడ వేదమంత్రాలు చదవరు!

9-45 కి…..”పుణ్యపురుషులకి నాభికి పై భాగం నుంచే ఆత్మ గాల్లో కలుస్తుందన్నది విశ్వాసం. ఈ మేరకు నవ రంధ్ర, నవరత్న చేదనం జరిపించారు. ఇందులో భాగంగా నవరత్నాలను సాయి నోటిలో పోశారు”…….ఇదీ వార్త!

నవరంధ్రాలు అంటే (వివరించక తప్పడంలేదు)—2 నయన (కళ్లు) + 2 నాసికా (ముక్కు) + 2 శ్రవణ (చెవి) + 1 గ్రహణ (నోరు) + 1 మూత్ర + 1 పురీష (చివరి రెండింటికీ తెలుగు అఖ్ఖర్లేదు అనుకుంటా) = 9 రంధ్రాలు. ఇవి కాకుండా, కంటికి కనిపించని దశమ రంధ్రం, “బ్రహ్మ రంధ్రం”—అంటే, కపాలం పై “మాడు” అనబడే స్థానం. వీటిలో యేదో ఒక రంధ్రం నుంచి జీవుడు "తుది శ్వాస" రూపం లో నిష్క్రమిస్తాడు.

మహాయోగులూ, సన్యాసులూ తమ దేహ పరిత్యాగ సమయాన్ని ముందుగానే తెలుసుకొని, సమాధిని నిర్మింపచేసుకొని, అందులో తపో దీక్షలో వుంటూ, బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణ త్యాగం చేసేవారట. అదీ వారి “సమాధి స్థితి”. నాకు తెలిసి, యోగి వేమన ఒక్కడే అలా సమాధి అయినవాడు. (షిర్డీ సాయి కూడా అలాగే అంటారు కొంతమంది వీర భక్తులు.)

అనంతపురం జిల్లాలో, రాయదుర్గం లాంటి వూళ్లలో, అలాంటి యోగులు కొంతమంది వుండేవారనీ, వాళ్లు అలాగే సమాధి స్థితిని చేరారనీ ప్రతీతి. వాళ్ల “యిళ్లని” గుళ్లుగా నిర్మించి వాళ్లని ఆరాధిస్తూంటారు, జాతరలు జరుపుతుంటారు. చాలా కొద్ది కాలం క్రితం “భం భం బాబా” (పేపర్లలో అనేక కథనాలు వచ్చాయి ఈయన గురించి అప్పట్లో) తాను తపస్సు చేసిన కొండ గుహలోనే అలా సమాధి అయ్యారని అక్కడి ప్రజల విశ్వాసం!

ఈ దశమ రంధ్రాన్ని ప్రక్కనపెడితే, “నవరంధ్ర ఛేదనం” యేమిటీ?

దేహాన్ని యేదో ఓ రంధ్రంలోచి వదలిన జీవుడు, మళ్లీ యేదో ఒక రంధ్రం ద్వారా దేహాన్ని చేరడానికి ప్రయత్నిస్తాడట. మన “మిషన్” అల్లా, ఆ జీవుడిని కనీసం భువర్లోకానికి పంపించడమే! అందుకని ఆ నవరంధ్రాలనీ మూసెయ్యాలి. మామూలుగా మనకి వీలు కాదు. పైగా, ఆ రంధ్రాలని మేలిమి రత్నాలు (రాళ్లతో) మూసేస్తే, వచ్చే జన్మలో “ఫలానా” రంధ్రం ద్వారా జన్మిస్తే, వుత్తమ జన్మ వస్తుంది అని ఓ నమ్మకం! దాంతో, ముత్యము, వజ్రము, పగడము, నీలము, కెంపు, మరకతము, మాణిక్యము, గోమేధికము, పుష్యరాగము అనబడే నవరత్నాలతోనూ నవరంధ్రాలనీ మూసెయ్యడానికి ప్రయత్నిస్తాము.  

(సాధారణంగా శవాన్ని భూశయనం చేస్తారుకాబట్టి, పురీష రంధ్రాన్ని ముయ్యడం జరగదు. ఆ రత్నాన్ని కూడా ఇంకెక్కడో వేసేస్తారు.)

మరి నవరత్నాలనీ “నోటిలో” పోసేస్తారా? పోయించేస్తారా?

అదీ సంగతి.

9-55 కి……దేహాన్ని వుంచారు……బంధువులు……మృత్తికను…..వేశారు. ….ముఖ్యులు …..భక్తులు ….. భస్మాన్ని చల్లారు …….పుష్పాలతో అలంకరించారు.

ఇదీ వార్త. 

ఇవెవ్వరూ (సామాన్య ప్రజలు) చూడలేదు. ఈనాడు కెమేరాలు కూడా చూడలేదు. 

వొళ్లంతా చెవులు చేసుకొంటే వినిపించిన ఆడియో ప్రకారం….”పచ్చ కర్పూరం చల్లండి…..పచ్చకర్పూరం మాత్రమే……ఇప్పుడు మృత్తిక వేయండి……ఇంక మిగిలిన మట్టితో పూడ్చండి…..” ఇదీ జరిగింది. సేవాసమితి వారు మళ్లీ బయటి మట్టిని సంచులతో, బేసిన్లతో మోసుకురావడం కనిపించింది. 

తెర తీశాక, అందరూ యెగబడి మట్టినో, భస్మాన్నో చల్లడం ఇదివరకే వ్రాశాను. 

పుష్పాలంకరణ యెప్పుడు జరిగిందో నాకు తెలీదు. 

ప్రజల సమాధి దర్శనానికి మళ్లీ కెమేరాలు అమర్చేముందు జరిగి వుంటుంది బహుశా.

