Friday, December 31, 2010

కాంగీ పార్టీ

కొన్ని పచ్చి నిజాలు......కొన్ని.......లు

"కాంగ్రెస్" పార్టీ 125 యేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, "కాంగ్రెస్....భారత జాతి నిర్మాణం" పేరిట ఓ పుస్తకాన్ని మొన్నటి ప్లీనరీలో ఆవిష్కరించారట.

దాంట్లోని కొన్ని పచ్చి నిజాలూ, కొన్ని అవాకులూ చెవాకులూ ఇలా వున్నాయిట.

ప.ని.లు:

1. అత్యయిక పరిస్థితి రోజుల్లో, ఇందిరాగాంధీ వద్ద ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అపరిమిత అధికారాలు కేంద్రీకృతమయ్యాయి.

సాధారణ రాజకీయ ప్రక్రియలు, ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. పత్రికలపై నిర్బంధాలు విధించారు. న్యాయ వ్యవస్థ అధికారాలు తగ్గించారు.

2. ఆ సమయంలో సంజయ్ గాంధీ పలు ప్రభుత్వ విధానాల్ని నిర్హేతుకంగా, నిరంకుశంగా అమలు చేశారు.

ఆయన గొప్ప గుర్తింపుతో నేతగా యెదిగారు. ఆయన మద్దతుతోనే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలని తీవ్రస్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది.

ఆయన మురికివాడల తొలగింపు, వరకట్న వ్యతిరేకత, అక్షరాస్యత పెంపునకు కృషి చేశారు. కానీ నిర్హేతుక, నిరంకుశ విధానాలవల్ల వాటిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

3. రాజీవ్ గాంధీ....ప్రభుత్వంలో, పార్టీలో తన బృందాన్ని తరచూ మార్చేసేవారు, పార్టీలో సంస్థాగత సంస్కరణల విషయంలో విఫలమయ్యారు.

4. పీ వీ నరసిం హారావు, ప్రథానమంత్రి పదవిలో అయిదేళ్లు పూర్తి చేసుకున్న తొలి 'నెహ్రూ-గాంధీ కుటుంబేతర' వ్యక్తి. రాజీవ్ గాంధీ పార్టీనేతగా వున్నప్పుడు మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆర్థిక సంస్కరణల ప్రక్రియను కొనసాగించిన పీవీ ప్రభుత్వం 'విజయవంతమైంది'.  

5. భరత సహజ శత్రువైన పాకిస్థాన్ అమెరికా స్నేహంతో బలోపేతమయింది.

6. ఆర్థిక దిగ్గజంగా యెదిగిన చైనా ప్రస్తుతం వ్యూహాత్మకంగా, ఆర్థిక అంశాల్లో, భారత్ వైపు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

7. యూపీయే-2 ప్రభుత్వానికి ధరల పెరుగుదలే ప్రథాన సమస్యగా మారింది. (ఇది ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక వ్యాఖ్యట.)

ఇంక ఇవాళ్టి ముఖ్య ఆర్థిక వార్త....ఆహార ద్రవ్యోల్బణం 14.44 శాతానికి పెరిగి, పదివారాల గరిష్ట స్థాయికి చేరిందిట--మొన్న 18వ తేదీనాటికి.

ప్రథాని అధ్యక్షతన సమావేశమైన ధరలపై యేర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీపీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారట. అంతకు ముందే, ప్రణబ్ ముఖర్జీ 'కూడా' అందోళన వ్యక్తం చేశారట!

దానికి అనేక కారణాలు చెపుతున్నారు....మన "ఆశ్వయుజ, కార్తీక" లతో సహా!

అ.చె.లు:

1. (లోక్ నాయక్) జయప్రకాష్ నారాయణ్ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టలేకున్నా, ఆయన సిధ్ధాంతమైన 'సంపూర్ణ విప్లవం' అస్పష్టం. ఆయన వుద్యమం 'రాజ్యాంగ విరుధ్ధం'. అప్రజాస్వామికం.

2. వుత్తరప్రదేశ్, తదితర రాష్ ట్రాల యెన్నికల్లో యువనేత రాహుల్ గాంధీ చొరవ ప్రశంసనీయం. 

3. మన్మోహన్ సింగ్ యూపీయే ప్రభుత్వానికి 'స్థిరత్వ' ఇమేజ్ కల్పించారు.

4. సోనియా ప్రథాని పదవి తృణీకరించి 'త్యాగమయి' అయ్యారు.

5. గత యెన్నికల్లో పార్టీ 29% వోట్లతో, 206 సీట్లు సాధించి, ప్రాంతీయ పార్టీల యెదుగుదలని 'కొంతవరకు' అడ్డుకుంది.

ఇక, కాంగీల పుస్తకం పై, పాయింట్లవారీగా నా వ్యాఖ్యలు మరో టపాలో.

Friday, December 17, 2010

భారద్దేశం

సెక్యులరిజం

నిన్న వైకుంఠ యేకాదశి. మహమ్మదీయుల మొహఱ్ఱం.

మా ఇంటిదగ్గర గుడిలో అర్చనలూ, పూజలూ జరుగుతున్నాయి......ప్రక్కనే రోడ్డు పై పీర్ వూరేగింపు వెళ్లింది. ఒకళ్లకొకళ్లు 'ముబారక్'లూ, శుభాకాంక్షలూ చెప్పుకోలేదు--ఆ 'అవసరాన్ని' ఫీల్ అవలేదు యెవరూ.

అదీ అసలైన 'సెక్యులరిజం' అంటే!

వీడియోలు చూడండి.



(గుడిలో వ్యాఖ్యానం చెపుతున్నది ప్రఖ్యాత 'చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ')



(ఆకాశం మబ్బులు కమ్మి వుండడం వల్ల కొంచెం క్లియర్ గా రాలేదేమో....కొంచెం బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ పెంచుకొని చూడండి--అవసరమైతే)

Tuesday, December 7, 2010

గుడీ-గుంపా

అవేవో యాగాలు

ద్వారకా తిరుమల లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ "త్రిషోడశ కుండాత్మక మహా సుదర్శన యాగం" నిర్వహిస్తున్నారట.

3 X 16 = 48 హోమగుండాలు సిధ్ధం అయ్యాయట. అందులో 4 ప్రధాన హోమగుండాలుంటాయట.

ప్రతీరోజూ "వైఖానస శాస్త్ర సమ్మతమైన" శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సుదర్శన 'మహామంత్రి పురశ్చరణాలూ', అద్భుత శాంతి హోమాలూ, 'మహామంత్రి హోమాలూ' నిర్వహిస్తారట.

ఇవన్నీ యేమిటో యెవరైనా చెప్పగలరా?

Friday, December 3, 2010

మూర్ఖత్వాలు.......

.......పరాకాష్టలు

చాలా వింతైన మహాఘోరమైన ఓ దరిద్రగొట్టు వార్త వచ్చింది--

01-12-2010 న, పగోజి ఏలూరు దగ్గర చాటపర్రు గ్రామం లో, "ప్రాథమిక పాఠశాల" విద్యార్థులు ఓ 90 మంది రోజూ మధ్యాహ్న భోజనం చేస్తుంటారట--సుమారు ఓ పదిహేనుమంది ఫోటోలు కూడా వేశారు--మధ్యాహ్న భోజన పథకం లో తమకి ఇన్నాళ్లూ వంటచేసి, రుచికరంగా భోజనం పెడుతున్న జి.రాణి అనే డ్వాక్రా మహిళ--వాళ్ల గ్రూపు తగాదాల కారణంగా వంటకి రాలేదని--'ప్రహరీ దూకి వెళ్లి, యెదురుగావున్న కిరాణా దుకాణం లో బ్లేడ్లని (సంగ్రహించి) వాటితో' తమ చేతులు 'రక్తాలు ఓడేలా' కోసుకొని, 'రాణి మాకు కావాలి' అంటూ కాగితాలపై వ్రేలి ముద్రలు వేశారు!

తరవాత అధికారులు వచ్చి, "మండల విద్యా కమిటీ నిర్ణయం తీసుకొనేవరకూ" వాళ్లెవరూ (రాణితోసహా) వంట చెయ్యడానికి వీల్లేదని ఆదేశించారు(ట).

ఇక్కడ ప్రశ్న, రేపు ఈ పదేళ్ల లోపు చిన్నారులు పెద్దయి, తాము ప్రేమించినవాళ్లని మేదర కత్తులతో నరకడం, లేదా చేతులు కోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చెయ్యకుండా వుంటారా? అని.

వీళ్లని ఈ చర్యకి ప్రేరేపించినవాళ్లు పెద్దవాళ్లయితే, వాళ్లని ఓ బెంచీమీద పడుకోబెట్టి కట్టేసి, రెండు చేతులనీ చెరో పక్కా వ్రేళ్లాడదీసి, మణికట్లదగ్గర ధమనులని బ్లేడుతో కోసేసి, నీళ్ల బకెట్లలో వదిలెయ్యాలని శిక్ష విధించాలి.

వాళ్లు మైనర్లయితే, ప్రభుత్వం వుచితంగా మానసిక చికిత్స చేయించాలి--అవసరమైతే పిచ్చాసుపత్రుల్లో చేర్పించి!

అందరూ యెలుగెత్తండి మరి!

పగోజి గుండుగొలనులో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం లో నూతనంగా నిర్మించిన రాజగోపురానికి 'కలశ ప్రతిష్ట' చేశారట 01-12-2010 న. 

అంతకుముందు రెండురోజులుగా, 'శైవాగమన' (అగమ సిధ్ధాంతం అని ఈనాడు వారి కవిహృదయం) పండితులు వుల్లేటికుర్తి భోగేశ్వర శర్మ ఆధ్వర్యం లో వాస్తుహోమం........వగైరా వైభవంగా జరుగుతున్నాయట.

ఇక 'శైవన' మునీంద్రుడినో, 'శైవనో' మునీంద్రుడినో పుట్టించి గుళ్లు కట్టిస్తారేమో!

నిన్న 02-12-2010 న, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకి, అర్చకులు 'పాంచరాత్ర' ఆగమ శాస్త్రోక్తంగా పూజలను జరిపించారట.

ఇక 'పాంచరాత్ర' మునీంద్రుడికో, 'పాంచరాత్రో' మునీంద్రుడికో కూడా గుళ్లు కట్టేస్తారేమో!

చూద్దాం!

Thursday, December 2, 2010

వీర భక్తి

ఆచరణలూ

ఈనాడు 01-12-2010 'ఇదీ సంగతి' చూశారా? ముహూర్తాలమీదో మంచి కార్టూన్!

మొన్న ప గో జి తిమ్మరాజుపాలెం (నిడదవోలు) లో కోట సత్తెమ్మ ఆలయానికి 'బోనుమద్ది రామలింగ సిధ్ధాంతి' పర్యవేక్షణలో "వైదిక సువార్త ఆగమ" ఆచారం ప్రకారం "ధ్వజ స్థంభ" ప్రతిష్ట జరిగిందట.

బహుశా 'సువార్త' మహామునో, 'సువార్తో' మహామునో యేర్పరచి వుంటాడు ఈ ఆగమాన్ని. ఇక ఆ మహామునికి కూడా విగ్రహాలూ, ఆలయాలూ తరవాయి. యెవరు మొదలెడతారో మరి.

నరసాపురం లో సత్యసాయి ఆలయం లో ఆయన 85 వ జన్మదినోత్సవానికి 85 రకాల పిండివంటలతో 'మహా నివేదనం' చేసి, కేక్ కూడా కట్ చేశారట. పేదలకి దుప్పట్లు పంపిణీ చేశారట. 85 రకాల పిండివంటలు యెవరు తిన్నారో వ్రాయలేదు.

Tuesday, November 30, 2010

ఈనాడు......

.......తెగులు

"వస్తూంది......వస్తూంది......వస్తూంది......వచ్చేసింది........!" అనుకున్నంతసేపు పట్టదు.

ఆవకాయకి తోకైనా వస్తుందేమోగానీ, అంత త్వరగా వస్తుందా.......బుధ్ధి?

మళ్లీ "మొదటి" వివాహ వార్షికోత్సవ ప్రకటనలు జారీ చేస్తున్నారు ఈనాడు వారు! ఈ సారి మొదటి అన్నదాన్ని కొంచెం వంకరగా వ్రాసి.

ఆ "మొదటి" ని "వివాహ"కీ, "వార్షికోత్సవ"కీ మధ్యలో పెట్టడానికి యేమి కష్టపడాలి?

కష్టమని కాదు--వీ పీ--అనాలేమో! (వొళ్లు పొగరు, వొళ్లు పోతరం అని). అడిగేవాడెవడు అని యేమో!

యేం చేస్తాం లెండి.

Sunday, October 24, 2010

మన......

.......దౌర్భాగ్యం

  • ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, ఈతముక్కల లో జ్వాలాముఖి అమ్మవారికి 10,001 "గారెలతో", అవికూడా వివిధ రంగుల్లో, అలంకరించారట.


'పచనం' చేసిన ఆహార పదార్థాలకి 'అంటు' అనేది వుంటుందని నమ్మేవాళ్లు ఇదివరకు. దేవుళ్లకీ, దేవతలకీ వారికి నివేదించే ప్రసాదాలు కూడా వారికి తగిలించకుండా దూరంగానే వుంచుతారు. 

ఇలాంటి గ్రామదేవతలకి అలాంటివి వుండవు, మాంసమూ, మద్యం తో సహా యేవైనా తగిలించవచ్చు అంటారా? అవున్లెండి--మధ్యలో మనకెందుకు!

  •  అజ్మల్ కసబ్ గుర్తున్నాడుగా?


