Sunday, December 20, 2009

బ్లాగులు


అంతరంగాలు


'ఇంటర్నెట్' ని 'అంతర్జాలం' అనీ, 'పోస్ట్'లని టపాలు అనీ అనువదించుకున్నాం--బాగానే వుంది గానీ, 'బ్లాగ్'లని యెవరూ అనువదించలేదెందుకో?  


బ్లాగులు వ్రాసేవాళ్ళందరూ (ఒకళ్ళిద్దరు తప్ప) తాము మనసా, వాచా నమ్మినవాటినే వ్రాస్తారు కాబట్టి, వీటిని 'అంతరంగాలు' లేదా 'ఆంతర్యాలు' అందామా?  


మరి అంతరంగాలు వ్రాసేవాళ్ళని యేమనాలి? 'అంతరంగ రచయితలు' అంటే బాగుండలేదు! 'ఆంతర్యులు' అంటే యెలా వుంది?  


సరే! ఇంతకీ యెందుకు మొదలుపెట్టానంటే, మన తెలుగు బ్లాగర్ల మీద నాక్కోపం వస్తోంది!  


యెంతోసేపు బుర్రని ఫోర్కుతో చుట్టూరా గుచ్చుకొని, మెదడు బయట పడేసి, చిందరవందర చేసి, దాంట్లో విలువైన ఆలోచనలని ప్రోదిచేసి, వ్రాసీ, తిరిగి వ్రాసీ, తప్పులు దిద్దుకొనీ, కాస్త ఆవేశం తగ్గించుకొనీ, మళ్ళీ మళ్ళీ వ్రాసీ, ఓ టపాని ప్రచురిస్తే, ఒకటో రెండో వ్యాఖ్యలు! 


అవీ అసలు విషయాన్ని పట్టించుకోకుండా, టపా మొదట్లో వ్రాసిన ఏ చిన్న విషయాన్నో పట్టుకొని, రాధ్ధాంతాలూ, కు విమర్శలూ, 'స్టాండర్డ్' వాగుళ్ళూ!


ఇదండీ--మన తెలుగు బ్లాగు ప్రపంచం!  


అసలు 'కాంట్రవర్సీ' లోకి ప్రవేశించడానికే భయపడుతున్నట్టున్నారు మన బ్లాగర్లు! మరి భయం యెందుకో తెలియదు!  


నేను మొదటినించీ, అన్ని బ్లాగులలోనూ, 'కాంట్రవర్షియల్' విషయాలనే వ్రాస్తున్నాను! 


వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకీ, దేవస్థానాలకీ, చివరికి మా బ్యాంకు యాజమాన్యానికీ, 'లింకులు' పంపిస్తున్న స్నేహితులు యెందరో వున్నారు!  


మరి వ్యాఖ్యలు చేసేవాళ్ళు పూర్తిగా చదవరో, ఇంకేదైనా ప్రభావాలకి లోనవుతారో, అవగాహనా లోపమో--తెలియదు! 


అసలు కాంట్రవర్షియల్ విషయమ్మీద ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యలు--దాదాపు శూన్యం!  


ఒక్కొక్కసారి, నాలుగు గొంతుకలతో విరుచుకుపడే మలక్ పేట్ రౌడీ దగ్గరనించీ, మంచుపల్లకీ వంటివాళ్ళ దగ్గరనించీ, చక్కటి బ్లాగు నిర్మించుకున్న మంగేష్, వంశీ ఎం మాగంటి ల వరకూ, ఇదే నేను గమనించింది!


అఖిల ప్రపంచ తెలుగు బ్లాగరులారా! యేకం కండి! మీకు పోయేదేమీ లేదు! అనవసర భయాలు తప్ప!  


యెలా వుంది నా నినాదం?

Wednesday, December 9, 2009

పరీక్షలు


తెలుగు జూనియర్ లెక్చరర్లు


ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు--మిగిలిన సబ్జెక్ట్ ల తో పాటు తెలుగులో కూడా--వివిధ కళాశాలల్లో తెలుగులో జూనియర్ లెక్చరర్ల నియామకం కోసం.  


ఆ పరీక్షలో యెంతమంది సఫలీకృతులవున్నారో, యెంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో, అందరికీ తెలుసు!  


ఈ పరీక్షలకి సిధ్ధమవుతున్న అభ్యర్థులకోసం ఈనాడు పత్రిక తన 'ప్రతిభ' శీర్షిక క్రింద చక్కని శిక్షణ ఇస్తున్నారు--డా. ద్వా. నా. శాస్త్రి గారి ద్వారా.  


మరి ప్రశ్న పత్రాలెవరు రచిస్తారోగానీ, వాటి సమాధానాలు వారికైనా తెలుసో లేదో తెలియదు.  


ఇక 'కృతార్థులైన' అభ్యర్థులు, జూనియర్ లెక్చరర్లు అయిపోతున్నారు!  


అదేమి విచిత్రమో, వారిలో కొంతమందిని చాలా సామన్యమైన విషయాల్లో ప్రశ్నించినా, సరియైన సమాధానాలు రావు! (మరి పిల్లలకి యేమి బోధిస్తారో!)  


ఉదాహరణకి, ఓ తెలుగు జూనియర్ లెక్చరర్ ని 'బాలగంగాధర తిలక్ గురించి మీ అభిప్రాయమేమిటి?' అనడిగితే, 'ఆ సారు నెత్తిమీద ముడిచుట్టుకొని వుంటాడు సార్--హోలిండియా మొత్తానికి గణేష్ పూజ స్టార్ట్ జేసింది ఆయనే సార్! మా గొప్ప సారు!' అంటాడు. (అడిగినవారి వుద్దేశ్యం--దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి)  


మరి ద్వా నా శాస్త్రిగారు యెంత నిర్దుష్టమైన శిక్షణ ఇస్తున్నారో చూడండి! 


మచ్చుకి తెలుగు, పేపర్ II కోసం కొన్ని ప్రశ్నలూ, వాటి సమాధానాలూ--  


1. 'స్టూపింగ్ టు రైజ్' కు తెలుగు అనువాదం? (ఇది ఓ కథా? కావ్యమా? గద్యమా? పద్యమా? వ్రాసినవారెవరు? యే భాషలో? యేదేశం వారు? యేకాలం వారు? అందులో వస్తువేమిటి?--ఇలాంటి ప్రశ్నలకి యెవరైనా--ద్వా నా శాస్త్రిగారు తప్ప--సమాధానం చెప్పగలిగితే, నా యెడమ చెవి కోసి ఇస్తాను!--యెందుకంటే, వినరానివి వినడం సగమైనా తగ్గుతుంది కదా!)  


సమాధానం : సంస్కర్త హృదయం (దీనికి కూడా పై ప్రశ్నలన్నీ 'డిట్టో'--నా చెవి తప్ప!--యెందుకంటే అప్పటికే అది కోసివేయబడి వుంటుంది కనుక!)  


2. అనేకార్థక కావ్యానికి వుదాహరణ? (ఇదేమి కావ్యమో--ఇలాంటివి యెన్ని వున్నాయో!)  


సమాధానం : 1. రాఘవపాండవీయం, 2. హరిశ్చంద్ర నలోపాఖ్యానం, 3. యాదవరాఘవ పాండవీయం, 4. అన్నీ--అనే మల్టిపుల్ చాయిస్ లో, 4 వది--అన్నీ అని!  


3. సి నా రె 'కర్పూర వసంతరాయలు' యెవరికి అంకితం ఇచ్చాడు? (సి నా రే యెవరు? '....వసంతరాయలెవడు?' అంకితం యెవరికి?)  


సమాధానం : మల్లంపల్లి సోమశేఖర శర్మ కి (ఈయనెవడు?)  


4. కైశికి, ఆరభటి...వీటిని అలంకారికులేమంటారు? (ఈ భయంకరమైన విషయాలేమిటో, అలంకారికులెవరో!)  


సమాధానం : వృత్తులు (చాకలి మంగలి లాంటివేమో!)  


5. ప్ర, పరా, సం, అవ....వీటిని యేమంటారు? (పర, పరాగ, సంపర్కం, అవబడునా--ఇలాంటివేమో!)  


సమాధానం : ఉపసర్గలు (అసలు సర్గలేమిటో, వాటికి ఉపసర్గలేమిటో!)  


