Wednesday, November 2, 2011

ప్రశాంతి.......ప్లెబిసైట్



కాశ్మీర్ వ్యవహారం

"కాశ్మీర్ సమస్యకి పరిష్కారం అక్కడ 'ప్లెబిసైట్' నిర్వహించడమే" అన్నాట్ట ప్రశాంతి భూషణ్! (నిజంగా అవే మాటలన్నాడోలేదో నాకు తెలీదు). 

అందుకని, సుప్రీం కోర్టులో ఆయన కార్యాలయంలో ఆయనని క్రిందపడేసి, తొక్కేసి, చొక్కా అవీ చింపేసి, నానా హంగామా చేశారట కొందరు "దేశ భక్తులు"! బాగుంది. 

వివిధ ప్రముఖ పత్రికల్లో అనేకుల వ్యాసాలూ, ఖండన మండనలూ, "యెట్టి పరిస్థితుల్లోనూ దానికి వొప్పుకోం!" అనే హెచ్చరికలూ....."రాచకీయ రక్తులకి" పండగే పండగ! 

అందులోనూ ఆయన "అన్నా బృందం" వాడాయే! ఇంకేమి కావాలి? 

అంతేగానీ, ఆయన ఆ మాట అని వుంటే, "దాని పొడుగెంత, యెలడుపెంత, దాన్సిగతరగ! లోతెంత?" అని యే (అ)వివేకి అయినా మాట్లాడాడా? వూహూ! 

చరిత్రలోకి వెళితే, స్వాతంత్ర్యం వచ్చాక, పాకిస్థాన్ కాశ్మీరు ఆక్రమణకి భారత్ మీద యుధ్ధం ప్రారంభిస్తే, కొంత భాగాన్ని "ఆక్రమిస్తే", జనరల్ కరియప్ప "మూడో నాటికల్లా వాళ్లని తరిమేసి, మన భూభాగం స్వాధీనం చేసుకొంటాం" అని హామీ ఇచ్చినా, నెహ్రూ "వద్దు! వద్దు! మనం శాంతి కాముకులం" అంటూ, అప్పటికి క్రొత్తగా సమర్తాడిన ఐక్యరాజ్య సమితి మోజులో, సమస్యని అక్కడ దాఖలు చేస్తే, ఆ సమితి యేమని తీర్మానం చేసింది? "కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలి. తీర్పు యెలావస్తే అలా రెండు దేశాలూ అమలు చేయాలి" అని! 

కానీ మన దేశంలో "సెంటిమెంటల్ ఫూల్స్" అరవ "సియార్" (హిందీలో గుంటనక్క!) అనబడే రాజగోపాలాచార్యులు లాంటివాళ్లు దానికి అడ్డుపడ్డారు. భారత్ 'వెనుకంజ" వేసింది. అక్కడితో మొదలు రావణ కాష్టం. 

తరువాతకూడా, చైనా "ఆక్సాయ్ చిన్" ఆక్రమిస్తే, నెహ్రూ "అక్కడ గడ్డిపరక కూడా మొలవదు.....దానికోసం మనకి అంత అవసరమా?" అంటే, ఆ సియారే "నీ బట్టతలమీదకూడా యేమీ మొలవదు కాబట్టి అది కూడా......?" అని వెక్కిరించాడు. దాంతో మరో రావణ కాష్టం!

ఇందిరాగాంధీ సైతం, 1965లోనూ, 1971లోనూ, ఆ తరవాతా, మన సైన్యం యుధ్ధాల్లో గెలుచుకున్న అపారమైన పాకిస్థాన్ భూభాగాలని యే షరతులూ లేకుండా తిరిగి వారికి అప్పగించేసిందేగానీ, వాళ్లతో బేరం పెట్టలేకపోయింది! మన మిగ్ (MIG) విమానాలతో అమెరికన్ నాట్ (GNAT) విమానాలని ఈగల్లా నలిపేసిన మన సైనికులూ, స్క్వాడ్రన్ లీడర్ "ట్రెవర్ కీలర్" లాంటివాళ్ల త్యాగాలని అర్థంలేనివిగా చేసేసింది! 

నిన్నో మొన్నో, మన్మోహన్ బంగ్లాదేశ్ తో యేదో వొప్పందం చేసుకొని, భారతీయులు, భారత పౌరులు కానివారు వుంటున్న దీవులని, తీసేసుకొని, బంగ్లా పౌరులు, అక్కడ పౌరసత్వం లేనివాళ్లు వుంటున్న దీవులని వాళ్లకి ఇచ్చేశాడు. ఇదెంత బాగుంది? (అక్కడక్కడా తింగరాళ్లు యెవరో విమర్శలు చేసినా, దేశం మొత్తమ్మీద యెవరూ వ్యతిరేకించలేదు దీన్ని!) 

మరి, అలాంటి సూత్రాన్నే కాశ్మీర్ సమస్యకీ, చైనా సమస్యకీ వర్తింపచేస్తే, తప్పేముంటుంది? ప్రశాంతి అన్నదాంట్లో తప్పేముంది? 

మాజీ ఐయేయెస్, లోక్ సత్తా అధినేత సైతం, కాశ్మీర్లో "రిఫరెండం" అంటాడు! ప్లెబిసైట్ కీ, రిఫరెండం కీ తేడా తెలీదు అనుకోవాలా? 