వీడు జైల్లోనే వుండగా, తనకు చికెన్, మటన్ పెట్టలేదనీ, పత్రికలూ టీవీ ఇవ్వలేదు అనీ ఇలా రోజుకో వీరంగం వేస్తున్నాడు. 

వాణ్ని అక్కడే వుంచి, వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా విచారణ సాగిస్తున్నారు. విచారణ సమయం లో అనేక వెకిలి వేషాలు వేస్తున్నాడట. మొన్న యేకంగా జడ్జీగారి మొహం మీద పడేలా కెమేరామీదే "వుమ్మి" వేశాడట!

అయినా మన న్యాయమూర్తులు, వాడు "మానవహక్కుల వుల్లంఘనలతో సంబంధం వుండే అంతర్జాతీయ న్యయ స్థానానికి" తన కేసుని అప్పగించాలని డిమాండు చేస్తే, వుదారంగా "ప్రభుత్వానికి నీ కోరిక ని పంపిస్తాం" అన్నారట!

వీడికి ఈ బ్లాగరు ఈ క్రింది టపా లో 


విధించమన్న శిక్షనే విధించాలని దేశ భక్తులెవరైనా వుద్యమం లేవదీస్తే బాగుండును.


  •  ప్రపంచ చరిత్రలో, తామర్లేన్ (కుంటి తైమూర్), చెంఘిజ్ ఖాన్ లు అత్యంత కౄరులని, (తుగ్లక్ ఓ పిచ్చివాడనీ) పేరుపడి అన్ని దేశాలవాళ్లకీ తెలుసు.


ఇప్పుడు మంగోలు దేశమూ లేదు, అక్కడెక్కడా వాళ్లపేర్లతో పట్టణాలు గానీ, పేటలు గానీ, రోడ్లు గానీ వున్నట్టు దాఖలాలు లేవు.

మరి మన దౌర్భాగ్యమేమిటో, మనదేశం లో వున్నాయి ఇప్పటికీ!

గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, కొండవీడు ప్రాంతం లో "చెంఘిజ్ ఖాన్" పేట లో, ఇస్కాన్ 150 కోట్లతో ప్రారంభిస్తున్న ప్రాజెక్టుకి రోశయ్య భూమి పూజ చేశారు. వాళ్లు "వెన్నముద్ద వేణుగోపాల స్వామి" అలయనికి బంగారు తాపడం చేసి, "స్వర్ణ దేవాలయం" గా తీర్చి దిద్దుతారట.

ఆమధ్య పేపర్లలో వాళ్ల ప్రాజెక్టుగురించీ, మధ్యలో ఓ పేద్ద హంస ఆకారం లో ఓ కట్టడాన్నీ, గార్డెన్లనీ--ఇలా ఓ ప్లాను చిత్రాన్నీ ప్రచురించారు.

బాగానే వుంది--కానీ ఈ "చెంఘిజ్ ఖాన్ పేట" యేమిటీ?

తైమూరు సంగతి నాకు తెలియదుగానీ, తుగ్లక్ పేరుతో ఇంకా అనేక నగరాల్లో మార్గాలూ, వాడి "ఆబాద్" పేరుతో నగరాలూ మనదేశం లో వున్నాయి. 

మన అనేక "ఆబాదు"లని పేర్లు మార్చడానికి మనకి యెలాగూ తోకలేవడం లేదు! 

కనీసం "వెధవల" పేర్లతో వున్నవేనా మార్చలేరా? వాటికీ, మీ "ప్రత్యేక జాతి సోదరులకీ" కూడా సంబంధం వుందా? వాళ్ల వారసులేనా వీళ్లు?

కానివ్వండి! ఇంకెన్నాళ్లో.....!

Saturday, October 23, 2010

ఆకాశానికి నిచ్చెనలు........

(మాకు) స్విస్ బ్యాంకులనిండా డబ్బులు!



  •  మొత్తానికి జిల్లాలో దసరాకి సామాన్యుడికి అదనం గా మరో అరకేజీ సంగతలా వుంచి, అసలే "చక్కెర" లేకుండా చేశారు.


కావలసిన 570 టన్నులకీ కేవలం 71 టన్నులే వుందట. అది దాదాపు 300 దుకాణాలకే సరిపోయిందట--అదికూడా పండగ అయిపోయాక తరలించారట.

భీమడోలు, హనుమాన్ జంక్షన్, వుయ్యూరు ల్లోని మిల్లుల్లో చక్కెర నిలవలు లేవని, కర్ణాటక నుంచి దిగుమతి చేస్తారట!

ఈ జిల్లాల్లో మిగిలిని మిల్లులమాటేమిటో, పైమూడు మిల్లులూ తయారుచేసే ఖండసారి చెక్కరే, ఇవేరోజుల్లో మార్కెట్ లోని మామూలు దుకాణాల్లో సన్న చక్కెరకు బదులుగా యెలా అమ్ముతున్నారో?



  • ద్వారకాతిరుమల శ్రీవారి తూర్పు గోపురం యెదురుగా "కిరిచి" షెడ్డు నిర్మిస్తారట. దిగువ, మధ్యతరగతి నిరుపేదలు అన్ని వసతులతో వుచిత వివాహాలు జరుపుకొందుకు ఈ షెడ్డు వుపయోగిస్తుందట.


ఇంకా కొండపైన "యాదవకుంట" ని "యాదవ పుష్కరిణి"గా తయారు చేస్తారట.

ఇంకా, గరుడాళ్వారు విగ్రహం నించి ఆలయానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డుని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించి సుందరీకరిస్తారట.

ఇవన్నీ ఆ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వెల్లడించారట.

ఇంతకీ, ఈ "కిరిచి" అనేది యేభాషో, దాని అర్థమేమిటో యెవరికైన తెలుసా?


  • పల్లెవాసులకి అంతర్జాలాన్ని మరింత చేరువ చెయ్యడానికి, బీ ఎస్ ఎన్ ఎల్ వారు గ్రామీణ "కియోస్క్"లు యేర్పాటు చేస్తున్నారట. వాటిలో యెవరైనా గంటకి కేవలం రూ.5/- మాత్రమే చెల్లించి, అంతర్జాలం లో విహరించవచ్చునట.


ప గో జి లో ఇలాంటి 126 కేంద్రాలు యేర్పడతాయట. ఇప్పటికే, వాళ్ల "బిల్లు చెల్లింపు కేంద్రాలు" వున్న 29 చోట్ల ఇవి యేర్పరిచారట.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 155 ఎక్స్ ఛేంజిలు వుండగా, అన్నిట్లోనూ "ప్రైవేటు వ్యక్తులకి" బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లని "వుచితంగా" ఇచ్చి ఈ కియోస్క్ లు యేర్పాటు చేయాలని ఆలోచనట!

ఇంతకు ముందు వీధికి పదహారు చొప్పున యేర్పాటైన "ఎస్ టీ డీ; ఐ ఎస్ డీ; పీ సీ వో"ల దగ్గర రూ.5,000/- కి బ్యాంకు గ్యారంటీ తీసుకొని అనుమతులిచ్చారు. ఈ రోజున యెన్ని వున్నాయి? వాటి గ్యారంటీల మాటేమిటి? యెవరెంత నష్టపోయారు? ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు యెవడూ లేదు, సమాధానం చెప్పేవాళ్లూ లేరు!


  • "బోఫోర్స్" గన్ లని ఆకాశానికి యెక్కుపెట్టి, వాటితో అక్కడికి నిచ్చెనలు వేసి, మీకు "సూ ఋ సం" ల ద్వారా; "మెప్మా"ల ద్వారా డబ్బులిప్పించి, మీచే చంద్రయాన్ చేయించి, "కామన్వెల్త్" ఆటలాడించి, మీరు కోటీశ్వరులుగా భూమికి తిరిగొచ్చే యేర్పాట్లు చేస్తున్నాం!--అని మన చెవుల్లో పువ్వులు పెడుతూంటే--సహిస్తారా?


తేల్చుకోండి మరి!

Wednesday, October 20, 2010

మన రైళ్లూ.........

"మన..........'ఖ భక్తీ"

మన రైళ్లలో రిజర్వేషన్లలో జరుగుతున్న అక్రమాలగురించి మనం టపాలు వ్రాసుకున్నతరవాత, (ఆ టపాల లింకులు పత్రికలకి చేరిన తరవాత) పత్రికలు పరిశోధన చేసి కథనాలు వ్రాస్తున్నాయి.

మన ద మ రై పరిధిలో ప్రతి రోజూ 280 కి పైగా సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుంటే, ఒక్క హైదరాబాదు నుంచే రోజూ 160 కి పైగా రైళ్లు వెళుతున్నాయట.

వీటిలో 3 నెలల ముందునించే రిజర్వేషన్ మొదలవుతుంది. కొన్నేళ్ల క్రితం ట్రావెల్ యేజంట్ సంస్థలు 'గుంపగుత్తగా' రిజర్వేషన్లని చేసేసుకొంటూండడం తో, "వ్యక్తుల పేర్లతో మాత్రమే" అదీ ఒక దరఖాస్తుపై 6 గురికి మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించి పాటిస్తున్నారు. (ప్రయాణీకుల వయసులు కూడా వుంటాయనీ, అవీ ముఖ్యమైనవే అనీ కావాలనే మరిచి పోయారు!)

యేజంట్ సంస్థలు రాష్ట్రం లో 180 వరకూ వున్నాయట. ఇప్పుడు వీళ్లు తెలుగువాళ్ల మామూలు పేర్లు--వెంకటేశ్వర రావు; సాంబశివరావు; వెంకట్రావు; సుబ్బారావు; సురేష్; రమేష్; శ్రీనివాస్; సాయి; లాంటి పేర్లని వుపయోగిస్తున్నారట. ఇందుకోసం క్రింది స్థాయి సిబ్బందికి 20 నించి 50 రూపాయలు (6 పేర్లున్న ఓ టిక్కెట్టుకి) లాభిస్తోందట.

ఈ టిక్కెట్ కౌంటర్లలో క్యూ లలో జరిగే "సైక్లింగ్" గురించి ఇదివరకే వ్రాశాను. పాపం యేజంట్ల గుమాస్తాలు వాళ్ల పొట్టకోసం ఇవన్నీ చేస్తున్నారు. కౌంటర్లలో సిబ్బంది కూడా, వీళ్లకి 12 టిక్కెట్లిస్తే, సామాన్యులకి మూడో నాలుగో టిక్కెట్లైనా ఇస్తున్నారు. నిజానికి ఇవి పెద్ద లెఖ్ఖలోకి రావు.

ఐ ఆర్ సీ టీ సీ లెవల్లోనూ, తత్కాల్ రిజర్వేషన్లలోనూ లక్షలాది రూపాయల అవినీతి ముందు ఇవెంత? 

పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు మాని, సో కాల్డ్ రైల్వే విజిలెన్స్, కమర్షియల్ సెక్షన్ ల వాళ్లు పెద్ద చేపలకి వలలు వేస్తే, ఈ దరిద్రం తీరుతుంది!

అసలు దీనంతటికీ బాధ్యత కనీసం రెండుబోగీలకైనా ఒక టీటీయీ ని నియమించకుండా, మొత్తం రైలు అంతటికీ ఒకే టీటీ తో పంపిస్తున్న వున్నతాధికారులదే! (జనరల్ టిక్కెట్టు కూడా తీసుకోకుండా, స్లీపర్ బోగీలలో జొరబడుతున్నవాళ్లని నిరోధించేవాడు యెవడూ లేడు!)

అన్నట్టు మొన్న 09-10-2010 న, ఆ మర్నాడు రైల్వే ఎడిషనల్ జీ ఎం వస్తున్నాడని, భీమవరం నుంచి రైల్వే కాంట్రాక్టు సిబ్బందిని రప్పించి, నరసాపురం స్టేషన్ లో వెలగని దీపాలనీ, అపరిశుభ్రంగా వున్న తాగునీటి కుళాయిలనీ, పట్టాలపై, ప్లాట్ ఫారాలపై చెత్తనీ అర్జంటుగా--వెలిగించి, శుభ్రం చేయించారట! 'వున్నతాధికారులొస్తేగానీ......'అని ప్రయాణీకులు చెవులుకొరుక్కున్నారట.

09-10-2010 నే, ప గో జి పాలకొల్లు దగ్గరున్న "దగ్గులూరు" లో 35 అడుగుల (షిర్డీ) సాయిబాబా విగ్రహాన్ని ఆవిష్కరించారట. ఈ సందర్భం గా "గణపతి పూజ"; "పుణ్యహవాచనం"; "మండపారాధన"; "దీక్షా ధారణ"; "రక్షా బంధన"; (35 అడుగుల) బాబాకి "పంచామృతాభిషేకం"; "అంకురార్పణ" నిర్వహించారట. 

"భారీ అన్నసమారాధన"; కార్యక్రమం జరుగుతున్నంతసేపూ భక్తుల "ప్రత్యేక" గీతాలూ కొన....సాగాయట.

(యెవరు యెంత డబ్బు దొబ్బించుకున్నరో, యెవరు యెంత నొక్కేశారో--ఆ బాబాకే తెలియాలి మరి!)

Tuesday, October 12, 2010

మన తెలుగు

నిర్వాకాలు

"అయోధ్యపై కేంద్రానికి 'నిర్దుష్ట' వైఖరేమీ లేదు" అన్నాట్ట వీరప్ప మొయిలీ. (అంటే 'దుష్ట' వైఖరి వున్నట్టేనా? లేక 'నిర్దిష్ట ' అనడానికి పొరపాటున నిర్దుష్ట అన్నాడా?)

మన తెలుగు పాత్రికేయుడు అలా వ్రాసి, ప్రచురించాడంతే! యెందుకంటే మొయిలీ తనకి రాని తెలుగులో మాట్లాడడు కదా!