నిజం చెపుతున్నాను--మా మేష్టార్లు మాకు అప్పుడప్పుడూ సరదాగా చెప్పిన విషయాల్నీ, పాఠాల్లో చెప్పిన విషయాల్నీ, నాకున్న పుస్తక పరిఙ్ఞాన్నీ వుపయోగించి, నాపుర్రెని 'ఫోర్కు'తో చుట్టూ గుచ్చుకొని, మెదడుని బయటికితీసి, చిందరవందర చేసినా--వారం వారం 'వారు' ఇస్తున్న ప్రశ్నల్లో ఓ ఇరవై శాతం కూడా సరిగ్గా జవాబు చెప్పలేకపోతున్నాను!  


మరి ఆ అభ్యర్థులనీ, వాళ్ళదగ్గర చదువుకునేవాళ్ళనీ--ఆ దేవుడైనా రక్షించగలడా అని!  


ద్వా నా శాస్త్రి గారూ--క్షమించండి!


Monday, November 30, 2009

......సం రక్షణ


‘………….గ్రామయాత్ర’


మొన్న ఆదివారం సాయంత్రం యేమీ తోచక రోడ్డుపక్కన నిలబడితే, అక్కడ ఓ కులం వాళ్ళు కట్టించుకున్న వెంకటేశ్వర స్వామి గుడి ముందు దాదాపు టాటా ఏస్ వాన్ అంత సైజులోనేవున్న ఒక వాన్ ఆగి వుంది.  


రోడ్డుమీద సైకిళ్ళపై వెళుతున్న నలుగురైదుగురు (తొమ్మిదో, పదో తరగతి) ఆడపిల్లలు(—నవ్వుతూ తుళ్ళుతూ వెళుతూండడం వారి వయసులో సహజం!) వాళ్ళ వ్యాఖ్యలు నా చెవిని పడ్డాయి.  


(వాళ్ళు చదువుతున్న స్కూలు లోని--వాళ్ళ సబ్జెక్ట్ లో బోధించే వాళ్ళ దగ్గరే--‘ట్యూషన్’ చెప్పించుకోడం ఈ రోజుల్లో తప్పనిసరి!)  


వ్యానుకోపక్కని మేస్తున్న గేదెని చూసి “యేమే! ఇవాళ ‘గేదెగ్రామ యాత్రేమోనే!’” అందో అమ్మాయి. 


మిగిలినవాళ్ళు గొల్లున నవ్వారు.  


ఇంకో అమ్మాయి, ఆ వ్యాను ముందున్న ఓ పందినీ, పిల్లల్నీ గమనించి, “కాదే! ‘పందిగ్రామ యాత్రనుకుంటా!’” అంది. ఇకవాళ్ళ నవ్వులకి కంట్రోలు వుంటుందా!  


కొన్ని సంస్థలు, నిర్వాహకులు మన హిందూ ఆచారవ్యవహారాలనీ, నమ్మకాల్నీ, సాంప్రదాయాల్నీ యెలా భ్రష్టుపట్టించి, కౄరమైన పరిహాసాలాడుతున్నాయో (రో) గమనించారా?  


(ఇది నా ‘క్యామెడీ చానెల్’ లో వ్రాద్దామనుకొన్నాను! కానీ నేనింకా పరిహసిస్తున్నాననుకొంటారేమోనని భయపడ్డాను!)





Monday, November 16, 2009

గో సంరక్షణ


'గోగ్రామయాత్ర'


మొన్నటి విజయదశమి పర్వదినాన, ఉత్తరభారతం లోని 'కురుక్షేత్ర' నుండి, 108 రోజులలో దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి 17 జనవరి 2010 న 'నాగపూర్' చేరుకొనేలా ఓ మహానుభావుడు ఓ యాత్ర బయలుదేరదీశాడట--"సత్యము, శివము, సుందరము" అనే లక్ష్యాలను ముందుంచుకొని, 'విశ్వమంగళ గో-గ్రామ యాత్ర' ప్రారంభించబడిందట.  


దీనికి సంకల్పం, గోకర్ణపీఠాధిపతి శ్రీ రామచంద్రపూరమఠం శంకరాచార్యులు పూజ్యశ్రీ రాఘవేశ్వర భారతీ మహాస్వామీజీ అట.  


లక్ష్యము :  


1. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.  
2. గో వంశ రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టం చేయాలి.  
3. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం కొరకు ప్రతి గ్రామం లో గోమాతను సం రక్షించి పోషించాలి.  
4. భారతదేశం లో గో సంరక్షణను కోరుతూ, గౌ. రాష్ట్రపతిగారికి ప్రపంచములోనే అతిపెద్ద సంతకాల సేకరణ ఉద్యమము ద్వారా 50 కోట్ల సంతకాలతో వినతి పత్రం సమర్పించాలి.  
5. సేంద్రియ ఎరువులతో చేస్తున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి.  
6. పట్టణాలలో గో సంరక్షణ కేంద్రాలు, గ్రామాలలో గో ప్రేమీ కుటుంబాలను ప్రోత్సహించాలి.  


చక్కని, ఉదాత్తమైన ఆశయాలు.  


దీనికోసం, సంపూర్ణ భారతదేశం లోని 6 లక్షల గ్రామాలకి వెళ్ళి, కుల, మత, వయస్సు, లింగభేదము, పేదరిక, ఉద్యోగము, చదువు, నిరక్షరాస్యత మొదలైన భేదభావాలు కనపరచకుండా, (యాత్రని పూర్తి చెయ్యాలట).  


ఇంతకీ ఈ పేరుతో జరుగుతున్నదేమిటి?  


1. అసలు యాత్ర ఉత్తరభారతం లోనే జరుగుతూండగా, వివిధ రాష్ట్రాలకీ, "కురుక్షేత్రం లో తయారుచెయ్యబడ్డ 'శ్రీ కృష్ణుడి' విగ్రహాలు" పంపించారట.  


2. ఆయా రాష్ట్రాల్లో మళ్ళీ పధ్ధెనిమిది నించి నూట యెనిమిది 'రధాలని' (టాటా యేస్ వంటి వాహనాలని) వెనక తొట్లో శ్రీ కృష్ణ విగ్రహాలని వుంచి, ప్రతీ గ్రామంలో తిప్పడానికి, మండలాలవారీగా తారీఖులతో కార్యక్రమాలు ప్రకటించారు.  


3. ఆయా గ్రామాల్లో 'కట్టించబడిన' 'స్వాముల' గుళ్ళముందు ఆ రథాలని ఆయా తేదీల్లో నిలిపి, (కార్తీక మాస సందర్భం గా ఆ గుళ్ళకి వచ్చే) 'భక్తులని' చైతన్యవంతం చేస్తారట!  


మావూళ్ళో నేను చూసిన 'గోగ్రామయాత్ర' ఇలా జరిగింది.  


ఓ కులం వాళ్ళు కట్టించుకున్న 'శ్రీ వేంకటేశ్వర స్వామి' గుడి ముందు ఆ 'రథం' ఆగింది.  


అంతకుముందే ఆ గుడికి రోజూ వచ్చే 'భక్తుల్ని '--ఒకాయన మైకు లో హెచ్చరిస్తున్నాడు--'యెవరూ గుడికి ప్రదక్షిణాలు చెయ్యద్దు; గంటలు కొట్టద్దు; ధ్వజ స్థంభం ముందు దీపాలు వెలిగించద్దు--మనం ఇవాళ ఓ ప్రత్యేక సందర్భం లో ఇక్కడికి వచ్చాం! మేము చెప్పేవరకూ ఇవన్నీ యెవరూ చెయ్యద్దు--చేసినా ఫలితం వుండదు' అంటూ!  


ఇంకొకాయన మైక్ అందుకొని, 'గోవు' గురించి 'చాలా' చెప్పాడు--ఈ రోజుల్లో గోవులు లేవు--జెర్సీ ఆవులు వున్నా అవి పూజార్హం కాదు--మూపురం వున్న ఆవులే గోవులు--అలాంటి గోవుకోసం అన్వేషణ జరిపితే, ఇక్కడకి మూడు కిలోమీటర్ల దూరం లో ఒకే ఒక చోట ఆ గోవు దొరికింది--దాన్ని తోలుకు వస్తున్నారు ఇక్కడికి--అది వచ్చాక మన కార్యక్రమం ప్రారంభిద్దాం--(ఈ లోపల కురుక్షేత్రం నుంచి బయలుదేరిన యాత్ర, కృష్ణ విగ్రహాలు, మన జిల్లాలో యెవరు యెన్ని రథాలు పంపించారు--ఇలా చెప్పుకు పోతున్నాడు!)  