ఇలాంటివి అన్నీ "ప్రజాభిప్రాయ సేకరణలే" అయినా, దేశాల మధ్యా, దేశంలోనూ, ప్రాంతాల మధ్యా.....ఇలా అన్నింటికీ వేరే వేరే మాటలున్నాయి. 

ఈ కాంగీలని తెలంగాణా గురించి రాష్ట్రం మొత్తమ్మీద "రిఫరెండం" నిర్వహించమనండి! అబ్బే! అలా చేస్తే సమస్య అంతరించిపోదూ! సమస్య అంతరిస్తే, మన పార్టీ, మన నాయకులూ, మన అధిష్టానాలూ, మన గుత్తేదార్లూ, మన వృధ్ధి రేటూ, మన .......అవీ ఇవీ అన్నీ.....యేమయిపోవాలి? 

అందుకే, ప్రశాంతి ని తన్నుదాం, కేజ్రీవాల్ ని కేసుల్లో ఇరికించేద్దాం, కిరణ్ బేడీని తీహార్ జైలుకి పంపిద్దాం......చివరికి అన్నా మౌన దీక్ష భగ్నం అయ్యేవరకూ వాళ్ల సంఘ సభ్యులందర్నీ యేదేదో చేసేద్దాం! 

"భలే మామా, భలే! అదే మన తక్షణ కర్తవ్యం!"   

4 comments:

Lakshmi Naresh said...

కృష్ణశ్రీ గారు,

ఇది మనకి కంట శోష. కాని బాధ అనిపిస్తుంది. మనది అయినదానికీ కూడా మనమిలా ఎవడి దగ్గరకో (US ) వెళ్లి బాబు మీరు కూడా ఓ మాట చెప్పండని వాళ్ళ దగ్గర దేబిరించడం. అది చూసి విరోధి నవ్వుకోవడం , మనం ఎంత ఉక్రోశాపడ్డా, ఏఎ సిగ్గులేని రాజకీయనాయకులకి, చీమకుట్టినట్టయినా కాదు. ఎందుకు మనం వీళ్ళని ఎన్నుకుంటున్నామో. చూసారా, మనకి ఇంకో అవకాశం లేకుండా చట్టాలు చేసారు. 100 మంది ఉన్న నియోజక వర్గం లో 40 మంది వోట్లు వేస్తే అందులో 18 వోట్లు వచ్చిన పార్టీ నాయకుడే ఆ నియోజక వర్గాన్ని పాలించేలా చట్టాన్ని చేసిన వీళ్ళని ఏమనాలి, వ్యతిరేకించని మనల్ని ఏమనాలి...ఎవడైనా ఎదురు తిరిగి ఏమిటిది అంటే, వాడిని చూసి జాలిపడే వాడు, వీడికేందుకు అనుకునేవాడు, ఫలానా వాడు ఇలా అంటున్నాడని ఉప్పందించే సాటి జనులు ఉన్ననత వరకు మన దేశం, మనం ఇంతే. ఇది పరాయి వాళ్ళ పరిపాలన కోసమే ఉన్న భూమి.

A K Sastry said...

డియర్ lakshminaresh!

కంఠశోష అని వూరుకోలేకే కదా! చూశారా.....వ్రాసిన కొన్నాళ్లకి మీరు చదివి, వ్యాఖ్యానించారంటే, నాగొంతు విన్నట్టేగా? ఇలాగే బిందువూ, బిందువూ కలిసే, "అన్నా వుద్యమం" అనే మహాసాగరం యేర్పడింది! చట్టాలని చేసుకున్నది మనమే. అందుకే తరవాత యెన్నికల సంస్కరణలకోసం వుద్యమిస్తానంటున్నాడాయన. బాబ్బాబూ! మళ్లీ పరాయి పాలనగురించి మాత్రం యెత్తకండి. యేదో కలో గంజో తాగి, ఇవాళ్టికి నాకే చీకూ చింతా లేవు అనుకోకపోతే, ఆ రాత్రికి నిద్రపట్టదుకదా? ఆ ఆస్కారం ఇంకెవరి పాలనలోనూ వుండదు!

మీ టపాలు కూడా బాగున్నాయి. చక్కగా వ్రాస్తున్నారు. కొనసాగించండి.

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

gimmeabreak plz! said...

ఏంటో ఎవరికి వాళ్ళు "నేనే జనాల అభిప్రాయాలకి అద్దం పడుతున్నా" అని నాటకాలాడుతారు. అసలు అద్దం పడుతున్నారో "అడ్డం" పడుతున్నారో తెలుసుకోలేకపోతున్నారు.AFSPA తీసెయ్యాలని మాట్లాడుతారు.అంటే ఇన్నాళ్ళూ మనల్ని రక్షించటానికి రాత్రింపగళ్ళు పోరాడి చనిపోయిన జవాన్లు పిచ్చోళ్ళా?ఒమర్ అబ్దుల్లాకి సేన ఎలా పని చేస్తుందో తెలియకపోతే నోరు మూసుకుని కూర్చొవాలి. సేన పని సేనని చేసుకుపోనివ్వాలి కద. ఇంకో నాలుగు పీకినా నాకు ఏం బాధ కలిగేది కాదు ప్రశాంత్ భూషణ్ ని ఆ రోజు.

A K Sastry said...

డియర్ gimmeabreak plz!!

మీ అభిప్రాయం చెప్పారు బాగుంది.

అయినా, ఇక్కడ విషయం సమస్యలకి మూలం అయిన కాంగ్రెస్, సమస్యలకి పరిష్కారం గురించీ!

ధన్యవాదాలు.