*   *   *

మొన్న హైదరాబాదు "దేశోధ్ధారక భవన్" లో, గాంధీ జయంతి వారోత్సవ ముగింపు సభల్లో, ముఖ్య అతిథి 96 యేళ్ల కొండా లక్ష్మణ్ బాపూజీ--'డిసెంబరు 31 తరవాత ప్రత్యేక తెలంగాణా ఇవ్వకుంటే ఆత్మార్పణకి సిధ్ధపడతాను' అని ప్రకటించాడట! (కానీ 'చేసుకుంటాను' అని ప్రకటించలేదు చూడండి!)  చింత చచ్చినా పులుపు చావలేదు అందామా అంటే--1969 లో చెన్నారెడ్డి తో కలిసి, వుధృతమైన వుద్యమాన్ని చంక నాకబెట్టిందెవరు? అనే ప్రశ్న వస్తుంది కదా?

*   *   *
మొన్న మన రాష్ట్ర డీజీపీ కార్యాలయం లోని స్టోర్స్ నుంచి ఓ వంద "తూటా రక్షణ కవచాలు" (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అనుకుంటా) మాయమయ్యాయట--అకస్మాత్తుగా చేసిన తనిఖీలో ఈ విషయం బయట పడేటప్పటికి, మళ్లీ అవి అక్కడే ప్రత్యక్షమయ్యాయట! 

ఇందుకు బాధ్యుడని భావించిన డీ ఎస్ పీ ని బదిలీ చేసి, ఆరా తీస్తే, ఆయన తన వుద్యోగాన్ని సాయుధ విభాగాన్నించి సివిల్ విభాగానికి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడని తేలిందట. ఈ "కన్వర్షన్" అంటే మాటలా? ఖర్చు కనీసం 10 నుంచి 15 లక్షలైనా వుంటుందట! అందుకనే "కక్కుర్తి" పడ్డాడేమోనంటున్నారు!

నిజం గా ఈ కక్కుర్తి ఫలిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకీ యెంత నష్టం? అసలు వాటిని యెవరికి "అమ్మాలనుకున్నాడు?" లాంటి ప్రశ్నలెవరూ అడగడం లేదుట! వాడికి సహకరించింది యెవరు? అని మాత్రమే "ఆరా" తీస్తున్నారట! (ఆరూపం గా ఇంకొంత మంది మీద కక్ష తీర్చుకోవచ్చు కదా?)

ఇప్పుడు ఇలాంటివాటి నివారణకోసం ప్రత్యేక "సాఫ్ట్ వేర్" రూపొందించి, పరిశీలిస్తున్నారట!

మన పిచ్చి గానీ, ఇన్నాళ్లూ సాఫ్ట్ వేర్ వుంటేనే అన్నీ అరికట్టబడ్డాయా? (ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--కోట్ల కోట్లూ--మామూలే! "ప్ర గు స కో కో మా")

యేమంటారు?
*   *   *

అన్నట్టు--కవచాలు అంటే గుర్తొచ్చింది. పూర్వం యుధ్ధాలకి వెళ్లే సైనికులు బాణాలనుంచీ, కత్తుల నించీ రక్షణగా వొళ్లంతా వివిధ రకాల తొడుగులు (చర్మం తో గానీ, లోహంతో గానీ తయారైనవి) ధరించి వెళ్లేవారట.

ఇప్పుడు మన వివిధ గుళ్లలో శ్రీవార్లకీ, అమ్మవార్లకీ--వెండితోనూ, బంగారం తోనూ కవచాలు చేయించి, వొళ్లంతా తొడిగేస్తున్నారు! (ఇంతకు ముందు తగరం తోగానీ, రాగితోగానీ ఇలాంటి కవచాలు తగిలించిన దాఖలాలు లేవు!)

అసలు కవచాలూ, రక్షలూ, యంత్రాలూ అంటే--మంత్రాలతోనూ, బీజాక్షరాలతోనూ యేర్పాటు చేసేవేగానీ, ఇలాంటి సైనిక కవచాలూ, ఇనప కచ్చడాలూ కాదు.....అని వీళ్లకి యెవరు చెపుతారు?

Friday, October 8, 2010

కుహనా......

......సామరస్యం


హమ్మయ్య! అయోధ్య గురించి తీర్పొచ్చేసింది--60 యేళ్లో యెంతో నానిన తరవాత--అదీ సర్వ జన సమ్మతం గా--అని కొంతమంది సంతోషించేశారు.

"ఇదేదో రొచ్చు గుంట లా వుంది--రండ్రా చేపలు పట్టేద్దాం" అంటూ తయారైపోతున్నారు కొంతమంది సెక్యులరిస్టులు--తమ సోదరులమీద ప్రేమ కారి పోతూ!

ఇక, ప్రముఖ సామరస్య వాదులు తమ కలాలని దులిపి, వ్యాసాలు వ్రాసేస్తున్నారు. కొంతమంది సిండికేటెడ్/ఫ్రీలాన్స్ జర్నలిస్టులు తమ అమూల్యాభిప్రాయాలనీ, రాబోయే వందేళ్లలో యెవరు యెలా ప్రవర్తించాలో సలహాలనీ గుప్పించేస్తున్నారు.

వుదాహరణకి ఓ వ్యాసం లో--

"అయోధ్య కోసం 60 యేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న మహంత్ భాస్కర దాస్, హషీం అన్సారీ ఆప్త మిత్రులు. భిన్న వాదనలు వినిపించడానికి ఒకే వాహనం లో న్యాయస్థానానికి వచ్చేవారు.
(వాళ్లిద్దరూ జంటిల్మెన్ కాబట్టి!......వాళ్లూ కొట్టుకు చచ్చి వుంటే వీళ్లకి మరో రకం వ్రాతలకి ఆస్కారం వుండేది మరి)

ఆయోధ్య లోని అన్ని ఆలయలకీ దేవతా విగ్రహాల అలంకరణకి పూల హారాలూ, భక్తులు సమర్పించే పూల మాలలూ తయారు చేసేది అష్రాఫీ భవన్ ప్రాంతం లో నివసించే 15 ముస్లిం కుటుంబాల వారే. హ్రస్వ దృష్టి వున్నవారికి అది కేవలం జీవనోపాధిగానే కనిపించవచ్చు కానీ......(ట).

రెండు దశాబ్దాల క్రితం కాశ్మీరీ పండిత్ లు పారిపోవడం వల్ల అనేక ఆలయాలు ఆలనా, పాలనా లేనివయ్యాయి. కానీ పహల్గాం లో 900 యేళ్ల నాటి శివాలయానికి....ముస్లిములే పూజారులై.....పండిత్ లు తిరిగి వచ్చి ఆలయ బాధ్యతలు చేపట్టాలని కోరుతున్న.....(ట).

పంజాబులో....కేరళలో....కర్ణాటకలో....అనేక మసీదుల్ని హిందువులే పునర్నిర్మించారు (ట).


అబ్దుల్ వాహిద్ అనే ఆయన వారసత్వం గా వచ్చిన వృత్తివ్యాపకం "రామ్ లీలా" లో పాల్గొనే రామ, లక్ష్మణ, సీత, రావణ, హనుమ పాత్రధారులకి ఆహార్యాలు రూపొందించడమే. అతని ముగ్గురు కుమారులూ అదే పనిలో వుంటారు. ఆయన అసలు పేరు మరుగున పడి, ఇప్పుడు "రాం సింగ్ డ్రెస్ వాలా" అంటున్నారు (ట).


రిటైర్డ్ ఇంజనీరు సికిందర్ వార్సీ, తన మిత్రుడు మెకానిక్ మొహమ్మద్ ఇస్లాం లు "రామాయణాన్ని" మృదుమధురం గా గానం చేస్తున్నారు (ట) గత రెండు దశాబ్దాలుగా, యెవరు పిలిచినా.

వారణాసి లో "నజ్ నీన్" రామ చరిత మానస్ ని ఉర్దూలోకి చకచకా అనువదిస్తోంది. ఇప్పటికి సుందరకాండ ముగిసింది, మరో నెలన్నరలో పూర్తవుతుంది (ట)."

(అన్నట్టు--తులసీదాసు యెప్పుడూ "అయోధ్య రామాలయం" గురించి వ్రాయలేదు/పాడలేదు అంటూ అప్పటికి ఆ ఆలయమే లేదు అంటున్నారు జన విఙ్ఞాన వేదిక వారు--ఆయన గ్రుడ్డివాడని మరిచి పోతున్నారు!)

ఇంకా అనేక వుత్సవాల్లో, పూజల్లో, అనేక రాష్ ట్రాల్లో--దేశవ్యాప్తం గా "సామరస్యం" వెల్లి విరుస్తోంది (ట).

బాగానే వుంది. 

వీళ్లందరితో యెవరికైనా, యెప్పుడైనా, యెందుకైనా తగవు వచ్చిందా?

వస్తున్నది మహమ్మదీయుల్లో, అదీ సున్నీల్లో, "కొంతమంది" కడివెడి పాలల్లో విషం చుక్క జల్లే--మూర్ఖుల వల్లనేకదా?

ఆమాత్రానికి "వోవరాక్షన్"లు యెందుకు?

ఇలాంటి వాడే చిదంబరం--అయోధ్య తీర్పు మీద వ్యాఖ్యానించిన వెంటనే, మసీదు కూల్చివేత గురించి విలేఖర్లు అడిగితే, మాయా బజారు సినిమాలో సూర్యకాంతం లెవెల్లో సోనియా 'అలా చెప్పరాబాబూ! అమ్మ మెచ్చుకొంటుంది 'అన్నట్టు వెలిగి--"అది ఖచ్చితం గా నేరమే......." అని, మళ్లీ యెందుకైనా మంచిదని, "నా దృష్టిలో" అని ముక్తాయించాడు!

Wednesday, October 6, 2010

క్రీడల......

కామన్వెల్త్

'కామన్వెల్త్ ' అంటే సామాన్యుల (అందరికీ చెందే) సంపద. (బ్రిటిష్ కామన్వెల్త్ సంగతి వేరు)

కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం బ్రహ్మాండం గా జరిగింది. చూసేవాళ్లకి కళ్లు చెదిరాయి--మనసులు పొంగాయి.

దాదాపు 10 నించి 20 వేల మంది సిబ్బందీ, కళాకారులూ, సాంకేతికులూ పడ్డ శ్రమ ఫలించింది. గొడవలూ అవినీతీ వంటివాటి సంగతి యెలా వున్నా, అదేదో కుజ దోషమో యేదో అన్నట్టు, మనవాళ్లేమి చేసినా చివరి వరకూ ఆందోళనలూ, టెన్షన్లూ, అడుగడుగునా అనుమానాలూ, అసలు జరుగుతుందా లేదా అనే సందేహాలూ, ఇలాంటివి తప్పకపోయినా, చివరికి అంతా "సవ్యం"గానే జరిగిపోతుంది.

యేడేళ్ల కుర్రాడు కేశవ్ పాపం తబలా చక్కగా వాయించాడు. మిగిలిన కళాకారులందరితోపాటూ, యెన్ని నెలలు, రోజులు, గంటలు సాధనా, రిహార్సల్సూ చేశారోగాని, వాళ్ల శ్రమ ధన్యం అయ్యింది. 

పాపం, కేశవ్ లో మాత్రం చివరిలో అలసట స్పష్టం గా కనిపించింది. బాబూ కేశవ్! ఈ ప్రదర్శనలు ఇప్పణ్నించీ మనకొద్దు గానీ, భవిష్యత్తులో పెద్ద విద్వాంసుడు కావడానికి ఇంకా కృషి చెయ్యి!

ఇక అక్కడ యేర్పాట్లూ అవీ బ్రహ్మాండం అని విదేశీయులు కూడా మెచ్చుకొంటున్నారు. 

ప్రత్యేకం గా భోజనాల గురించి--

భారత్, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, పశ్చిమ దేశాలకి చెందిన పదార్థాలన్నీ వుంచుతున్నారట.

ఆఫ్రికాకు చెందిన జాలీఫీ, కబాబ్స్, మాంసం
ఆసియాకి చెందిన పాడ్ థాయ్, నూడుల్స్, సీఫుడ్, చికెన్, బటర్ చికెన్
పాశ్చాత్య దేశాలకి చెందిన లాంబ్ చాప్స్, చిల్లీ కాన్స్, ఫ్రైస్
ఈటలీకి చెందిన పిజ్జా, పాస్తా, పుట్టగొడుగులూ
భారత్ కు చెందిన చికెన్ రోల్స్, పాలక్ పనీర్ ప్రత్యేక వంటకాలట.

క్రీడాకారుల దేహాలనించి సాల్ట్స్, మినరల్స్ తగ్గకుండా, "ఐసోటోనిక్ డ్రింక్స్" కూడా వుంచారట. ఇక ఓ డైటీషియన్ కూడా సలహాలివ్వడానికి వుంటాడట.

ఒక్కో సెషన్ కీ 12000, మొత్తం 36000 మందికి భోజనాలు 24 గంటలూ సిధ్ధం గా వుంటాయట.

రోజుకి 15 టన్నుల మేక మాంసం, యేడు టన్నుల కోడి మాంసం, (చేపలు, పీతలూ వగైరాల సంగతి తెలీదు) 700 కిలోల బియ్యం తో వంటలు చేస్తున్నారట. 36000 లీటర్ల నీళ్లూ, పళ్ల రసాలూ, డ్రింక్స్ అందుబాటులో వుంచుతున్నారట.

టన్నులకొద్దీ మాంసాలకోసం యెన్ని జీవుల్ని చంపుతున్నారోగానీ, అవేవీ 'దుబారా' కాకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే సుమా!