తరవాతేమయిందో, 'మీరందరూ ఒక్కొక్కళ్ళూ గుడిబయట వున్న వాను కి ప్రదక్షిణం చేసెయ్యండి--అందులో వున్న గోపాలుడు, శ్రీ కృష్ణ పరమాత్మ మిమ్మల్నీ, మీ గ్రామం లోని గోవుల్నీ అనుగ్రహిస్తాడు--తోసుకోకండి, అయిపోయాక లోపలకి వచ్చి, ప్రసాదాలు తీసుకుని మరీ వెళ్ళండీ అని చెప్పి, 'ఓం గోమాత్రే నమహ్' అంటూ చ్హాంట్ అందుకున్నాడు.  


వాన్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలై, సగం మంది పూర్తి చేసి, గుళ్ళో ప్రసాదాలకోసం తోసుకుంటున్నారు.  


అంతలో వచ్చారు--(యవరూ? తాతా? అని అడగకండి!)--గోవునీ, గోవత్సాన్నీ తోలుకొంటూ ఇద్దరు మనుషులు--3 కిలోమీటర్ల దూరం నించీ!  


మిగిలిన సగం మంది భక్తులూ వెంటనే, వాన్ ని వదిలేసి, గోవుకి ప్రదక్షిణాలు చేసేస్తూంటే, ప్రసాదాలు తిన్నవాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి ప్రదక్షిణాలు మొదలెట్టారు గోవు/వత్సం చుట్టూ!  


యెట్టకేలకు తతంగం పూర్తయి, అందరూ సద్దుమణిగారు--వాన్ వెళ్ళిపోయింది--ఇంకో గుడికో, గ్రామానికో!  


కొసమెరుపేమిటంటే--50 కోట్ల సంతకాల మాటెవరికీ ఙ్ఞాపకం లేదు; యెవరూ అడగలేదు, పెట్టలేదు!  


మహజరు రాష్ట్రపతికి అందుతుందా, ఆవిడ నవ్వుతారా--సీరియస్ గా తీసుకుంటారా, గోవు ప్రత్యేక ప్రాణి అవుతుందా, చట్టం చెయ్యబడుతుందా, '....కేంద్రాలూ', '.....కుటుంబాలూ యేర్పడతాయా?  


వీటన్నిటికీ సమాధానం--వెండితెరపై!





Friday, October 30, 2009

పూజలు


పుష్పాలు


.....అవే 'మన్మధ బాణాలు'! 


'చూత, కేతకీ........' మొదలైన పుష్పాలని యే పుష్ప బాణాన్ని యే సందర్భం లో యెవరి మీద మన్మధుడు ప్రయోగిస్తాడో కూడా మన కవులు వ్రాశారు. ఈ పువ్వులనే స్త్రీలు తమ సిగలో తురుముకుంటారు! మరందుకే గదా వాటిని మన్మధ బాణాలన్నది!


ఈ పుష్పాలు కాకుండా దేవుని పూజలకి కొన్ని ప్రత్యేకించారు--ఆయా దేవుళ్ళ ప్రీతి ప్రకారం. వీటిని స్త్రీలు సిగల్లో తురుముకోరు! అవన్నీ మన దృష్టిలో సువాసనలేని పూలు. కామవికారాలు కలిగించని పూలు. దేవుళ్ళని పూజించడం లో మన వుద్దేశ్యం వాళ్ళకి కామవికారాలు కలిగించాలని కాదు కదా? అవన్నీ అనవసరం, నేను ఆ సువాసన పూలే పూజ చేస్తాను అని యెవరైనా అంటే, వాళ్ళకో నమస్కారం!  


విచిత్రమేమిటంటే, ఇప్పుడు 'మన్మధ బాణాలతో' దేవుళ్ళని అలంకరిస్తున్నారు--పుష్ప యాగాలు చేసేస్తున్నారు!  


పండగ వచ్చినా, కార్తీకం లాంటి కొన్ని ప్రత్యేక మాసాల్లోనూ, స్త్రీలు అలంకరించుకునే మల్లెలూ, కనకాంబరాలూ, చామంతులూ, రోజాలూ మొదలైన వాటి ధర ఆకాశం పైకి యెక్కి కూర్చొంటోంది! కారణం--జనాలు వేలం వెర్రిగా కొన్నైనా ఈ పూలు కొని, దేవుళ్ళ నెత్తిమీద పోస్తుండడం! వీళ్ళ పుణ్యం సంగతి దేవుడెరుగు--వ్యాపారులు బాగుపడ్డానికి దోహదం చేస్తోంది ఇది!  


నిజంగా పసుపు గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు, నాగ మల్లి, మందార, మంకెన, కరవీర, జిల్లేడు లాంటి పువ్వుల్నెవరూ అమ్మడం లేదు--యెవరూ కొనడం లేదు--దేవుళ్ళకి అర్పించడం లేదు! గుళ్ళలో పూజారులు మాత్రం, ఉదయాన్నే స్వాములకీ, అమ్మవార్లకీ వీటితోనే అర్చన ప్రారంభిస్తారు!  


పసుపు గన్నేరు--విష్ణువుకీ, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు అమ్మవార్లకీ, నాగ మల్లి, మందార, మంకెన, కరవీరాలు శివుడికీ, జిల్లేడు గణపతికీ ప్రీతికరమైనవి. ఇక కలవలూ, తామరలూ చెప్పక్కర్లేదు.  


ఒక్క మొగలి పువ్వుకి దేవుళ్ళని పూజించే అర్హత లేదు--బ్రహ్మతరఫున అబధ్ధ సాక్ష్యం చెప్పినందుకు!  


ఇంకా, పొగడ పువ్వుకొక్కదానికే, నేల రాలినా, దేవుడి మస్తకం చేరే అర్హత వుందంటారు! మిగిలిన యే పువ్వుకీ లేదు. (ఇదెందుకో నాకు తెలీదు--తెలిసినవాళ్ళెవరైనా చెపితే సంతోషం.)  


మరి ఈ పుష్ప యాగాలూ, జనాలు నష్టపోవడం, వ్యాపారులు బాగు పడడం, ఇవన్నీ యెందుకు?

Monday, October 26, 2009

పాదాభివందనాలు!



స్వామీజీలకి.....


21-10-2009--రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి, డీ జీ పీ శ్రీ గిరీష్ కుమార్--ప్రకాశం జిల్లాలో చేవూరు వద్ద అయిదోనెంబరు జాతీయ రహదారిపై వున్న స్వామీజీ రామదూత పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారట!  


ఆయన తన చొక్కా వూడిపోతూండగా, మోకాళ్ళునేలకాంచి, ఆ స్వామీజీ పాదాలపై చేతులూ, తలా ఆనించిన ఫోటో పత్రికల్లో ప్రచురించబడింది!  


ఆ స్వామితోపాటు, అభిషేక పూజల్లో ఇంకా కొంతమంది కూడా పాల్గొన్నారట! వాళ్ళందరికీ యేవో కారణాలుండవచ్చు--కానీ ఈ డీ జీ పీ కేం ఖర్మ రా బాబూ అనీ, అసలు ఈ రామదూత స్వామి యెవడూ? అనుకున్నాను!  


ఆ మర్నాడు పేపర్లో, ఆ స్వామీజీ బండారం బయటపెట్టబడింది--కొంతమందిచే!  


చేవూరులో రామదాసు అనే వ్యక్తి 'రామదూత స్వామి ' గా అవతరించి, సర్వే నెంబరు 883 లోని అటవీ భూమినీ, సర్వే నెంబరు 879 లోని చెరువు పోరంబోకు భూమినీ--దాదాపు 20 యెకరాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారట.  


గతం లో ఆ ప్రాంతం లో భిక్షాటన చేసుకునే వ్యక్తి ఈ రోజు దొంగస్వామిగా మారి, ఏ సీ కార్లలో విహరిస్తున్నాడట.  


14-7-2002న అప్పటి అటవీశాఖ మంత్రి ఆయ్యన్న పాత్రుడు ఈ దొంగ స్వామి భూ ఆక్రమణదారుడే అని ప్రకటించారట!  