అదీ ఆ ప్రహసనం అనే “ఫార్స్”.

(రత్నాకర్ “నిత్య విధి” చేస్తున్నాడా? దశదిన కర్మలూ జరుగుతాయా? “సపిండీకరణం” వగైరా వుంటాయా? తరవాత, సమాధి వెనకున్న గణపతి విగ్రహాన్ని తొలగించి, సాయి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా? లెక, సమాధి పై మట్టీ, పువ్వులూ తొలగించి, పాలరాతి తిన్నె నిర్మించి, దానిమీద షిరిడి లెవెల్లో సాయి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా? ఆయనకి యే వారం ప్రత్యేకిస్తారు?......మిగతా కథ “వెండి తెరపై”!)
    
……అందుకే అన్నది…..యెవరి పాట్లు వారివి…..అని!
          
……ఇంకోసారి. 

10 comments:

Anonymous said...

మాస్టారూ మీతో మాట్లాడాలి మీ ఈ-మైల్‌ ఇవ్వగలరా కొంచెం

A K Sastry said...

మొదటి వ్యాఖ్యాత అన్నోన్!

నా మెయిల్ ఐడీ నా ప్రొఫైల్ లోనే వుంది కదా?

అయినా ఇస్తున్నాను.....మాట్లాడండి తప్పకుండా.

aksastry@gmail.com

సరేనా?

Sree said...

చాలా సమాచారం ఇచ్చారు. కృతజ్ఞతలు. నేను విన్నంతవరకూ గో మూత్రాన్ని పంచకమనే అంటారు. పంచితం నిజమైన పదమేమో తెలియదు మరి. అయితే ఆ సినిమా మాత్రం గుండమ్మ కథ!

జిగురు సత్యనారాయణ said...

శబ్దరత్నాకరము "పంచితము" అనే పదనికే "గోమూత్రము" అనే అర్థమిచ్చింది. "పంచకము" అనే పదానికి ఆ అర్థాన్ని ఇవ్వ లేదు. “పంచకం” అనే పదమే నేనూ విన్న, మరి ఇది ఎలా వచ్చిందో!!

A K Sastry said...

డియర్ Sree!

గుర్తొచ్చింది....అది గుండమ్మ కథే. ఇక పంచకం అనేది ఓ సంఖ్యావాచకం. దుష్ట "చతుష్టయం"; పాండవ "పంచకం" లాగ. అది సామూహిక సర్వనామం కూడా. "ముక్కోటి" దేవతల్లా!

"పంచితం" అనేదే సరైన పదం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ జిగురు సత్యనారాయణ!

శబ్దరత్నాకరాన్ని శోధించి, నాకు మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు.

పంచకము గురించి పై వ్యాఖ్యాతకి ఇచ్చిన జవాబుని గమనించండి.

ఈ మాత్రానికి శబ్దరత్నాకరాలు అవసరం లేదు.....మన బుర్ర కొంచెం వుపయోగిస్తే చాలు. (ఇలా అన్నానని మిమ్మల్ని అవమానించానని అనుకోవద్దు....దయచేసి!)

పంచకం అనే పదం--పంచితానికీ, దీనికీ తేడా తెలియక, "పంచ గవ్యం" ని మన "అరకొర" మీడియా పండితులు ప్రాచుర్యంలోకి తెచ్చినదే!

ముఖ్యంగా, ఈనాడు వారు ఇలాంటి విలేకర్లని ఇంటికి పంపించేస్తే సంతోషించేవాళ్లలో మొదటి వాణ్ని నేను.

మరోసారి ధన్యవాదాలు.

Anonymous said...

మాస్టారూ మీకో మైల్‌ పంపించాను వచ్చిందా?

A K Sastry said...

బాగుంది. మీ మెయిల్ కన్నా మీ కొర్రీ ముందు వచ్చింది అనుకుంటా.

మీ మెయిల్ కోసం నిరీక్షిస్తున్నాను.

ధన్యవాదాలు.

Anonymous said...

అదేంటి మాస్టారూ ఎప్పుడో పంపించాను.
అయినా ఇప్పుడు ఇంక దాని అవసరం లేదు లెండి. మీరి బొక్స్‌ బీ అనే సాఫ్ట్‌ వేర్‌ వాడుతున్నట్టున్నారు దానివల్ల ఎవడు ఈ-మైల్‌ రాసినా స్పాం అయి మీ గెస్ట్‌ బుక్‌ లోపేరు నమోదైన తర్వాతే మీకు డెలివర్‌ అవుతుంది.
పనిలో పనిగా నన్ను బాక్స్‌ బీ లో చేర్చుకుని నా అడ్రెస్‌ బుక్‌ కి ఆక్సెస్‌ అడుగుతోంది.

మీ ఇన్ఫర్మేషన్‌ కోసం-- అలా మన ఈ మైల్‌ ఎవరో థర్డ్‌ పార్టీలకి ఆక్సెస్‌ ఇవ్వడం అంత మంచిది కాదేమో ..

A K Sastry said...

పై అన్నోన్!

నా మెయిల్ బాక్స్ లో బోల్డ్ అక్షరాల్లో వున్న యే వుత్తరాన్నైనా, స్పామ్, బాక్స్ బీ లతో సహా చూడందే వదలను. స్పామ్ లకి ఫిల్టర్లు తగిలిస్తాను. బాక్స్ బీ లని 'ఇన్‌బాక్స్ ' లోకి మార్చుకుంటాను.

మరి ఈ దాగుడుమూతలెందుకు?

నిర్భయంగా వ్రాయండి.