(ఆ సంగతులు క్రీడలు పూర్తయ్యే వరకూ బయటికి రావు).

సంతోషకర వార్తేమిటంటే, మన క్రీడాకారులు "పతకాలు" బాగానే సాధిస్తున్నారు!

మేరా భారత్ మహాన్!

Monday, September 27, 2010

పురాతత్వ వెర్రీ

వారసత్వ సంపదలు

బ్రిటిష్ వారికన్నా ముందు, డచ్చివారు తమ వ్యాపారాన్ని ప గో జి, నరసాపురం కేంద్రం గా సాగించేవారు.

వ్యాపార రీత్యా వూళ్లు తిరుగుతూ, విశ్రాంతి కోసం రెస్ట్ హౌస్ లూ, ట్రావెలర్స్ బంగళాలూ, రహాదారి బంగళాలూ నిర్మించుకున్నారు. 

నరసాపురం లో ట్రవెలర్స్ బంగళా/రెస్ట్ హౌస్ సబ్ కలెక్టర్ ఆఫీసు యెదురుగా ఓ ఐదెకరాల్లో వుండేది. ప్రభుత్వం వారు దాన్ని 8 మూలలా ఆక్రమించి, ఎం డీ వో ఆఫీసూ, మునిసిపల్ ఆఫీసూ, ఫైర్ స్టేషనూ, ఓ హై స్కూల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇప్పుడు మళ్లీ కొత్త మునిసిపల్ ఆఫీసూ--ఇలా నిర్మించేశారు. అసలు బంగళా వుందో లేదో, బయటికి కనపడడం లేదు. అందులో వుండే రక రకాల ఫల, ఇతర వృక్షాలూ, గుర్రాల పచ్చికా వగైరా యెప్పుడో దాదాపు నాశనం అయిపోయాయి.

గవర్నరు దగ్గరనించీ, యెవరు వచ్చినా ఆ రెస్ట్ హౌస్ లోనే బసచేసేవారు!

అలాగే, వీరవాసరం గ్రామం లో ఓ విశ్రాంతి భవనం నిర్మించారు. ప్రత్యేకం గా చుట్టూ గుర్రపు శాలా, మధ్యలో విశ్రాంతి గదులూ నిర్మించారు. ఈ భవనాన్ని కొన్నాళ్లు పాఠశాలలకోసం వుపయోగించారట. తరవాత పై (పెంకుల) కప్పు పాడైపోవడం తో మరమ్మతులు చేయించి, కొన్నాళ్లు సాగించారట. మళ్లీ కొద్ది రోజులకే ఆ కప్పు పాడైపోవడం తో ఇప్పుడు ఆ వంకతో భవనాన్ని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారట! స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారట.

నిజానికి "హెరిటేజ్" భవనాలు అంటే ఇలాంటివి! అంతేకానీ, యేలూరులో యెక్కడో బయటపడిన ఆంగ్లేయుల సమాధులూ, ఇంకెక్కడో తురకల సమాధులూ ఇలాంటివి కాదు కదా? మన ప్రభుత్వం, పురావస్తు శాఖా, గీతా రెడ్డీ ఇలాంటివాటిని పరిరక్షిస్తే బాగుండును. 

వాటిలో యేమి శిల్పకళ, లేదా యేమి ప్రత్యేకత వుందని కుతుబ్ షాహీ సమాధుల్ని పరిరక్షించడం?

ఇంకో ప్రక్క, బ్రిటీష్ వాళ్ల కాలానివీ, తరవాతవీ రాగీ, ఇత్తడి నాణాలని యెక్కువ ధరలకి కొంటున్నారట!

వాటి పురాతన విలువలకోసం కాదు--వాటిలో పంచలోహాలూ వుంటాయనీ, పూజలూ, ప్రతిష్టలూ, భూమిపూజలూ వంటి వాటిలో వీటిని వుపయోగించడం శ్రేయస్కరమనీ--యెంత ధరకైనా కొనేస్తున్నారట!

ఓ నలభై యేళ్ల క్రితం భారత ప్రభుత్వం పూర్తి రాగి తో 20 పైసల నాణాలని విడుదల చేస్తే, అలాంటివి ఓ ఇరవయ్యో యెన్నో కరిగించి, చేతికి రాగి కడియాలు చేయించేసుకునేవారు! అప్పట్లో అలా రాగి కడియాలు ఓ చేతికి ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని విద్యార్థులతో సహా అందరూ చేయించుకొని, ధరించేవారు--అదో ప్రథ ఆ రోజుల్లో!

ఒకో కాలానికీ ఒకో వెర్రి మరి!

Saturday, September 25, 2010

ప్రజావినోదం

ఆహ్లాదం

ఆ మధ్య, రాష్ట్రం లో ప్రతిరోజూ తిరిగే 20 వేల బస్సుల్లో, "ఎల్సీడీ" టీవీలు పెట్టేసి, రోజంతా వినోద కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని ఆర్టీసీ వారు నిర్ణయించారన్నారు.

ఇంతకు ముందు, వొల్వో, సూపర్ లగ్జరీ బస్సుల్లో మామూలు టీవీలని పెట్టి, మళ్లీ అవతల పారేశారట. 

ఇంకా అంతకు ముందు, టీవీలూ, వీసీఆర్లూ కూడా అలాగే పారేశారు. 

ఇప్పుడు, ఓ ప్రైవేటు సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి, ఆ సంస్థే తిరిగి ఆర్టీసీకి ప్రతీ బస్సుకీ, నెలకీ 225 రూపాయలు చెల్లిస్తుందట! యెంతబాగుందో పథకం! ప్రజావినోదం, ప్రభుత్వాదాయం!

కొసమెరుపేమిటంటే, పల్లెవెలుగు బస్సుల్లో, పల్లె ప్రజలకు అనుగుణమైన (పాడి పెంటలు, పెంట చీమలు, పశువూ-పేడా, పందుల పెంపకం లాంటివేమో మరి) కార్యక్రమాల్నే ప్రసారం చేస్తారట!

ఆర్టీసీ లాభల బాటలో నడచుగాక!

మొన్న (22-09-2010) మా జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు యెందుకో ఊపొచ్చి, ఓ ప్రకటన విదుదల చేశాడు.

జడ్పీ కార్యాలయం లో మహాత్మా గాంధీ, బీ ఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సర్ ఆర్థర్ కాటన్, ఆల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మదర్ థెరిస్సా, వై యెస్ రాజశేఖర్రెడ్డి వంటి నాయకుల నిలువెత్తు విగ్రహాలని నెలకొల్పుతారట.

ఇలాంటి మహనీయుల వర్థంతి, జయంతి కార్యక్రమాలని కార్యాలయం లోనే నిర్వహిస్తారట.

ఆ కార్యాలయ ప్రాంగణాన్ని వై యెస్ రాజశేఖర్రెడ్డి పార్కుగా అభివృధ్ధిపరచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తారట. (మ్యూజికల్ డాన్సింగ్ ఫౌంటెయిన్ల సంగతెందుకు మరచిపోయారో--యెక్కడా చూడలేదో, యెవరూ చెప్పలేదో మరి)

పార్కింగ్ కి కూడా ప్రత్యేక స్థలం కేటాయిస్తారట.

ఇన్ని చెప్పినాయన, వీటికి నిధులెవరిస్తారన్నది చెప్పలేదు. (అయినా--తనది కాదు కాబట్టి, ప్రజలందరూ తాటి పట్టిలమీద యెదురు దేక్కుంటూ కాశీదాకా పొమ్మంటాడు--వాడిదేం పోయిందీ?)

అసలు ఇలాంటి ప్రకటన ఇప్పుడెందుకు చేశాడు? అని కొంతమంది ముక్కుమీద వేళ్లు కూడా వేసుకుంటున్నారు!

Wednesday, September 22, 2010

చవితి అయ్యింది.

నిమజ్జనాలు 

...........మొదలయ్యాయి.

ఓ యాభయ్యేళ్ల క్రితం ఈ నిమజ్జనాల వెర్రి వుండేది కాదు. జనాలు డబ్బుతో అంత వొళ్లు వాచీ లేరు.

చవితికి పెద్ద ఖర్చల్లా, వినాయకుడి బొమ్మ కొనడమే.

కుండలు చేసే కుమ్మరులే, చెక్క అచ్చులమధ్య మట్టితో వినాయకుడి బొమ్మ చేసి, ఆవఁ లో కాల్చి, వాటికి నీటి రంగులు వేసి, బజార్లో అమ్మేవారు. నాకు తెలిసినప్పటినించీ ఓ పెద్ద సైజు బొమ్మ ఖరీదు ఆరణాలు. చిన్న సైజు పావలా. 

(రెండే సైజులు--చిన్న సైజు అంటే ఆరంగుళాలు యెత్తు--చిన్న గుండ్రటి పీఠం మీద ముందుభాగం చక్కగా చెక్కి వుండేది--వెనక వైపు యేమీ వుండేది కాదు. పెద్దసైజు 9 అంగుళాల యెత్తు, నలుచదరం పీఠం పై కూచొన్నట్టు, వెనుక వైపు కూడా వినాయకుడి వీపూ, జుట్టూ అన్నీ వుండేవి.)

పూజా అవీ అయిపోయాక, మర్నాడు పత్రీ వగైరా కాలవలో కలిపేసి, బొమ్మని సిం హద్వారం పైన వుండే గూడుబల్ల మీద చేర్చేవారు. అలా ప్రతి యేటివీ ఓ యేడెనిమిది బొమ్మలు వుంటుండేవి ప్రతీ యింట్లో--పగిలినవి పోగా.

యే సంవత్సరమైనా బొమ్మ కొనడానికి తాహతు సరిపోకపోతే, క్రితం యేడాది బొమ్మని దింపి, దానికే పూజ చేసేవారు.

చైనా యుధ్ధం టైములోననుకుంటా, ఒకేసారి బొమ్మ రేటు రెండురూపాయలకి పెరిగిపోతే, ఓ రెండు సంవత్సరాలు మేము కూడా పాత బొమ్మకే పూజలు చేసుకొని, మళ్లీ గొడుగు బల్ల యెక్కించేశాము.

అప్పటికే, ఆ ఆరణాలు పెట్టి కూడా బొమ్మ కొనుక్కోలేనివాళ్లు, ముఖ్యం గా బ్రాహ్మణులు (అప్పట్లో బ్రాహ్మణులే ఈ పూజ చేసుకొనేవారు ఇంట్లో--సామూహికం గా వూరికో చోట పందిరిలో చేశేవారు) 'మట్టి బొమ్మే శ్రేష్ఠం' అంటూ కాలవలోని రేగడి మట్టితో తమకు వచ్చిన ఆకారం లో బొమ్మని చేసి, పూజ చేసుకొనేవారు. వాళ్లే, మరునాడు, 'మట్టి మట్టిలో కలవాల్సిందే' అంటూ ఆ బొమ్మల్ని మళ్లీ కాలవలో పారేసేవారు. 

అలా మొదలయ్యాయన్నమాట ఈ నిమజ్జనాలు.

ఇక, మా యేలూరు బిర్లా భవన్ ప్రాంతం లోని వినాయకుణ్ణి, 19-09-2010 న 800 కేజీల కూరగాయలతో, శాకాంబరుణ్ణి చేశారట.

(ఆహార ద్రవ్యోల్బణం ఇప్పట్లో దిగి వస్తుందని ఆశలు పెట్టుకోనఖ్ఖర్లేదన్నమాట)

ఇక, రాష్ట్రం లో సోమవారం 20-09-2010 నాటి నిమజ్జనం స్కోరు 11 మంది మృతీ, నలుగురు గల్లంతూ!

ప్రకాశం జిల్లా, కొత్తపట్నం వద్ద 25 మంది, మునిగి కొట్టుకుపోతే, మత్స్యకారులు రక్షించారు.

యేర్పాట్లని బట్టి చూస్తే, ఈ సారి హైదరాబాదు డకౌట్ అవుతుందని ఆశిద్దాం.

20-09-2010 నే రైల్వేల స్కోరు--మధ్య ప్రదేశ్ లో 23 మంది మృతీ, 51 మందికి తీవ్రగాయలూ.

Sunday, September 19, 2010

లౌకికత.....?!

నరసాపురం

మా "నరసాపురం" కి యెంతో చరిత్ర వుంది.  

కనీసం 300 సంవత్సరాలుగా చరిత్ర రికార్డుల్లో వుంది. అంతర్వేది లక్ష్మీ నరసిం హ స్వామి ఆలయానికి ముఖద్వారం గా యేర్పడిన ఈ గ్రామానికి "నరసాపురం" అని పేరు పెట్టారు.

ఇంకా అంతకు ముందే "ఆదికేశవ" యెంబెరుమన్నారు స్వామి కోవెల నిర్మాణం జరిగింది అంటారు.

అప్పటినించీ డచ్చివారి పరిపాలన్లో వుందీ పట్టణం. 

ప్రక్కనే వున్న, కొన్ని వందలయేళ్ల పాటు సంస్థానం గా వున్న మొగలితుఱ్ఱు రాజుల కాలం నించీ నరసాపురం అనే పేరు. సంబంధిత రికార్డులన్నిటిలో అలానే వుంటుంది.

"ఈనాడు" (ప గో జి) వాడు మాత్రం, ఈ వూరుపేరు "నౌషాపూర్" అనీ, తొమ్మిది దర్గాలు వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని చరిత్ర చెపుతోందనీ, చరిత్రకారులు చెపుతున్నారు అనీ ఓ రెండేళ్ల క్రితం నించీ వ్రాయడం మొదలెట్టాడు. 