8-7-2004న రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చంద్రశేఖర్ దొంగస్వామి భూఆక్రమణ నిజమేనని ప్రకటించారట.  


భూమి తిరిగి స్వాధీనం చేసుకోనందుకు అప్పటి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి డి శ్రీనివాస్ అధికారులపై మండిపడ్డారట కూడా!  


వీటన్నిటికీ దోహదం చేసిన అయ్యేయస్, ఐపీయస్ అధికారులెవరో, రాజకీయ నాయకులెవరో, పారిశ్రామికవేత్తలెవరో, ఈ డీజీపీకి ఆయనమీద అంతభక్తి వుండడమెందుకో, దాన్ని ఆయన అలా సిగ్గువిడివి ప్రదర్శించడమెందుకో--యెవరైనా అడిగారా!  


యెన్ని హేతువాద సంఘాలైనా, ఓపీడీఆర్లైనా, కమ్యూనిష్టులైనా--బుద్ధున్నవాళ్ళెవరైనా--ఈ మూర్ఖుల్నీ, వాళ్ళ మూర్ఖత్వాన్నీ పొగొట్టగలరని ఆశించగలమా?

Saturday, October 3, 2009

చతుష్షష్ఠి లో.......


భావ వ్యక్తీకరణ కళ


మనిషికే ప్రత్యేకం--మాటలద్వారా, వ్రాతలద్వారా భావ వ్యక్తీకరణ చెయ్యడం!  


వ్యక్తీకరణ సరే--మరి అది యెదుటి వారికి సరిగ్గా అర్థం అవుతుందని హామీ యెక్కడుంది?  


సామాన్యం గా అది వినేవాళ్ళ, చదివే వాళ్ళ 'మానసిక స్థితి' (మూడ్) మీద ఆధారపడి వుంటుంది!  


అలా యెదుటివారికి సరిగ్గా అర్థం అయ్యేలా (మనం యే వుద్దేశ్యంతో మాట్లాడామో అది) చెప్పటాన్ని ఇంగ్లీషులో 'ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్' అంటారు.  


నిత్యమూ ప్రజానీకం తో సంపర్కం కలిగి వుండే వుద్యోగాల్లో వున్నవాళ్ళకి ఆయా సంస్థలు వీలైనంత తరచుగా శిక్షణ యేర్పాటు చేస్తాయి. అలాంటి శిక్షణ తరగతుల్లో, కొంతమంది నిపుణులు వచ్చి వీళ్ళకి వుపన్యాసాలిచ్చి, వాళ్ళు సరైన దృక్పథం కలిగి వుండేలా ప్రయత్నిస్తారు.  


నిజంగా వాళ్ళు చెప్పేవన్నీ సామాన్యం గా ప్రతీరోజు మనం చూసేవే, వినేవే--కానీ వాటిని కొత్తకోణంలో ఆవిష్కరిస్తారు--దాంతో సరైన ఫలితాలు సాధిస్తారు!  


అలాంటి వొకాయన చెప్పిన ఈ కథ--మీకోసం!  


కురుక్షేత్ర యుధ్ధం లో దుర్యోధనుడు కూడా మరణించాక, యుధ్ధభూమిలో స్త్రీల ఆర్తనాదాలు విని అశ్వథ్థామ 'నేను అపాండవం చేస్తాను' అని ప్రతిఙ్ఞ పట్టి, ఓ పొడవాటి కరవాలాన్ని చేబూని, రౌద్రంగా బయలుదేరాడట!  


ఈ లోగా, శ్రీ కృష్ణుడు పాండవుల్ని భూమిలో వాళ్ళకి సరిపడా గొయ్యి తవ్వించి, దాన్ని రాతి పలకతో పూడ్చే యేర్పాటు చేసి, దూర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి, 'మహర్షీ! పాండవులకి మీ సాయం కావాలి' అని అర్థించాడట.  


కృష్ణుడి ఠస్సాలు వూహించిన దూర్వాసుడు, 'నువ్వేమి చెప్పినా చేస్తాను కానీ--అబధ్ధం మాత్రం చెప్పను' అన్నాడట.  


దానికి కృష్ణుడు 'యెంతమాట! మీరు నిజమే--నిజం మాత్రమే చెప్పండి చాలు!' అని చెప్పి, ఆయన్ని తీసుకొచ్చి, పాండవులందర్నీ గోతిలో కూర్చోపెట్టి, రాతి పలక మూసేసి, దానిమీద దూర్వాసుణ్ణి కూర్చోపెట్టాడట.  


అంతలోనే రానే వచ్చాడు అశ్వథ్థామ! వచ్చి, 'మహర్షీ! పాండవుల జాడయేమైనా తెలుసునా?' అని ప్రశ్నించాడట!  


దానికి మహర్షి సహజ లక్షణంగా 'పాండవులా! నా ముడ్డి క్రిందున్నారు! చూసుకో!' అన్నాడట!  


పాపం అశ్వథ్థామ, ఇంకా యేమడిగితే ఆయనకి కోపం యెక్కువై యేమి శపిస్తాడో అని భయపడి, వెనుతిరిగి వెళ్ళిపోయాడట!  


ఇలా అడిగేవాడిబట్టీ, చెప్పేవాడి బట్టీ, వాళ్ళ 'మూడ్స్' బట్టీ, నిజాలు అబధ్ధాలుగా, అబధ్ధాలు నిజాలుగా అర్థం అవ్వచ్చు! అదీ 'భావ వ్యక్తీకరణ కళ' అంటే!  


ముఖ్యంగా బ్లాగులు వ్రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ ఇది ముఖ్యం అనుకుంటాను నేను!  


మీరేమంటారు?



Monday, September 14, 2009

హేతువాదం.....


హేతువాదులు--16


క్రియలూ, యోగాలూ : --2  


పాణిని అనేవాడు సంస్కృత వ్యాకరణం వ్రాశాడు--దానికి చక్కని భాష్యం వ్రాశాడు పతంజలి--ఇది ప్రజల వాక్శుద్ధి కోసం.  


రోగాలకి చికిత్సల గురించి వ్రాశాడు--చరకాచార్యుడు తన చరక సం హితలో--ఇది ప్రజల ఆయుష్షు పెంచడానికి.  


శరీరం, మనస్సూ శుభ్రంగా వుంచుకోడానికి--యోగ శాస్త్ర భాష్యం వ్రాశాడు పతంజలి.  


చరకుడూ, పతంజలీ ఒకడే అని చాలామందికి తెలియదు!  


ఇక ప్రస్తుతం లో అనేక యోగా లూ, బోళ్ళుమంది యోగా 'గురూ' లూ--త్రికోణ యోగా, చతురస్ర యోగా, పంచముఖ యోగా, అష్టదళ యోగా, పిరమిడ్ యోగా--ఇలా రకరకాల షేపుల్లో అనేక యోగాలు! పాతకాలపు 'కుండలినీ యోగా' లాంటివి యెలాగూ వుండనే వున్నాయి.  


మూలాధార చక్రం నించీ, అనాహత వగైరా చక్రాలద్వారా నిద్రలేపిన కుండలినీ శక్తిని సహస్రారం దాకా చేర్చి, (కపాల) మోక్షం చెందినవాళ్ళెవరైనా వున్నారా?  


ఈ కుండలినీ యోగానికీ, గాయత్రి కీ ముడి పెట్టి, మంగేష్ లాంటివాళ్ళు యేమైనా సాధించారా?  


ఇక ధ్యానం, జపం, తపం ఇలాంటివి కూడా వున్నాయి.  


'ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస' అని చక్కగా నిర్వచించాడో మహానుభావుడు. నిజం. (దీన్నే పూర్వం ప్రాణాయామం అనేవారనుకుంటా!) నిపుణులే చెప్పాలి.  


వీళ్ళు చెప్పేది 'పూర్తిగా శ్వాశ తీసుకొని, కుంభించగలిగినంతసేపు బిగబట్టి, తీసుకోడానికి పట్టిన సమయానికి రెట్టింపు సమయం లో తిరిగి బయటికి వదలాలి' అని. ఇది కేవలం శ్వాసని క్రమబధ్ధీకరించడానికే! మన బుర్రలో తిరుగుతున్న ఆలోచనలని బట్టి శ్వాస క్రియ 'ఇర్రెగ్యులర్' గా వుంటుంది. నిద్రపోవడానికి ముందు ఇలా చేస్తే, శ్వాస క్రమబధ్ధీకరింపడి, చక్కగా నిద్ర పడుతుంది.  