1795 కి పూర్వం ఈ వూరు వచ్చిన "హజరత్ సయ్యద్ ఇబ్రహీం మస్తాన్ షాజేమియా" అనే ఆయన పేరుతో 1796 లో "మస్తాన్ బాబా" దర్గా ని నిర్మించారు. ఈయన "షియా" మహాత్ముడు. ఇప్పటికీ, హిందువులే యెక్కువగా ఈ దర్గాని దర్శించి, తియ్య బూందీ నైవేద్యం గా పెడతారు--అదే ప్రసాదం గా తీసుకుంటారు. సున్నీలు యెవరూ ఈ దర్గాకి వెళ్లరు.

ఓ 250 సంవత్సరాల క్రితం, ఈ దర్గాకి దగ్గరలోనే, చేపల మసీదు నిర్మించారు. (మసీదు ముందు ఓ చిన్న చెరువు యేర్పరచి--ఓ స్విమ్మింగ్ పూల్ లా వుండేదది--అందులో రక రకాల, సైజుల చేపల్ని పెంచడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మా చిన్నప్పుడు అటు వెళ్లినప్పుడల్లా, కాసేపు ఆ చేపలని చూసి ఆనందించడం మాకలవాటు). అది కూడా షియాల ప్రార్థనా స్థలమే. ఇప్పుడు పాత మసీదు శిధిలమవడం తో కొత్తగా కట్టారట--మరి చేపలు వున్నయో లేదో!

సున్నీలకి పాత బజారులో పెద్ద మసీదు వుంది. భక్తులు రోజూ అక్కడ ప్రార్థనలు చేస్తూ వుంటారు--ముఖ్యం గా రంజాను మాసం లో.

ఇక పండగ రోజున, మిషన్ హైస్కూలు ప్రక్కన వున్న "గోరీల దొడ్డి-కమ్-మసీదు" (గోడ మాత్రమే) లో ప్రార్థనలు చేసేవారు సున్నీలు. (ఇప్పుడు పేపర్లలో ఫోటోలు రావడం లేదు--అక్కడ ప్రార్థనలు మానేసి, గోరీల కోసమే వాడుతున్నారేమో--ఈ సారి నా సున్నీ మహమ్మదీయ స్నేహితులని యెవరినైనా అడగాలి మరచిపోకుండా!)

ఆ తరవాతెప్పుడో వచ్చిన చుట్టుప్రక్కల దర్గాలని కూడా కలుపుకొని, (ఇందులో కొన్ని ఇప్పుడు లేవు) నవదర్గాల పురం కాబట్టి, నౌషాపూర్ అని వ్రాయడం యేమైనా బాగుందా?    

మతసామరస్యం, సర్వమత సమానత్వం పేరుతో అధారాల్లేకుండా ఇలాంటి చరిత్రని ప్రచారం చెయ్యడం యెందుకు? (అడిగేవాడు లేడుకాబట్టి--చాలామంది అసలు పట్టించుకోవడమే లేదు--కొన్నేళ్ల తరవాత, ఈ రాతల్నే చారిత్రకాధారాలు అనే ఛాన్సు వుంది మరి!)

(అయినా, ఈ "ముస్లిం సోదరులు" అనేజాతి తెలుగు మీడియా సృష్ఠే యేమో--ఇంగ్లీషు పేపర్లలో, మ్యాగజైన్లలో యెక్కడా ముస్లిం అనేమాటకి తోకగా "బ్రెద్రెన్" అని వాడుతున్నట్టు లేదు.)

.....కోవెలగురించీ, మిగిలినవీ మరోసారి.



Saturday, August 28, 2010

రాహుల్ ప్రజాసేవా........

..............సంతృప్తీ

నన్ను ప్రథాన మంత్రిగా చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. 

కానీ, నాకు ఆ పదవి లేకుండానే యెంతో సేవ చెయ్యగలుగుతున్నాను. నాకు చాలా బాగుంది--అన్నాడట రాహుల్!

(బహుశా తనని పీఠం పై కూచోబెట్టి ఈ కాంగీరేసులు వేల వేల కోట్లు యెలా దండుకుంటారో ఇప్పటికే కళ్లముందు రీళ్లకి రీళ్లు తిరిగి పోయి వుంటాయి....పాపం!)

ఇకనైనా మన పగటివేషగాళ్లూ, పులివేషగాళ్లూ ఆయన ఫోటోలని నెత్తిమీద గరగల్లా ధరించి, "2014 లో రాహులే ప్రథాని" అని పిచ్చి పిచ్చి గంతులు వెయ్యడం మానేస్తే బాగుంటుందేమో!

మీరూ, మీ కుటుంబాలూ, తరతరాలూ భవిష్యత్తుకోసం బలి అయిపోడానికి రాహుల్ సిధ్ధం గా లేడు అని తెలుసుకోండి!

తింగరోళ్లలారా! ఇప్పటికైనా బుధ్ధి తెచ్చుకోండి!

Thursday, August 26, 2010

ఈనాడు

తెలుగుకు తెగులు

ఈ మధ్య మిత్రుడెవరో "ఐ న్యూస్ కి తెగులు సోకిందహో!" అనే ఓ టపాని వ్రాశాడు. దానిమీద నా వ్యాఖ్య కూడా వ్రాసాను. అది ప్రచురితమయ్యిందో లేదో తెలియదు.

ఇప్పుడు, ఈనాడు వారు కూడా తెలుగు నేర్చుకోవలసిన దుస్థితిలో వున్నారేమో అనిపిస్తూంది.

వుదాహరణకి, వారి జిల్లా ప్రచురణల్లో నమూనా ప్రకటన ఇస్తూ, "5వ వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షలు అనే ఓ హెడ్డింగు చూపించారు!

ఇక వారి ప్రకటనల్లో, "పదమూడవ విహాహ", "పధ్ధెనిమిదో వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షల ప్రకటనల్ని విడుదల చేస్తున్నారు!

మొన్న, ఓ 85 యేళ్లాయనకి "65వ వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షలందించారు!

బాప్రే! 85 యేళ్లలో 65 వివాహాలా! హేట్సాఫ్ బాస్! అనచ్చు మనం.

ఇలాగే--"హత్యకేసులో భర్తకు జీవిత ఖైదు" అని ఓ వార్త! యెవరి హత్యో, యెవరి భర్తో యెవరికీ తెలియదు!

"భార్య హత్య" అనో, "ఓ మహిళ హత్య" అనో వ్రాసి, "కేసులో భర్తకు" అంటే అర్థవంతం గా వుంటుంది కదా?

ఇక మొన్న వరలక్ష్మీ వ్రతం సందర్భం గా, ఈనాడువారు, "శ్రావణ శుక్ర" పౌర్ణిమకు ముందువచ్చేదే "శ్రావణ శుక్రవారం" అన్నారు! శ్రావణ శుక్రం యెక్కడ తెచ్చారో!

"భవిష్యోత్తర పురాణం" ప్రకారం, 'ముత్తయిదువలకు ' వాయినాలు ఇస్తారట. "ముత్తయిదువలు" అంటే యెవరు?

కలశం లో "మర్రి, మామిడి, రవి, జువ్వి చిగుళ్లను" వుంచుతారట! ఈ కాలం లో మామిడి చిగుళ్లు దొరకవు! "....పురాణం" లో ఇది యెక్కడ వుందో చెప్పగలరా?

"....మొలకెత్తిన శనగలు" వాయినాలుగా ఇస్తారట! (ఇలా శనగలు ఇవ్వడం లోని "ఆరోగ్యసిధ్ధిని" ఆనాడే పెద్దలు గుర్తించారట!) ఇదే పురాణం లో వుంది? (మొలకెత్తిన ధాన్యాలు, పప్పులు, దానం చెయ్యడం, వాయినం ఇవ్వడం నిజంగా నిషిధ్ధం!)

అసలు ఇదంతా యెందుకు?............అంటే.....(ప గో) జిల్లలో సుమారు 450 బంగారు దుకాణాలు వున్నాయి. గత యేడాది ఈ నెలలో రూ.కోటి వ్యాపారం జరిగింది. ఈ యేడాది అంతకన్నా యెక్కువ వ్యాపారం జరుగుతుందని ఆశాభావం!

అదండీ సంగతి!

ఇక వేదాంత విజయ వెంకట రామానుజాచార్యులంటాడూ....."విష్ణు ధర్మోత్తర పురాణం" అనుసరించి....."ట! ఇంకా "రుగ్వేదఖిలకాండలో శ్రీసూక్తం........." అంటాడు.

పెద్దబిందెమీద చిన్న బిందెనిపెట్టి, దానిమీద మూతపెట్టి, చెంబుని వుంచి, దానిమీద కొబ్బరికాయకి ముక్కూ, నోరూ, కళ్లూ చెవులూ పెట్టి, ఖరీదైన పట్టుచీరలు కట్టి, బంగారు వడ్డాణాలూ, చెవి, ముక్కు పోగులూ, మెడలో కాసుల పేర్లూ ఇలా అలంకరించి, ఫోటోలు తీసుకొని, పేపర్లోనూ, టీవీల్లోనూ, నెట్ లోనూ వుంచి, ఆనందిస్తే యేమవుతుంది?

ఇక బంగారు రూపులూ, విగ్రహాలూ వుంచడం?

నాకు తెలిసి, 1975 లో మా వివాహమయ్యక, మా యింట్లో యెప్పుడూ ఈ రూపులు పెట్టుకొని, కొబ్బరికాయకి అలంకరణలూ చెయ్యలేదు!

అసలు....శ్రీమహాలక్ష్మికి అలంకారం చెయ్యడం నిషిధ్ధం! (ఆవిడ యే పురాణం లో అయినా, యే కథలో అయినా, ముసలి ముత్తయిదువ రూపం లోనే ప్రకటితమయి, వరాలు ఇచ్చింది!)  

పైగా, యెంత అలంకారం చేస్తే, అంతకు తగ్గా శాంతులు జరిపించాలి.....అంత నిష్టగా పూజించాలి ఆవిడని!

కానీ, ఈ రోజు వేలం వెర్రిగా ఈ పనులు చేస్తున్న గృహిణి యెవరైనా, క్రితం యేడాది ఈ పూజలు చేసిన తరవాత, తమకి యెంత నష్టం జరిగిందో.....గుండెలమీద చెయ్యివేసుకొని, ఆలోచించి, సమాధానం చెప్పగలరా?

(యెందుకంటే ఇలాంటి చాలా కేసులు నాకు తెలుసు మరి!)

యేమిటో! తెలుగు భాషతో మొదలు పెట్టి, యెక్కడికో వెళ్లిపోయాను......అయినా ఇవీ తెలుగు "సంప్రదాయాలే" అంటున్నారుగా మరి!

Friday, August 6, 2010

భక్తీ, రక్తీ, విద్యా

గుడీ, బడీ, మధ్యలో మద్యం!?

ఈ మధ్య మన సర్వోన్నత న్యాయస్థానం "దేశ వ్యాప్తం గా, అనుమతిలేకుండా, రోడ్లు, పార్కులు లాంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన 'ప్రార్థనా స్థలాలని' తొలగించడం/వేరే చోటుకు మార్చడం/క్రమబధ్ధీకరించడం పై తమ వైఖరిని స్పష్టం చేయాలి" అంటూ రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించిందట. 

ఇందుకు నాలుగు వారాల సమయం ఇచ్చిందిట. (కేసు సెప్టెంబర్ 14 కి వాయిదా పడిందట)

ఇంతకు ముందే రాష్ట్రాలు ఈ వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించాయట--సుప్రీం వారికి.

వాటి ప్రకారం--తమిళనాడులో అత్యధికంగా 77,450 ప్రా. స్థ. లు బహిరంగ ప్రదేశాల్లో వున్నాయట. రాజస్థాన్ లో 58,253; గుజరాత్ లో 15 వేలూ ఇలా వున్నాయట.

అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్కటీ లేదట!

మరి మన రాష్ట్రం యెన్ని అని చెప్పిందో సమాచారం లేదు--మనం యెలాగూ సరైన లెఖ్ఖలు ఇవ్వం కదా!

ఈ లెఖ్ఖకొస్తే--నరసాపురం నించి మార్టేరు వరకూ కేవలం 20 కిలో మీటర్ల దూరం లో, రోడ్డు కీ కాలవకీ మధ్య యెడమ వైపూ, రోడ్డుకి కుడివైపూ కనిపించే, చిన్నా చితకాతో సహా గుళ్ళూ అవీ లెఖపెడితే, 200 కి పైగా వస్తాయి. (ఇంకా ఆయా వూళ్లలో వాటిని లెఖ్ఖ పెట్టకుండానే!--ఇతర మతాలవి కలపకుండానే)

మరి ఈ లెఖ్ఖని, ఒక జిల్లాలోనే, లక్షకి పైగా వుంటాయేమో. 

రాష్ట్ర వ్యాప్తం గా యెన్నో!

వీటికి తోడు, నిర్మాణం లో వున్నవీ, పునరుధ్ధరణ క్రింద వున్నవీ, ప్రాచీనమై అలనా పాలనా లేనివీ కలిపితే, యెన్ని వుంటాయో వూహించుకోండి! 

(ఇంకా వీటిలో రోడ్డు ప్రక్కన వేపా, రావీ మొదలైన చెట్లక్రింద వుంచబడిన--నాగదేవతల, పసుపూ బొట్టూ పెట్టి వుంచబడిన రాళ్ల సంఖ్య పరిగణనలోకి తీసుకోలేదు!)

ఇక వీధికి కనీసం ఐదారు బడులు; కళా శాలలు; ఇతర విద్యాలయాలు వుంటున్నాయి.

'మద్యాంధ్రప్రదేశ్' అని యెంత వెక్కిరించుకున్నా, హిపోక్రసీ లేకుండా మాట్లాడుకుంటే, కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తూ, లక్షల్లో మామూళ్లు ముట్టచెపుతూ, సరుకు కొనుక్కొంటూ, అమ్ముకుంటూ, పదో పరకో లక్షలు సంపాదించుకోవాలనుకొనే మద్య వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకోవాలి కదా?

మరి అడుక్కో గుడీ, బడీ వుంటే, గుడికీ బడికీ సమీపం లో షాపు వుండకూడదంటే--నివాస స్థలాల మధ్య యెలాగూ కుదరదు--వాళ్లు షాపులెక్కడ పెట్టుకోవాలి?

గుడుల విషయంలో--ఎండోమెంట్ వాళ్ల చేతుల్లో వున్న గుళ్లే లెఖ్ఖలోకొస్తాయిట. మరి బళ్లకి యే నిబంధన వుందో!

మరి మన ప్రభుత్వం యెన్ని తొలగిస్తుందో? యెన్ని మారుస్తుందో? యెన్ని మరేదో చేస్తుందో?

Monday, July 26, 2010

భక్తి పేరుతో.....

"క్రిమినల్ వేస్ట్"

ద్రవ్యోల్బణం రెండంకెలనించి దిగిరానంటోంది. కూరగాయలేవీ వినియోగదారుడికి కేజీ 20 నించి 40 లోపు దొరకడం లేదు.

వర్షాలు బాగా పడితే, వరదలు ముంచెత్తకుండా వుంటే, పంటలు బాగా పండితే....ఇలా కొన్ని 'తే' లతో, వచ్చే ఆరేడు నెలల్లో ద్రవ్యోల్బణం ఒక అంకె స్థాయికి దిగి 'రావచ్చు' అంటాడు ప్రథానమంత్రి.

ఇక తొలేకాశి తో మొదలయ్యింది భక్తి పర్వం!

ఇక్కణ్ణించీ ప్రతీ రోజూ చాలా పవిత్రమైనదే! ప్రతీ రోజుకీ యేదో మహత్యం వుంటుంది--ఉపనిషత్తులూ, పురాణాలూ, భగవద్ గీతా, భారత భాగవతాలూ, ఇంకా ఈనాడు అంతర్యామీ--ఇలా యెక్కడో అక్కడ ఆ మహత్యం గురించి వర్ణించబడే వుంటుంది.

ఇక మధ్యలో గురుపూర్ణిమ లాంటివి వస్తూనే వుంటాయి.

మూడురోజులుగా, కనకదుర్గ అమ్మవారికి 'శాకాంబరీ' అవతారం లో పూజలు చేస్తున్నారట.

నిన్న ఒక్కరోజే, భీమవరం లో అమ్మవారికి అక్షరాలా 1200 కేజీల కూరగాయలతో (ఆకు కూరలు కాకుండా) అలంకరించారట.

ఒక్క విశాఖపట్నం లోని ఒక సాయిబాబా గుళ్ళోనే, అక్షరాలా 800 కేజీల బియ్యం తో అన్నం వండి, అన్నాభిషేకం చేశారట.

ఇక కొన్ని లక్షల బాబా గుళ్ళలోనూ, కొన్ని వేల అమ్మవారి గుళ్ళలోనూ, యెన్ని కిలోల బియ్యం, కూరగాయలూ వినియోగించారో!

ఇలాంటివాటికి, సామాన్యుడు ఐదో పదో విరాళమిస్తుంటే, కోట్లు సంపాదించినవాడు లక్షల్లో విరాళాలిస్తున్నాడు.

యేదైనా, భారం పడేది సామాన్యుడిమీదేకదా?

రేట్లెలా పెరిగినా ఫరవాలేదు--మా భక్తి మాది అంటారా--మీ ఇష్టం.

యేమైనా ఆహార పదార్థాల క్రిమినల్ వేస్ట్ నిరోధించడానికి ఒక చిన్న ప్రయత్నమైనా యెవరైనా చేస్తే బాగుండును!

Sunday, July 18, 2010

అమానుష....

సోంపేట

...........అంటే నాకు మొదట గుర్తు వచ్చేది సర్దార్ గౌతు లచ్చన్న--ఆయన స్వగ్రామం మందస అన్నా, ఆయన నియోజకవర్గం సోంపేట అన్నా గుర్తు వచ్చేది ఆయనే.

మొన్న అక్కడ జరిగింది మహా దారుణం--అంటే చాలా తక్కువ చెప్పినట్టు.

నాకు కొన్ని చిన్న చిన్న సందేహాలు.

అన్ని రోజులనించీ, అంతమంది పోలీసువాళ్ళని రప్పించి, మోహరించి, కవాతులూ గట్రా చేయించి, వాళ్లు ఫలానా రోజు జనాలు యెవరూ ఫలానా చోటకి రావద్దు అని హెచ్చరికలు చేసినా, అన్నిరోజులూ మన మీడియాలు యేమి చేస్తున్నట్టు?

'పోలీసులు కొంత అతిగా ప్రవర్తించినట్టు తోస్తూంది' అని పెద్దాయన అన్నాట్ట--ఆయన అనుభవం లో లోక్ నాయక్ మీద లాఠీఛార్జీ లాంటి పెద్ద పెద్ద అతి ప్రవర్తనలు ఇంకా చాలా వుండి వుంటాయి కాబట్టి, ఇది పెద్ద తప్పు కాదేమో!

డీజీపీ లాంటి పోలీసు వున్నతాధికారులెవరూ ఆ రోజు రాష్ట్రం లోనే లేరట. మరి అక్కడి పోలీసువాళ్ళకి ఆదేశాలు యెవరిచ్చారో?

కొంతమంది చిన్న వున్నతాధికారులు, 'మేము పోలీసువాళ్ళు అందరికీ ఆయుధాలు ఇవ్వలేదు. కేవలం లాఠీలే పట్టుకెళ్ళమన్నాము. టియర్ గాస్ ఇచ్చాము. ఆయుధాలు ఇచ్చినవాళ్ళకి కూడా రబ్బరు బుల్లెట్లే ఇచ్చాము. మరి.......' అని జుట్లు పీక్కున్నారట. మరి పేలిన గన్ లూ, బుల్లెట్ లూ 'ప్రైవేటు' సైన్యానివేనా?

ఆరోజు సాయంత్రం ఐదు గంటలవరకూ, మాననీయ హోం మంత్రి, చెల్లెమ్మ సబిత కూడా, 'మాకు పూర్తి వివరాలు తెలియవు--వచ్చాకే చెపుతాను' అనీ, వివరాలు తెప్పించుకొని, 'వెనక్కి వచ్చేస్తున్న పోలీసుల మీద జనం దాడి చేశారు కాబట్టి పోలీసులు కాల్పులు జరిపారట' అని చెప్పడమేమిటి?

(టీవీల్లో వీడియోలు చూసిన వాళ్లందరూ చెప్పగలరు--ఇందులోని నిజమెంతో!)

'అక్కడ శంకుస్థాపన యేమీ జరగలేదు' అని కంపెనీ ప్రతినిధులు భుజాలు తడుముకున్నారంటే, అసలు ప్లాన్ యేమిటో తెలియడం లేదూ?

కొణిజేటివారు ఇప్పటికైనా 'యెవరి బాధ్యత యెంత' అని నిగ్గదీస్తారా?

బాబ్లీ గురించి జరుగుతున్నది చూస్తూంటే, యెవరికైనా ఆ నమ్మకం వస్తుందా?

మిగతా మరోసారి.

Sunday, June 27, 2010

కుంభకోణం డాట్ కామ్

ఐ ఆర్ సీ టీ సీ

కొంపలంటుకున్నాయి బాబోయ్! అని అందరూ గగ్గోలు పెడుతుంటే,  'హమ్మయ్య! నా చుట్ట వెలిగించుకోడానికి నిప్పు వెతుక్కునే బాధ తప్పింది!' అన్నట్టుంది "ఈనాడు" వ్యవహారం.

మమత ప్రవేశపెట్టిన 'దురంతో', నాన్ స్టాప్, పూర్తి ఏ సీ, రైళ్ళు యెలాగూ ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి.

ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రైళ్ళు సైతం, ఐ ఆర్ సీ టీ సీ వారి పుణ్యమా అని, టీటీలకి కాసులు కురిపిస్తూ, 
ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి!

హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా వెళ్ళే యే రైలుకైనా, నెలా రెండు నెలల ముందే స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్ పూర్తయిపోతోంది.

ఇక తత్కాల్ ఒక్కటే గతి--డబ్బులెక్కువైనా (ఇంకా చాలా లొసుగులున్నా) అనుకుంటే, 'రెండు రోజుల ముందు మాత్రమే' దొరుకుతాయి. 

ఉదయం 8.00 గంటలకి బుక్కింగ్ ప్రారంభం అవుతుంది. 7-30 నించీ బ్రౌజర్ తెరుచుకొని, ఐ ఆర్ సీ టీ సీ సైట్లో లాగిన్ 
అయినా, 'ఎవైలబుల్' అని అన్ని టిక్కెట్లూ చూపిస్తూ వుంటుంది. 

కానీ, 8.00 అవ్వడం పాపం, ఛస్తే ఎవైలబులిటీ చూపించదు! 

అది చూపించే టైముకి తత్కాల్ టిక్కెట్లన్నీ, 'వెయిటింగ్ లిష్ట్--12 నించి 126' వరకూ చూపిస్తూ వుంటాయి! ఇక వెయిట్ లిష్ట్ 1 వచ్చినా, కనీసం ఆర్ ఏ సీ కైనా వస్తుందని నమ్మకం లేదు!

(ఈ రిజర్వేషన్ పధ్ధతి సాఫ్ట్ వేర్ గురించి మరోసారి మాట్లాడదాం)

దాదాపు ఈ సంవత్సరం ఏప్రిల్ నించీ ఇదే పరిస్థితి!

అలాగని నిజం గా అందరూ అన్ని బోగీల్లోనూ నిండుగా ప్రయాణిస్తున్నారా అంటే--స్లీపర్ బెర్తుకి 200, ఏ సీ 3 టయెర్ కి 500, ఏ సీ 2 టయెర్ కి 1000--ఇలా దండుకుంటున్నారు--టీ టీ లు. 

తీరా అంతా ఇచ్చి, వెళితే, బోగీ అంతా ఖాళీగా వెక్కిరించి, యెంత మోసపోయామో అని ముక్కు మీద వేలేసుకుంటాం!

ఇక 'ఆటో అప్ గ్రెడేషన్' అనేదొకటుంది--మనం ఓ క్లాసు టిక్కెట్ బుక్ చేసుకుంటే, దానికి పై క్లాసులో ఖాళీ వుండడం జరిగితే, ఆటోమేటిక్ గా అదే టిక్కెట్ తో పై క్లాసులో ప్రవేశార్హత లభిస్తుంది!

మూడేళ్ళ క్రితం ఇలా జరిగి, ప్రయాణీకులు యెంతో సంతోషించేవారు!

ఇప్పుడా సౌకర్యం కాకెత్తుకెళ్ళిపోయింది! బోగీలు ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి!

ఇంకో రహస్యం తెలుసా? 

రిజర్వేషన్ల గురించి యేమాత్రం పట్టించుకోకుండా, తరచూ మహానగరాలకి రాజభోగం గా ప్రయాణాలు సాగించే నా స్నేహితుడొకరిని ఈ మధ్యే, "మీ చర్మ రహస్యం యేమిటి సినీ తారగారూ?" అన్నట్టు ప్రశ్నించాను. ఆయన చిద్విలాసం గా నవ్వుతూ, "లక్స్ సబ్బు" అన్నంత వీజీగా, 

"ఓ రెండు గంటల ముందు స్టేషన్ కి వెళ్ళిపోయి, యెవరైనా రైల్వే వుద్యోగిని (ఆఖరికి పోర్టర్ అయినా సరే) పట్టుకొని, ఓ 200 పారెస్తే, 'ఎమర్జెన్సీ' కోటాలో ఓ టిక్కెట్టు (మీరడిగిన క్లాస్ లో) పట్టుకొచ్చి ఇస్తారు! ఇంక రాజభోగం కాకేమిటి?" అని క్రొశ్నించాడు.

అస్తమానూ ఈ చిట్కా పని చేస్తుందా అని అడిగితే, "ప్రతీరోజూ వీ వీ ఐ పీ లు రైళ్ళలో ప్రయాణించరుగా? ఒకవేళ ఆ రోజు అలాంటివాళ్ళు ప్రయాణిస్తూ, ఎమర్జెన్సీ కోటా కూడా నిండినా, ఇంకో వంద మనది కాదనుకుంటే, ఆ ఐ పీ ల తైనాతీకెవడికో ఒకడికి నామం పెట్టి, ఆ టిక్కెట్ మన చేతికి ఇస్తారు!" అని రైలుగీత బోధించాడు!

ఈ మధ్య టీ వీ చానెళ్ళలో కూడా ఐ ఆర్ సీ టీ సీ, వుద్యోగుల కుమ్మక్కు--అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి!

ఇంతకీ ఈనాడు ప్రసక్తి యెందుకు అంటారా?

ఇవాళ పత్రికలో (27-06-2010) "ఐ ఆర్ సీ టీ సీ కల్పిస్తున్న సౌకర్యాలు, బుక్కింగ్ చేసుకునే విధానం" వగైరాలపై వ్యాసం వెలువడింది! 

ఇక మీ ప్రయాణానందాన్ని అనుభవించండి మరి!

Friday, June 25, 2010

'ప్రశ్న వీరులు '

లీకువీరులు

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వారు నిర్వహించే పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయట.

ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా ఈ లీకులు జరుగుతున్నాయట!