ఆలా అని పిల్లికీ, బిచ్చానికీ ఒకే మంత్రం కాదు.  


ఇప్పుడు 'ఫిజియో థెరపిస్టు 'లు 'ఒకేసారి వేగంగా వూపిరి తీసుకోండి--తీసుకోడానికి పట్టిన సమయం లో సగం సమయం లోనే, నోటి ద్వారా వదలండి' అని చెపుతారు--ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళకి!  


అలా చెయ్యడంవల్ల, ఛాతీలో (వూపిరితిత్తుల్లో) ఇన్ ఫెక్షన్లు రావు! మరి ఇదేమి యోగం? ధ్యానం? ఈ 


యోగాలూ, ధ్యానాలూ--వీటి ప్రచారం--  


ఇవన్నీ యెందుకు?

Sunday, September 13, 2009

హేతువాదం.....


హేతువాదులు--15


క్రియలూ, యోగాలూ : --  


శరీరాన్ని మనసునీ మలినాలనించి దూరం గా వుంచుకోడానికి, మన పూర్వీకులు కొన్ని క్రియలూ, యోగాలూ ప్రవేశపెట్టారు.  


క్రియల్లో ముఖ్యమైనవై--జలనేతి, వస్త్రధౌతి. (ఇంకా కొన్ని క్రియలు వున్నాయేమో--నాకు గుర్తు లేదు)  


జలనేతితో మన ముఖ భాగం--నాసిక, శ్వాశనాళం పుర్రెలో ఖాళీగా గాలి నిండి వుండే భాగాలూ (సైనసెస్ వంటివి) శుభ్రం గా వుండడానికి ప్రవేశపెట్టబడింది.  


ఈ క్రియలో, ఒక కొమ్ముచెంబులో నీరు నింపి, వూపిరి బిగబట్టి, ఒక నాసికా రంధ్రం లో ఆ నీటిని పోస్తూ, వూపిరి వదులుతూ రెండో నాసికా రంధ్రం లోంచి బయటికి వెళ్ళేలా చేస్తారు.  


ఇది బాగా సాధన చెయ్యాలి--నీరు పూర్తిగా బయటికిపోకుండా ఒక్కచిన్న చుక్క మిగిలినా, మనం వూపిరి తీసినప్పుడు నేరుగా శ్వాసనాళానికి అడ్డుపడే, వూపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదాలు వున్నాయి.  


ఇప్పుడు ఓ యాభైమందో, వందమందో ఒక మీటింగుకో, శిక్షణకో, సెమినార్లకో వచ్చేచోట, నిర్వాహకుల్ని పట్టుకొని, ఒక వుపన్యాసం యేర్పాటు చేయించుకొని, పదిరూపాయలు కూడా చెయ్యని ప్లాస్టిక్ కొమ్ము చెంబుల్ని పాతికా, ముఫ్ఫై రూపాయలకి అమ్ముకుంటున్నారు కొంతమంది యోగా 'గురూ' లు. (పాపం కొంతమంది అన్నట్టు భుక్తి కోసమే!)  


ఇక వస్త్ర ధౌతి అంటే, ఓ రెండంగుళాలు వెడల్పు, పదో పదిహేనో అడుగుల పొడవూ వున్న శుభ్రమైన గుడ్డ పీలికని, ఒక చివర నోటిలో పెట్టుకొని, క్రమంగా మింగుతూ, మొదటి కొస కడుపులోకి వెళ్ళేవరకూ, అక్కడ మూటలా అయ్యేవరకూ మింగుతారు. రెండో చివర నోటి చివర జాగ్రత్తగా పట్టుకొని, నీళ్ళు తాగి, కడుపుని క్రమపధ్ధతిలో కదపడం ద్వారా, జీర్ణాశయాన్నీ, వీలైతే ప్రేవులనీ శుభ్రం చేస్తారు--తరవాత జాగ్రత్తగా ఆ గుడ్డ పీలికని బయటికి లాగేసి, పడేస్తారు!  


'వీటివల్ల నాకు మంచి జరిగింది ' అని ఇంతవరకూ చెప్పినవాళ్ళు లేరు. పోనీ యెవరైనా వీటివల్ల నాకు యెప్పుడూ జలుబు చెయ్యలేదు, నాకు కడుపు నెప్పి రాలేదు అన్నారా అంటే అదీ లేదు!  


నాకు తెలిసిన ఒకాయన స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ ఈ క్రియల్ని ప్రదర్శిస్తూ వుండేవాడు--ఓ పెద్దాయనెవరో వీటి గురించి వుపన్యాసం దంచాక!  


చాలా రిథమిక్ గా రకరకాల ఆకారాల్లో కడుపుని కదిపేవాడు--సంగీతానికి అనుగుణం గా. ఆహా! మనం కూడా రేపణ్ణించి అలా నేర్చుకొంటే బాగుండును అనిపించేది చూసేవాళ్ళకి!  


ఆయన పాపం యేదో 'ఉదర సంబంధ వ్యాధి ' (అల్సరో, కేన్సరో) తో మరణించాడన్నారు--తరవాత కొన్నేళ్ళకి.  


ఇవన్నీ యెందుకు?



Wednesday, September 9, 2009

హేతువాదం......


హేతువాదులు--14


ఆచారాలు, సాంప్రదాయాలు : --  


యెప్పటినుంచో ప్రాచీన వైష్ణవాలయాల్లో దేవుడికి అష్టోత్తర పూజా, సహస్ర నామార్చనా జరిపించడం ఆచారం.  


మొన్న వినాయక చవితి నాడు, కాణిపాకం వినాయకాలయం లో జరుగుతున్న పూజని తి తి దే భక్తి చానెల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేశారు. 


మంత్రాలు చదువుతున్నవాళ్ళు చదువుతూండగా, పాపం పూజ జరుపుతున్న బ్రాహ్మడు అష్ట కష్టాలూ పడ్డాడు!  


మొదట కూర్చొని, పసుపు వినాయకునికి పూజ చేశాడు. బాగానే వుంది. ఇక పెద్ద విగ్రహం ముందు నించొని, వ్రతకల్పం ప్రకారం పూజ మొదలు పెట్టాడు. 


షోడశోపచార పూజా, సర్వాంగార్చనా, గరిక పూజా--ఇలా సుమారు ఓ గంట గడిచింది.  


తరవాత, మంత్రాలు చదివే ఆయన 'యేక వింశతి పూజా' అని, ఓ లావాటి పెద్ద సైజు పుస్తకాన్ని--కొత్తగా ప్రింట్ అయినట్టు తళతళా మెరుస్తోంది--తెరిచి, నామాలు చదవడం మొదలు పెట్టాడు! వాటిలో చాలా మటుకు పది పదిహేను పదాల సమాసాలే!  


యేక వింశతి అంటే, 21 అనుకుంటా--పంచ వింశతి అంటే 25 కదా! మరి ఆ నామాలు 21 వందలో, 21 వేలో తెలియదు--యెంతకీ తరగవు! అసలు ఆయన ప్రతీ నామానికీ ముందు ఒకటీ, వెనుక ఒకటీ 'ఓం' లు చేర్చి చదువుతున్నాడు--'ఓం వక్రతుండాయ నమహ్ ఓం' 'ఓం శూర్పకర్ణాయ నమహ్ ఓం'--ఇలా!  


అన్నినామాలూ అవుతుండగా, పూజ చేసే బ్రాహ్మడు పాపం అలాగే నిలబడి, తనకి పక్కనించి అందించేవాళ్ళు ఇస్తున్న పుష్పాలూ, పత్రీ, గరికా, అన్నీ ఒక్కొక్కటీ అవగొడుతూ చాలా కష్టపడ్డాడు.  


ఈ లోపల అక్కడి మహిళా యెమ్మెల్యేనో, మంత్రో భర్తా, పరివారం సహితంగా ప్రవేశించేశారు! మంత్రాలు చదువుతున్నాయన ఒక్కడే కూర్చుని చదువుతున్నాడు--మైక్ అంతయెత్తే వుంది కాబట్టి కావచ్చు! మిగిలినవాళ్ళు యధేచ్చగా విగ్రహం ముందునించీ, ఆ ప్రాంతమంతా కలయతిరుగుతూండగా, పాపం విడియో తీసేవాడు మేఘాలనీ, ధ్వజ స్థంభాన్నీ చూపించాడు!  