లీకువీరుడు సాక్షాత్తూ ఆ బోర్డు చైర్మనేనట!

అసలు ఈ పోటీ పరీక్షలెందుకు? పాఠశాలల్లో, కళాశాలల్లో చెప్పే చదువుమీదా, వాళ్ళు పెట్టే పరీక్షల మీదా నమ్మకం లేక! అంటారా! అదికాదు.

అసలు వుద్దేశ్యం--ఒక రంగం లో ఒక వుద్యోగానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించడానికి అభ్యర్థులకి పరీక్ష పెట్టేవారు--రాజుల కాలం నించీ!

మరి ఇప్పుడు ఇవి వెర్రితలలు యెందుకు వేస్తున్నాయి?

పరీక్ష ప్రశ్నపత్రాలు రచించేవాళ్ళవల్లా? ఆ ప్రశ్నలకి 'కీ' వెలువరించేవరకూ యెవరికీ సమాధానాలు తెలియక పోవడం వల్లా? సందట్లో సడేమియాగా ప్రశ్న పత్రాలు లీక్ చేసి, జవాబులు వాళ్ళే చెప్పి, అవసరమైతే ప్యాసు చేయించి, వుద్యోగాలు కట్టబెట్టే వాళ్ళవల్లా? వీటికోసం అనేక '...సెట్' లు కనిపెట్టి ప్రవేశపెడుతున్న మన రా.నా. లూ, వాళ్ళ తైనాతీ బ్యూరోక్రాట్లూ--వల్లా?

'..........కర్ణుడీల్గె' అన్నట్టు సవాలక్ష కారణాలు.

తెలుగు భాష జూనియర్ లెక్చరర్ వుద్యోగం కోసం పరీక్ష లో ఇచ్చే ప్రశ్నల గురించి ఓ సారి వ్రాశాను.

అలాగే, బ్యాంకు లో వుద్యోగానికి--గుమాస్తాలైనా, అంకెల్ని గుర్తుపట్టడం, తప్పుల్లేకుండా కూడడం వస్తే చాలు. ఇప్పుడు కంక్ప్యూటర్లు వచ్చాక, అది కూడా అఖ్ఖర్లేదు--కీబోర్డు మీద అక్షరాల్నీ, అంకెల్నీ గుర్తుపట్టడం వస్తే చాలు!

కానీ, 'టెస్ట్ ఆఫ్ రీజనింగ్' పేరుతో, "టేబుళ్ళు అన్నీ గుర్రాలైతే, కుర్చీలన్నీ గొర్రెలైతే, పుస్తకాలన్నీ కాకులైతే, పెన్నులన్నీ కోడీకలైతే, గొర్రెమీద కూర్చొని, కాకులమీద వేటితో వ్రాస్తారు?" అనే ప్రశ్న వింటే, 'మావూళ్ళో సహం పిచ్చోడి వయస్సు 24 కాబట్టి, నీ వయసు ఖచ్చితం గా 48' అని ఇంటర్వ్యూ చేసేవాడికి సమాధానం చెప్పిన మన హీరోలు గుర్తు రావడం లేదూ?

అప్లికేషన్ దగ్గరనించీ అడ్డం గా డబ్బులు వసూలు చేసి, కొన్ని లక్షలో, కోట్లో పోసి, ఈ పరీక్షలు నిర్వహించి, నిరుద్యోగులతో యెందుకు ఆడుకోవాలి?

ఇంకో విచిత్రం తెలుసా?

ఆబ్జెక్టివ్ టైపు పరీక్షలు వచ్చిన కొత్తలో, ముందు 'జవాబు పత్రం' ఇచ్చి, ఓ అరగంట క్లాసు పీకేవారు--జవాబులు యెలా గుర్తించాలి, సమయం యెలా పాటించాలి--వగైరాల గురించి.

మా మూడు 'వీ' ల హనుమంతరావు, జవాబు పత్రం ఇచ్చిన పది నిమిషాల్లోనే అది పూర్తి చేసి ఇచ్చేసి, ఆ క్లాసు పీకుతున్నవాణ్ణి--ఇంకా యేమైనా వుంటే పట్రా! అని సవాలు చేశేవాడు.

వాడి రహస్యం యేమిటి అని ఆరా తీస్తే, 'యేముందీ! ఒంటెద్దు బండి నడుస్తూవుండగా, యెద్దు వుచ్చ పోస్తే యే వరుసలో నేలమీద పడుతుందో, అదే వరుసలో జవాబులు టిక్కులు పెట్టెయ్యడమే!' అని చిద్విలాసం గా వాక్రుచ్చేవాడు! (ఆ విధానం లోనే వాడికి గుమాస్తానించి అధికారిగా ప్రమోషన్ వచ్చింది అన్నది వేరే సంగతి! వాడి ఇంటర్వ్యూ సంగతి మరోసారి!)

ఇంతకీ విచిత్రం యేమిటంటే--

ఎంసెట్ ఇంజనీరింగులో యెనిమిది మందీ, మెడికల్ లో ఆరుగురూ అభ్యర్థులు మూడు గంటలు పరీక్షా కేంద్రాల్లో కూర్చొనే వున్నా, ఓ ఎం ఆర్ షీట్లలో 'అసలేమీ' వ్రాయకపోయినా, (మా మూడు 'వీ' ల హనుమంతుడు సూత్రం కూడా పాటించక పోయినా), 'రిజర్వేషన్' దృష్ట్యా వాళ్ళకి సీట్లు వచ్చాయట!

పైగా, ఇలాంటి సంఘటనలు 'ప్రతీ యేడాదీ' జరుగుతూనే వుంటాయని సాక్షాత్తూ ఎంసెట్ అధ్యక్షుడు డీ ఎన్ రెడ్డి వెలిబుచ్చారట! దీనికి తోడు, ఇంటర్ మార్కులకి వెయిటేజీ ఇవ్వడం వల్ల, వాళ్ళ ర్యాంకు పెరిగే అవకాశం కూడా వుందట!

అన్నట్టు, ఇంజనీరింగులో సీట్ల సంఖ్య 2,50,000 కి పెరిగిందట!

ఇదివరకు వీధి బళ్ళలో 'మీ చదరలు మీరే తెచ్చుకోవాలి' అనేవారు. ఇప్పుడు "సీట్లు ఫ్రీ--కూర్చోడానికి మీకు 'సీట్' వుంటేచాలు!" అంటారేమో!

(అనుకోకుండా పెద్ద టపా వ్రాసేశాను--నా పిచ్చిగానీ, ఓపిగ్గా చదివేవాళ్ళెంతమందో, విషయం గ్రహించేవాళ్ళెంతమందో, ప్రతిస్పందించేవాళ్ళెంతమందో--యేమిటో!)   

Saturday, May 15, 2010

'......క్షమించని

కులాల ప్రసక్తి'

రెండో రంగం :

మెట్లెక్కి బ్యాంకులోకి వస్తున్నాడో రైతు--దాదాపు 50 యేళ్ళు వుంటాయి, అడ్డపంచి పైకి మడిచి కట్టి, తలకి గుడ్డ చుట్టి, తెల్లచొక్కామీద బురద మరకలతో!

బ్యాంకు జవాను--'దించు! దించయ్యా పంచెని!' అన్నాడు. కంగారుగా పంచెని దించేశాడు రైతు. 'తలగుడ్డ తియ్యి! బ్యాంకులోకి వచ్చినా మర్యాద తెలియదు!' అనగానే, తలగుడ్డ తీసి చంకలో ఇరికించాడు ఆ రైతు. 

ఫీల్డాఫీసరు యెదురుగా నించొని, 'సార్! మా పంట ఋణాలు చెల్లించేసి పదిహేనురోజులు పైన అయ్యింది. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. దుక్కి దున్ని సిధ్ధం చేశాము. విత్తనాలకి డబ్బు కావాలి. ఇన్నాళ్ళూ కొత్త మేనేజరు రావాలని ఋణాలు ఇవ్వలేదు. ఇప్పుడైనా........' అంటూంటే--

ఫీల్డాఫీసరు, 'ఇవాళ సోమవారం! ఇవాళెవరు రమ్మన్నారు నిన్ను?' అన్నాడు.

'కొత్త మేనేజరు సోమవారం వస్తాడంటే......'

'అవునయ్యా! అన్నాడు. కానీ ఈ ముష్టి వూరుకి యెవరు వస్తారు? జోనల్ ఆఫీసు లో రిపోర్టు చేసి, అక్కణ్ణించే ఇంకోవూరుకి మార్పించుకొని వెళ్ళిపోయాడు ఆయన! మళ్ళీ ఇంకొకర్ని వెయ్యాలి, ఆయన రావాలి.......చూద్దాం.....మళ్ళీ వచ్చే మంగళవారం రండి.' అనేశాడు.

(నేను ఆ బ్రాంచిలో చేరి రెండురోజులే అయ్యింది. తరవాత తెలిసింది ఆ రైతు ఓ 50 యెకరాలకి ఆసామీ అని! ఆ జిల్లాలో 50 యెకరాలంటే, కృష్ణా గోదావరి జిల్లాల్లో 5 యెకరాలకి సమానం! అయినా, పెద్ద రైతే కదా? వాళ్ళ వూరు బ్యాంకు వున్న వూరు నించి ఓ 15 కిలోలు వుంటుందిట. ఆ రోజు ఆయన ఇంకెవరిదో మోటార్ సైకిల్ మీద  లిఫ్ట్ అడిగి, బ్యాంకుకి వస్తూంటే, ఓ లారీ వీళ్ళమీద రోడ్డు గుంటల్లో వున్న బురద వర్షపునీరు చిమ్మేసి, వెళ్ళిపోయిందట!)

మరో పదిహేనురోజులకి కూడా కొత్త మేనేజరు రాలేదు. రైతులు వాళ్ళ పాట్లు వాళ్ళు పడ్డారు.

ఈ రంగం లో బ్యాంకు జవానూ, ఫీల్డాఫీసరూ ఇద్దరూ దళితులు. ఆ రైతు అగ్రవర్ణం వాడు.

మరెందుకలగ?

--మిగతా మరోసారి

Friday, May 14, 2010

'.....క్షమించని

కులాల ప్రసక్తి'

రెండు రంగాలు (సీన్లు) వ్రాస్తాను. చదివి, జవాబు చెప్పండి.

మొదటి రంగం :

ఓ హైవే--అక్కణ్ణించి ఇంకో దారి చీలుతుంది. అక్కడికి ఆ వూరు బస్ స్టాండ్ కొంచెం దూరం. యెటు వెళ్ళే బస్సులైనా, ఆ సెంటర్ లో ఆగుతాయి. ఆ సెంటర్ లో ఓ హోటెల్. స్లాబ్ బిల్డింగులో నీట్ గా వుంటుంది. టిఫిన్లు కూడా చాలా బాగుంటాయి. ఓ పక్కా, మధ్యనీ నాలుగేసి కుర్చీలు వుండే టేబుళ్ళు. ఇంకో పక్క, ఆరు కుర్చీలు వుండే టేబుళ్ళు. ఉదయం 6 నించీ, 11 దాకా యే టేబులూ ఖాళీ వుండదు.

ఆ సెంటర్ లోనే అనేక పాక హోటళ్ళు వున్నాయి--వాటిలోనూ ఖాళీ వుండదు ఆ సమయం లో.

ఆ వూళ్ళో ముందు రోజు రాత్రి ఓ శుభకార్యానికి వచ్చాడొకాయన. తెల్ల ఫేంటూ, తెల్ల షర్టూ టక్ చేసుకొని, చలవ కళ్ళజోడు పెట్టుకొని, టిప్ టాప్ గా వున్నాడు. తన ఆఫీసుకి ఆలస్యం అయిపోతుందేమో అని, టిఫిన్ చెయ్యకుండా బయల్దేరి వచ్చేశాడు. 

ఈ హోటల్లో నలుగురు కూర్చొనే టేబులు దగ్గర, యెడం వైపు కుర్చీలో కూర్చున్నాడు. కుడివైపు కుర్చీ గోడ దగ్గరగా వుంది. అది ఖాళీ. టిఫిన్ ఆర్డరు ఇచ్చాడు. సర్వర్ తేగానే, శుభ్రం గా చేతులు కడుక్కుని, తినడం ప్రారంభించాడు.

హోటెల్ యెదురుగా ఓ లారీ ఆగింది. అందులోని క్లీనర్, పాపం ఆకలితో నకనకలాడుతున్నాడు. డ్రైవర్ ని బతిమాలి, ఓ ఐదు నిమిషాల్లో వచ్చేస్తానన్నా అని, క్రిందికి దిగాడు. 

అతని వాలకం మామూలే--చొక్కా అంతా ఆయిల్ మరకలూ, చేతుల్నిండా నల్లగా గ్రీజు మరకలూ!

హోటల్లోకి వచ్చేసరికి, మన నీటుగాడి ప్రక్కన గోడదగ్గర వున్న సీటొక్కటే ఖాళీ వుంది!

సంశయిస్తూనే, 'కొంచెం జరుగుతారా?' అన్నాడు. నీటుగాడు విననట్టే నటిస్తూ, టిఫిన్ లాగించేస్తున్నాడు. 

ఇతను, అటుగా వస్తున్న సర్వర్ని దీనం గా వేడుకొన్నట్ట్లు చూశాడు. ఆ సర్వర్, 'కొంచెం జరగండి సార్!' అన్నాడు. 

జరగకపోగా, అయిష్టంగానే లేచి, గోడదగ్గర సీటుకి ఇతనికి దారిచ్చి, మళ్ళీ తన కుర్చీలో బాగా యెడం వైపు జరిగి తన టిఫిన్ 'మమ ' అనిపించి, సర్వర్ తో 'కాఫీ కేన్సిల్ ' అని చెప్పేసి, బయటికి వచ్చేశాడు బిల్లు చెల్లించి!