తరవాత మెమెంటోలూ, ప్రసాదం సంచీలూ పంచిపెట్టడం బలవంతంగా వీడియో వాడి చేత కవరు చేయించారు--వాళ్ళ తైనాతీలు!  


అంతసేపూ, ఆయన నామాలు చదువుతూనే వున్నాడు, ఈయన పూజ చేస్తూనే వున్నాడు! నాకు విసుగొచ్చి టివీ కట్టేశాను!  


ఇక కొత్తగా, లక్ష కుంకుమ పూజలూ, లక్ష గరిక పూజలూ--ఇవేమిటో! లక్ష అనేది సంఖ్యా వాచకం కదా? లక్ష పత్రి అంతే, లెఖ్ఖపెట్టి లక్ష ఆకుల్ని పూజ చెయ్యచ్చు, లక్ష వత్తులంటే, లెఖ్ఖపెట్టి లక్ష వత్తుల్నీ వెలిగించవచ్చు--మరి లక్ష 'కుంకుమనీ, లక్ష 'గరికనీ యెలా లెఖ్ఖిస్తారు?  


పూర్వం ఆడవాళ్ళలో పెద్దవాళ్ళు స్వయంగా తమ తీరిక సమయాల్లో 'లక్ష వత్తులూ' చేసుకొని, లక్ష సంఖ్య పూర్తి అవగానే, నోము నోచుకొనేవారు! (ఇప్పుడు ఫలానారోజు లక్షవత్తుల నోము చేసుకుంటున్నాం--మీరందరూ వీలైనన్ని వొత్తులు చేసి తీసుకురండి--అంటున్నారు!)  


నిన్ననే ఒకాయన వచ్చేనెలలో ఫలానా తేదీల మధ్య 'శతకోటి మహలక్ష్మీ యాగం' చేస్తాం--అందరూ పాల్గొని, తిలకించి, తరించాలన్నాడు!  


మరి ఇదేమి యాగమో? శతకోటి దేనికి సూచకమో?  


ఇవన్నీ యెందుకు?



Tuesday, September 8, 2009

హేతువాదం…..


హేతువాదులు--13


ప్రదక్షిణలు : --  


ఈనాడు దినపత్రికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారన్నట్టు, దేవుడికి నైవేద్యం తరవాత, చివరగా ఆచరించేవి--ప్రదక్షిణం, నమస్కారం.  


మరి గుళ్ళోకి ప్రవేశించగానే, ధ్వజ స్థంభం దగ్గర మొదలుపెట్టి, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, ఒక్కో ప్రదక్షిణా అవగానే, తల ధ్వజస్థంభ పీఠానికి ఆనించి, అప్పుడు మంటపం లో ప్రవేశించి, గంట మోగించి, అప్పుడు దేవుడి దర్శనం చేసుకొని, అర్చించడం యెవరు ప్రవేశపెట్టారు?  


సాధారణం గా గుడిని నలుచదరం గా నిర్మించి, పైకప్పుని నలుచదరపు శంఖాకారం లో (శంకువు) నిర్మించి, గుడి మధ్యలో మూల విరాట్ ని ప్రతిష్ఠిస్తారు. ఒకవేళ 'స్వయంభువే' అయితే, మూలవిరాట్ చుట్టూ సమాన దూరం లో నలుచదరం గా గోడలు కట్టి, పైన కప్పుని శంఖాకారం లో కడతారు.  


శివాలయాల్లో తప్ప, వైష్ణవాలయాల్లో గర్భగుడి ప్రవేశం భక్తులకి నిషిధ్ధం. అంతేకాదు స్వామివారి ముందు ప్రమిదల్లో ఆముదం దీపాలుతప్ప మిగతా వెలుగులు నిషిధ్ధం.  


అయినా, గుడి ప్రవేశద్వారం కాక మిగిలిన మూడుపక్కలా చిన్న చిన్న రంధ్రాలు పెట్టేవారు--యెంతో కొంత వెలుగు స్వామివారిని చేరాలని--అంతేకానీ ప్రదక్షిణలు చేసేవారు తొంగిచూడడానికి కాదు!  


ఇక శివాలయాల్లో దర్శనమో అభిషేకమో అయ్యాక, బయటికి వస్తూ, నంది కొమ్ముల మధ్యనించి లింగదర్శనం చేస్తే పునర్జన్మ వుండదు అని ఓ నమ్మకం! (శ్రీశైలం లో క్రింద వున్న నంది కొమ్ముల మధ్య నించి శిఖరం చూడగలిగితే, పునర్జన్మ వుండదు--అంటారు.)  


మరి, ప్రదక్షిణాలు పూర్తి చెయ్యగానే, నంది ముఖమ్మీద కుంకం, పృష్ట భాగం మీద అరటిపళ్ళూ మెత్తేసి, స్థూల శరీరాలతో కూర్చొనో, పడుకొనో కొమ్ముల మధ్యనించి లింగాన్ని దర్శించడానికి అపసోపాలు పడడం యెవరు నేర్పించారు?  


మరిప్పుడు, ఆంజనేయస్వామి గుళ్ళోకి గానీ, సాయిబాబా గుళ్ళోకిగానీ ప్రవేశించగానే, ఒకటి నించి నూట యెనిమిది అంకెలు ముద్రించి వున్న చీటీ చేతికిచ్చి, గుడిలోపల విగ్రహం చుట్టు ఒక్కో ప్రదక్షిణా అయిపోగానే, ఒక్కొక్క అంకే కొట్టేసుకొని, మరిచిపోకుండా 108 ప్రదక్షిణాలు పూర్తిచేస్తే, ఆంజనేయస్వామి గుడి అయితే వెంటనే పెళ్ళి అవుతుందనీ, సాయిబాబా అయితే, మంచి మొగుడొస్తాడనీ, ఆడపిల్లలకి చెపుతున్నవారెవరు?  


ఇవన్నీ యెందుకు?



Sunday, September 6, 2009

హేతువాదం…..


హేతువాదులు-12


మంచిరోజులు : --  


ఈనాడు వార్తా పత్రిక 06-09-2009 నాలుగో పేజీ మధ్యలో, సంపాదకీయం పక్కన 'చైతన్య ' 'ప్రతిరోజూ ప్రశస్తమే' శీర్షిక క్రింద వ్రాసిన బిట్ చదవండి.  


ఇక వేరే చెప్పక్కర్లేదు నేను!

Friday, September 4, 2009

హేతువాదం…..


హేతువాదులు-11


కళ్యాణాలు : --  


కళ్యాణ చక్రవర్తి అని పేరున్న శ్రీ వేఙ్కటేశ్వరుడు--నిత్య పెళ్ళికొడుకు--ప్రతిరోజూ కళ్యాణాలు జరుగుతూనే వుంటాయి--కళ్యాణం జరిపించినవారికి మంచి జరుగుతుందని ఓ నమ్మకం!  


ఇక శ్రీ రాముడికి ప్రతీ శ్రీరామనవమకీ కళ్యాణం జరిపిస్తారు. అన్నవరం సత్యదేవుడికీ, సిం హాద్రి అప్పన్నకీ, ఇలా వైష్ణవాలయాలన్నింటిలో శ్రీవారికి ఆయా ముహూర్తాలకి కళ్యాణాలు జరుగుతూంటాయి.  


ఇక ఇప్పుడు శివుడికీ, గణపతికీ, ఆంజనేయుడికీ, గరుత్మంతుడికీ కూడా కళ్యాణాలు జరిపిస్తున్నారనుకోండి.  


మా చిన్నప్పటి నించీ, భద్రాద్రిలో శ్రీరాముడికి ప్రతీ యేటా జరిగే కళ్యాణాన్ని--అప్పట్లో టీవీలు లేవుకాబట్టి రేడియో లో ప్రసారమయ్యే, మహామహులు చేసే ప్రత్యక్ష వ్యాఖ్యానాలని వినడం, టీవీలు వచ్చాక, చూడడం యే సంవత్సరం మానలేదు!  


సీతమ్మవారికి స్వామి మంగళసూత్ర ధారణ చేసే సమయం లో మామూలుగానే 'మాంగల్యం తంతునానేన, మమ జీవన హేతునాం, కంఠే బధ్నామి, సుభగే--త్వంజీవ శరదాం శతం!' అనే చదివేవారు!  


తరవాత్తరవాత '..............శరదశ్శతం!' అని మారిపోయింది--దానికీ దీనికీ తేడా వుందో లేదో నాకు తెలియదు.  


ఇంక యెప్పుడు ప్రవేశపెట్టారో '........లోక కళ్యాణ హేతవే' అని మార్చారు--మమ జీవన హేతునాం స్థానం లో!  


ఇంకా తరవాత, నేను చూసిన ఆఖరి ప్రత్యక్ష ప్రసారం లో, '.........త్రైలోక్యం మంగళం కురు ' అని మార్చారు--త్వంజీవ శరదాం శతం కు బదులుగా! అలా చదివి, పక్కనున్న అర్చక స్వామి వంక చూసేసరికి, ఆయనకూడా, 'అవును--త్రైలోక్యం మంగళం కురు '. అన్నాడు.  


ఇక టీవీలు వచ్చాక, తలంబ్రాలు అయ్యాక, ఇద్దరు అర్చక స్వాములు ఓ కొబ్బరి కాయ తీసుకొని, వేదిక మీద యెదురుబదురుగా కూర్చొని, ఒకళ్ళవేపు ఒకళ్ళు దాన్ని దొర్లిస్తూండడం, దానికి వ్యాఖ్యాతలు 'స్వామివారూ, అమ్మవారూ బంతులాట ఆడుతున్నారు--తిలకించండి ' అని చెపుతున్నారు!  


గత కొన్నేళ్ళుగా ఇవన్నీ చూడడం మానేశాను! (వాటిని ఆపలేం కదా మరి?)  


ఇవన్నీ యెందుకు? జనం లో మూర్ఖత్వాన్ని పెంచడానికా?  


మా చిన్నప్పుడు, కాస్త కలిగినవాళ్ళ ఇళ్ళల్లో పిల్లల పుట్టిన రోజులకి కొత్తబట్టలు వేసుకొని, పెద్దవాళ్ళకి నమస్కరించి, ఫోటో స్టూడియోలకి పరిగెత్తేవారు!  


ఇప్పుడు మన సినిమాలు--హీరోయిన్ హీరోతో ప్రేమలో పడడానికి వీలుగా--'పుట్టినరోజు కదా, అలా గుడికి వెళ్ళిరామ్మా' అని ఆమె తల్లి డైలాగు! ఇది అందరికీ నేర్పించింది--పుట్టినరోజు గుడికి వెళ్ళడం!  


గ్రహణాలు వచ్చినప్పుడు, ఆలయాలని మూసెయ్యడం--హేతువాద సంఘాలవాళ్ళు--దేవాలయాలన్నీ తెరిచి వుంచండి, యేమీ కాదు అనడం!  


అసలు గ్రహణాలు 'రాహు కేతువుల ' వల్ల యేర్పడతాయని నమ్మితే, వాటిని 'అమృతం తాగుతున్న ' రాక్షసుణ్ణి మెడ నరికి గ్రహాలుగా యేర్పాటు చేసింది శ్రీ మహావిష్ణువేకదా? ఇక వాడికి వాళ్ళంటే భయం యెందుకు?  


సూర్య కిరణాలు నేరుగా మూలబేరం దగ్గరకి చేరే అవకాశం వున్న ఆలయాలని ఆ సమయం లో మూసేసి, గ్రహణం విడిచాక--సంప్రోక్షణ చేసి, మళ్ళీ దర్శనానికి అనుమతిస్తారు! యెందుకంటే, గ్రహణ సమయం లో కొన్ని జీవ, రసాయన క్రియల్లో మార్పులు చోటు చేసుకుంటాయి--వాటివల్ల భక్తులకి చెడు జరగకుండా ఈ ఆచారం ప్రవేశపెట్టారు!  


ఇక గ్రహణం విడవగానే, కొబ్బరికాయలు పట్టుకెళ్ళి--లైన్లో మూసివున్న గుడి తలుపులముందు గబగబా పగులకొట్టడం కూడా యెక్కువైపోయింది ఈ మధ్య--ఇదెవరు ప్రవేశపెట్టారో!  


ఇక గుడిముందునించి సైకిలుమీదో, మోటర్ సైకిలుమీదో వెళుతూ, చేతిని గుండెలమీదో, పొట్టమీదో వేసుకొని, గుడివంకే చూస్తూ--ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది, రోడ్డుమీదే చెప్పులు విడిచేసి, అదేదో సినిమాలో బ్రహ్మానందం లా చప్పట్లు చరుస్తూ, అరచేతులు ముద్దులు పెట్టుకుంటూ మళ్ళీ వాటిని కళ్ళకి తాకించుకుంటూ, రకరకాల భంగిమల్లో భక్తిని అనుభవిస్తున్నారు!  


ఒక్కసారి ఆలోచించండి--ఇవన్నీ అవసరమా? యెందుకు?



Monday, August 31, 2009

హేతువాదులు-10


వూరేగింపులు


దేవుళ్ళనీ, రాజులనీ, వధూవరులనీ పల్లకీ లో వూరేగించడం యెప్పటినించో వస్తున్న ఆనవాయితీ! కొంచెం పెద్దింటి మహిళల్ని మేనాల్లో అత్తవారిళ్ళకీ, పుట్టిళ్ళకీ పంపించేవారు! (వధూవరులని అలా వూరేగించడం ఇప్పుడు అనాగరికం! రాజులెలాగా లేరు! మేనాలు ఇప్పుడు అవసరం లేదు!)  


ఇవన్నీ, ఒకేఒక వెదురు బొంగు ఆధారంగా, ముందూ వెనుకా మోసేవాళ్ళ భుజాల మీద వుండేలా, మధ్య భాగం లో దేవుడైనా, రాజైనా, వధూ వరులైనా, మహిళలైన కూర్చోవడానికి అనువుగా పీఠాలూ, పైకప్పులూ, మేనాలకైతే తలుపులూ నిర్మించేవారు.  


ఆ బొంగులని ప్రత్యేకంగా 'కణాది బొంగు ' అనే జాతి వెదురు కర్రలతో తయారు చేశేవారు. (అలాంటి బొంగులతోనే ఆ రోజుల్లో, సోలలూ, అరసోలలూ, తవ్వలూ తయారుచేసేవారు.)  


మా చిన్నప్పుడు మా మాతామహులవారి వూరు వెళ్ళినప్పుడు ఓ వెదురు పొదలో పల్లకీ బొంగు ఆకారంలో వున్న ఒక లావుపాటి బొంగుని చూసి, 'అయ్యబాబోయ్! అంతలావు బొంగుని--ఆ ఆకారం వచ్చేలాగ యెలావంచారో?' అని ఆశ్చర్యపడిన మాకు, మా నాన్నగారు చెప్పారు--'ఆ వెదురు లేతగా, సన్నగా వుండగానే, అది పల్లకీకి పనికొస్తుంది అనుకున్నప్పుడు--దాన్నీ ఆ ఆకారం లో వంచి, తీగలతో కట్టేస్తారు--అదింక ఆ ఆకారం లోనే పెరుగుతుంది--పెద్దదయ్యాక దాన్ని నరికి, పల్లకీలు తయారు చేస్తారు.' అని.  


పల్లకీలో దేవుణ్ణి (వుత్సవ మూర్తులని) చక్కగా ఆసీనుణ్ణిచేసి, పడిపోకుండా చక్కగా బందోబస్తు చేసి, గుడిలోంచి బయటికి అర్చక స్వాములే స్వయంగా మోసుకొంటూ వస్తారు. గుడి గుమ్మం దాటేముందు--వాళ్ళ భుజం మీద వున్న పల్లకీ బొంగుని (దండెని) గుండ్రంగా ఇటూ అటూ తిప్పి, దేవుడు 'పడిపోవడంలేదు ' అని నిర్ధారణ చేసుకొని, బయటికి తెస్తారు (వూరిలోకి వెళ్ళాక విగ్రహాలు పడిపోతే, వూరికే అరిష్టం అని నమ్మేవారు!)--అక్కడనించి, చాకలివాళ్ళకి అప్పచెపుతారు పల్లకీ మోతని!  


అదీ ఈ అచారానికి మూలం.  


మరి ఈ రోజు, ప్రతీ నాలుగడుగులకీ ఆ దండెల్ని పైకీ కిందకీ యెగరెయ్యడం లో యేమైనా అర్థం వుందా--వేలం వెర్రి కాకపోతే!  


కాదంటారా?





Friday, August 28, 2009

హేతువాదం…..


హేతువాదులు-9
ఇక బ్రహ్మోత్సవాలు :—  

పాపం ఆ బ్రహ్మ యే ముహూర్తంలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించాడోగానీ, ఆయనక్కూడా ‘రిమ్మతెగులు’ పుట్టేలా ఆయన చేత అనేక గుళ్ళలో ఉత్సవాలు జరిపించేస్తున్నారు!  

రేపు సెప్టెంబర్ లో మొదలౌతాయి శ్రీ వారి ‘వార్షిక’ బ్రహ్మోత్సవాలు. మొన్ననే మొదలయ్యాయి ‘కాణిపాక’ వినాయక బ్రహ్మోత్సవాలు! శ్రీ కాళ హస్తీస్వరుడికో యెవరికో మొన్న ముగిశాయి.  

ఇక మొన్ననే మా వూరి దగ్గరలో వున్న ‘తలుపులమ్మ’కి పూర్తయ్యాయి. రేపెప్పుడో మావూరి ‘పుంతలో ముసలమ్మ’కి ప్రారంభమౌతాయి! తరవాత ఇంకో ‘రాట్నాలమ్మకి’ ఇంకో ‘ఆంజనేయుడికి’ ఇలా!  

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో, రోజూ రెండుపూటలా స్వామి తన వాహనాలపై శ్రీమాడ వీధుల్లో భక్తుల కనులపండువుగా వూరేగుతారు. బాగానే వుంది.  

మరి నాకర్థం కాని విషయం—ఓ నాలుగడుగులు ముందుకి స్వామివారిని తీసుకెళ్ళగానే, వాహనాన్నీ, స్వామినీ, పక్కన అర్చకుల్నీ ‘దండెల’పై మోస్తున్నవారు, పైకీ కిందకీ యెగరేస్తూ వుంటారు! ఇది యెందుకో యెవరికైనా తెలుసా? (తెలిస్తే చెప్పండి—లేకపోతే నన్నడగండి.)  

అలా యెగరేస్తూంటేనే, మొన్నోసారి ఓ ‘దండె’ దూలం విరిగిపోయి, స్వామితో సహా భూపతనం కావలసిన పరిస్థితి వచ్చింది!  

ఇక, ఇదివరకు ఈ ‘స్నపన తిరుమంజనాలూ’ అవీ జరిగేవో లేదో తెలియదుగానీ, ఇప్పుడు టీవీలకోసం సుశిక్షిత సైనికుల్లా అర్చకస్వాముల శిష్యులూ, ప్రశిష్యులూ కాడ చెంబుల్ని పంచామృతాల్లో ముంచడం, అవి స్వాములకి అందించడం ఓ రెండు మూడు గంటల కాలక్షేపం!


తరవాత ఉత్సవ మూర్తుల్ని తుడవడం, అలంకరించడం—ఇలాంటి వాటికో రెండు గంటలు—ఇలా మరో కాలక్షేపం! (మరి ఆ గంగాళాలకొద్దీ పంచామృతాలు యే డ్రెయినేజీల్లో కలుస్తున్నాయో!)  

అగ్నిహోత్రానికి ఓ రెండో రెండున్నరో అడుగుల చదరం లో ఇటుకలతో కుండం నిర్మించి, లేనిపోని తిప్పలు పడడం! 

కుండానికి నాలుగుపక్కలా మంత్రాలతో దర్భల్ని వుంచుతారు. తరువాత, ‘…………అనుమతేన మన్యస్వాహ్ సరస్వతేన మన్యస్వాహ్……………..’ ఇలా కుడిచేతి మూడువేళ్ళతో వాటిపై ఓ దిక్కునించి ఇంకోదిక్కుకి నీళ్ళు జల్లుతారు.  

మరి కర్త చేతులు అంతపొడవు వుండవుగా! అందుకని కుడిపక్క మంత్రం చెప్పే ఆయనకీ, యెడమపక్క ఇంకో శిష్యుడికీ, యెదురుగా టీవీ కెమేరా ఆపరేటర్లకీ ఇచ్చి, వాళ్ళచేత పెట్టిస్తున్నారు దర్భలు! (నీళ్ళు జల్లడం నాకు కనిపించలేదు—కెమేరా స్థంభాలమీదకీ, సీలింగుమీదకీ తిరిగి పోవడం తో!)  

ఇక మంత్రం చెప్పే ఆయన చెప్పుకుంటూ పోతే, కర్త పెదాలు కదుపుతూ, గబగబా యాక్షన్ చేశేస్తూ వుంటాడు! (వీళ్ళముందూ యే డబ్బింగు ఆర్టిస్టులూ, ఉత్తరాది హీరోయిన్లూ దిగదుడుపే!)  

యెందుకంటారు ఇవన్నీ?  

ఈ భక్తి చానెల్ని మూసేస్తే యెంతబాగుండును! శ్రీవారి పవిత్రత కాస్త నిలబడును—అనిపిస్తూంటుంది నాకు.  

ఆలోచించండి!





Sunday, August 16, 2009

హేతువాదం…..

హేతువాదులు-8
మా కాలేజ్ చదువులయిపోయాక నిరుద్యోగ పర్వం రోజుల్లో, సాయంత్రం కాలక్షేపానికి మా ఫ్రెండ్ సైకిలు షాపు దగ్గర కాసేపు కూర్చొనేవాళ్ళం.
అప్పట్లో యెవరైనా కొత్తసైకిలు కొనుక్కుంటే, సైకిలు బిగించిన తరవాత, దానికి తీగతో నిమ్మకాయ హేండిలుబారుకి బిగించి, సిందూరం మెత్తి, మడ్ గార్డులమీద కూడా సిందూరం చల్లి, ‘ఇలా తూర్పుగా తొక్కుకు వెళ్ళండి. అక్కడున్న కనక దుర్గమ్మ గుళ్ళో ఓ కొబ్బరికాయ కొట్టండి! అంతా శుభం జరుగుతుంది.’ అనేవాడు ఆ షాపు వోనరు!
ఓసారి ఈ వ్యవహారం యేమిటో చూద్దామని మేము కూడా ఓ కొత్త సైకిలాయన తో గుడి దాకా వెళ్ళాము.
ఆయన ‘కొత్త సైకిలుకి పూజ జరిపించండి’ అంటే, ఆ పూజారి గారు నిర్మొహమాటం గా ‘సైకిలు పూజలూ, బండి పూజలూ అని ప్రత్యేకం గా వుండవు—మీ పేరూ గోత్రం చెపితే, మీ పేరున అమ్మవారికి అష్టోత్తరం చేస్తాను!’ అన్నాడు!
మరి ఇప్పుడో—సైకిలుకీ, మోటర్ సైకిలుకీ, కారుకీ, లారీకీ—కాకుండా ఆయుధ పూజల పేరుతో బీరువాలకీ, ఇనప్పెట్టెలకీ కత్తులకీ చాకులకీ, పెన్నులకీ—ఇలా ‘ప్రత్యేక’ విశేష పూజలు చేసేస్తున్నారు!
ఇక ప్రతీ నేతా, వీ ఐ పీ ప్రతీ గుడిలోనూ, ఆఖరికి శ్రీ రామనవమి, వినాయక చవితి పందిళ్ళలో కూడా—ప్రత్యేక పూజలూ, విశేష పూజలూ చేసేసే వాళ్ళే—మన మీడియా వాటిని ప్రముఖ వార్తల్లా ప్రకటించడమే!
ఆఖరికి గద్దర్ కూడా ఆ మధ్య శ్రీవారికి బ్రేక్ దర్శనం చేసుకొని, విశేష పూజలు చేసేశాడు.
(గద్దర్ ప్రత్యేకతేమిటంటే—రోడ్లమీద చొక్కా లేకుండా ఓ నల్ల కంబళీ కప్పుకొని తిరుగుతాడు—గుడికి మాత్రం చక్కగా పొడుగుచేతుల చొక్కా ధరించి వెళతాడు!)
అదో సంగతి!