ఇక్కడ అసలు విషయం యేమిటంటే, ఆ నీటుగాడు ఓ దళితుడు. క్లీనర్ ఓ అగ్ర వర్ణం వాడు!

మరి యెందుకలగ?

ఇంకో రంగం మరోసారి.

Thursday, April 29, 2010

.....క్షమించని

కులాల ప్రసక్తి

రాజుల కాలం లో, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో యుధ్ధాలు చేసేవారు. దానికోసం సైన్యాన్ని తర్ఫీదు ఇచ్చి, బలాన్నీ, ఆయుధాలనీ పెంచుకొనేవారు. 

యుధ్ధాల్లో దళాలకి అధిపతుల్ని నియమించేవారు--వారికి నాయుడు, రాయుడు, లాంటి పదవులిచ్చేవారు. రాజు క్షత్రియుడైతే, సాధారణం గా క్షత్రియులే సైన్యాధిపతిగా నియమింపబడేవారు. రాజు రెడ్డి అయితే, రెడ్డినే సైన్యాధిపతిని చేసేవారు. 

దళాధిపతులు చూపించిన పౌరుషాన్ని మెచ్చుకొని, వారికి కొంత భూమిని ఇచ్చేవాడు రాజు. ఆ భూముల్లో వ్యవసాయం చేయించుకొంటూ, కోటకి కూడా 'కాపు' గా వుండేవారు. వీళ్ళే ప్రాంతాలని బట్టి, కాపు కులం, వెలమ కులం--ఇలా యేర్పడ్డారు. ఇలాంటి వంశాలవాళ్ళే--వీరమాచనేని (వీరమాచయనాయని), ఘట్టమనేని, త్రిపురనేని, పర్వతనేని, రాయని, సర్వారాయని--ఇలాంటి ఇంటిపేర్లు వున్నవాళ్ళు. (వీళ్ళలో ప్రస్తుతం కొన్ని ఇంటిపేర్లవారు 'కమ్మ' లేదా 'చౌదరి' కులం గా వ్యవహరించబడుతున్నారు.)

ఇతరకులాలలోని వాళ్ళు, కొంత సంపాదించుకొని, స్వయం గా భూవసతిని యేర్పాటు చేసుకొని, ముఖ్య వృత్తి వ్యవసాయం, పాడి గా గలవాళ్ళు 'కమ్మ' కులం గా యేర్పడ్డారు. ఉత్తరభారతం లోని 'చౌధురీ' ల నించి 'చౌదరి' నామాన్ని స్వీకరించారు. వీళ్ళ ముఖ్య లక్షణం యేమిటంటే, బంజరు భూముల్ని కూడా తమ శ్రమ శక్తి తో బంగారు పండే భూములుగా మార్చడం! పాడి ని వృధ్ధి చేసుకోవడం. (ఈ కులం వాళ్ళు లేకపోతే, ఆంధ్ర ప్రదేశ్ లో యే ప్రాంతం లోనూ వ్యవసాయం ఇప్పుడున్న స్థితిలో వుండేదికాదు అంటే అతిశయోక్తి కాదు!)

(మా మేష్టారు తన తిట్టులో వుపయోగించిన 'దొమ్మరి, దూదేకుల, కమ్మరి, కుమ్మరి, మేదరి, మాల, మాదిగ, సాలి, కంసాలి, యెట్టి, యానాది, ఈడిగ, పాకీ' ఇలా సమస్థ కులాలవాళ్ళూ సైన్యం లో వుండి, వాళ్ళ వాళ్ళ వృత్తులు చెయ్యకపోతే, ఆ సైన్యాలు అంతంత సంఖ్యల్లో మనుగడ సాగించగలిగేవా?)

యుధ్ధాలు లేని శాంతి సమయం లో ఈ కులాలవాళ్ళందరికీ తగ్గ వుపాధి--ఆయుధాలు తయారు చెయ్యడమో, రాళ్ళూ వగైరా మోయించి గుళ్ళు కట్టించడమో, కళలని అభివృధ్ధి చెయ్యడమో--ఇలాంటివి చేసి, వాళ్ళకి వుపాధికి లోటులేకుండా చూసుకునేవారు.

సాహిత్యాన్నీ, ఇతర కళలనీ పోషించి, వాళ్ళకి కూడా అగ్రహారాలు ఇచ్చేవారు.

--మిగతా మరోసారి

Tuesday, April 13, 2010

చలన చిత్రాలు

'.....సిత్రాలు'

దాదాపు ఓ నలభై యేళ్ళ క్రితం, మన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 'కాలం మారింది' అనే ఓ సందేశాత్మక చిత్రానికి దర్శకత్వం వహించాడు. 

దాన్ని నిన్ననే (13-04-2010) ఈటీవీ వారు ప్రసారం చెయ్యడంతో మళ్ళీ చూశాను.

గాంధీ, నెహ్రూలకి కూడా 'విగ్రహాలు' పెట్టొద్దు--వారి బాటని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి అని అర్ధం వచ్చేలా, హీరో (శోభన్ బాబు) చేత పాట పాడించారు!

నిజం గా అలాంటి చిత్రం చెయ్యడం తో ఆయన జీవితం ధన్యమయినట్టే! (ఆ సినిమాకి డబ్బులు రాలేదనుకోండి--అది వేరే విషయం)

అలాంటి సినిమాలు మరిన్ని తీస్తే, ఇప్పుడు కోట్లు వసూలు చెయ్యచ్చు.

యెందుకొచ్చిన శంకరాభరణాలూ, సాగర సంగమాలూ, సిరి వెన్నెలలూ!

'.....తపస్వి' గారూ! ప్రయత్నిస్తారా?

Friday, April 2, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.......

కులాల ప్రసక్తి


త్రేతాయుగం లో జరిగినట్టు చెప్పబడుతున్న రామాయణం లో జాతుల ప్రసక్తి వుంది గాని, కులాల ప్రసక్తి అంతగా లేదు.

ముఖ్యం గా 'దైత్య ' (రాక్షస) జాతిని నిర్మూలించడానికే రామావతారం వచ్చింది.

(ఓ ముఫ్ఫయ్యేళ్ళక్రితం, ద్రవిడ కజగం స్థాపకుడు, పెరియార్ ఈ వీ రామస్వామి నాయకర్--రావణలీల జరిపించి, రాముణ్ణి వాహనం పై చెప్పులతోనూ, రాళ్ళతోను కొట్టిస్తూ, మదరాసు వీధుల్లో వూరేగించేవాడు! అప్పట్లో నిరసనలు లేవు. దేశవ్యాప్త నిరసనలు అసలే లేవు!)

ఆ కాలం లో బ్రాహ్మణులు పురోహితులుగా, యఙ్ఞాది కర్మలు చేయించేవాళ్ళుగా, చదువు చెప్పేవాళ్ళుగా, ప్రజల మంచికోసం ముహూర్తాలూ అవీ పెట్టేవాళ్ళుగానే వుండేవారు.

క్షత్రియులు, రాజ్య పాలన చేసేవారు. సైన్యం లో ముఖ్య పదవులు అధిష్టించేవారు.

వైశ్యులు వాణిజ్యం చేసి, వణిక్ ప్రముఖులుగానే వుండేవారు.

శూద్రులు పొలాల్లో పంటలు పండించడం చేసేవారు, యాదవులు పశుపోషణ చేసేవారు, మిగిలిన కులాలవాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకునే వారనే అనుకోవాలి.

గుహుడు, శబరి వంటివాళ్ళు ఆయనని దైవం గానే కొలిచారు!

ఆ యుగాంతానికి కొంచెం ముందు, 'శంబూక వథ ' జరిగింది. ఆ పంచముడు తపస్సు చేస్తున్నాడని కొందరు రాముడికి ఫిర్యాదు చెయ్యగానే, ససైన్యం గా వెళ్ళి, 'నీవు నీ ధర్మాన్ని అతిక్రమించావు. అందుకని నిన్ను వధించక తప్పడం లేదు.' అన్నాడంటారు.

(ఇది 'వాల్మీకం' లో వుంది అని కొంతమంది, లేదు ప్రక్షిప్తం అని కొంతమంది అంటారు.)

ద్వాపర యుగానికి వచ్చేసరికి, కుల వ్యవస్థ బలపడింది. క్షత్రియులే కాకుండా, యాదవులు, నాగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు--మొదలైన వాళ్ళు కూడా రాజ్యపాలన సాగించారు.

సైన్యం లో అన్ని కులాలవాళ్ళూ వుండి, వాళ్ళ వృత్తుల్ని కొనసాగించేవారు!

ఇక కలియుగం లో, మనకి తెలిసిన చరిత్ర ప్రకారం దండయాత్ర చేసి, ఢిల్లీ సిం హాసనాన్ని ఆక్రమించుకున్న షేర్ షా సూరీ కాలం లో, మొదటిసారి 'శిస్తు వసూళ్ళ ' వ్యవస్థని ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థని క్రమబధ్ధీకరించాడు.

ఆ క్రమం లో, సామంత రాజులకి ఆ అధికారాలు దఖలు పడి, వాళ్ళు వసూలు చేసిన దాంట్లో పెద్ద మొత్తాలని ఢిల్లీ నవాబుకి చెల్లించేవారు.

రాజులు లేని వ్యవసాయ ప్రాంతాలూ, అరణ్య ప్రాంతాలూ, కొండ ప్రాంతాలకి సంబంధించి, అక్కడ వారసత్వం గా కొంత భూవసతి కలిగిన వాళ్ళు ఆ ప్రాంతాలపై తమకి వసూళ్ళ అధికారాన్ని ఇమ్మని నవాబుకి మహజరు సమర్పిస్తే, సరేనని ఆ ప్రాంతానికి అతణ్ణి అధికారిగా నియమించేవారు.

అలావచ్చినవే 'చౌధురి ' మొదలైన పదవులు. (చతుర్థ హారి--అంటే వసూలు చేసిన దాంట్లో నాలుగో వంతు హరించి, మూడు వంతులు నవాబుకి చెల్లించేవారు--అదే కాలక్రమం లో చౌధరి గా మారిందంటారు. ఇంగ్లీషువాళ్ళు కడప వర్ణక్రమం లో వుపయోగించినట్టు వ్రాయడం వల్ల, అది చౌధురి అయ్యింది!)

అదుగో--అక్కడ పడింది జమీందారీ, ఇనాందారీ, మొఖాసాదారీ, శిరస్థదారీ మొదలైన వ్యవస్థలకి.

స్వర్ణ యుగం గా పేరుపడ్డ గుప్తుల కాలం వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ మరింత పకడ్బందీ గా నడిచి, అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు--పాలన బాగుండడం వల్ల. ఇందుకు ముఖ్య కారణం 'కౌటిల్యుడు '.

మొఘలాయి పాలన వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ చక్కగా నడిచేది--కాని ఈ జమీందారులూ వాళ్ళూ చాలా బల పడ్డారు--నవాబు వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తూండటం తో.

(గోల్కొండ నవాబు క్రింద పని చేసిన అక్కన్న, మాదన్న లు అలాంటివారే. అందులో అక్కన్ననే తానీషా అనేవారు. ప్రజల అఙ్ఞానాన్ని డబ్బులుచేసుకోవడం కోసం, క్యామెడీ కోసం తొట్టి గ్యాంగుకి పాత్రలు కల్పించడానికి, శ్రీ రామ దాసు సినిమాలో చరిత్రనీ, వాస్తవాన్నీ వక్రీకరించారు!)

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)

Thursday, April 1, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.........

"రిజర్వేష కావేషాలు"

ఈ మధ్య అదేదో సినిమాలో హీరోనే కాకుండా ఐదారు పాత్రలు 'పింజారీ' అనే మాటని వాడాయట. 

'అదిగో! మా కులం పేరెత్తారు. ఆ సినిమా వాళ్ళు క్షమాపణలు చెప్పాలి--లేకపోతే సినిమా ఆడనివ్వం!' అన్నారట ఓ కులం వాళ్ళు.

పూర్వం 'థగ్గులూ' 'పిండారీలూ' మొదలైన జాతులవాళ్ళు వుండేవారట.  వీళ్ళు దేశద్రిమ్మరులు. వీళ్ళ ముఖ్య వృత్తి 'దోపిడీలు, దొంగతనాలు, హత్యలు'.  వీళ్ళకీ, చెంఘిజ్ ఖాన్ కీ భయపడే (చెంఘిజ్ ఖాన్ వీళ్ళ జాతివాడేమో నాకు తెలియదు) ఈ నాడు ప్రపంచవింతల్లో ఒకటైన చైనా మహా కుడ్యాన్ని నిర్మించారు అప్పటి పాలకులు. అంతేకాదు--అఫ్ఘనీస్థాన్, బెలూచీస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతం లలో బలమైన కోటలు పాలకులు కట్టించుకున్నది కూడా వీళ్ళకి భయపడే!

థగ్గులని ఇంగ్లీషువాళ్ళు స్వీకరించి, 'థగ్' అనేమాటని వాళ్ళ భాషలో ప్రవేశపెట్టుకున్నారు.  మనవాళ్ళు పిండారీలని 'పింజారీలు' గా స్వీకరించారు.

ఈ మాటకీ, 'పొడుగు పింజ' పొట్టి పింజ' 'దూది పింజ' లకీ సంబంధం అంటగట్టి, దాన్ని ఓ కులానికి అన్వయించిన మేథావి యెవరో--వాడికి శిరసు వంచి పాదాభివందనం చెయ్యడం కాదు--తోలు వొలవాలి!

ఇక రిజర్వేషాల విషయానికొస్తే.........."సమాజం లో 'అణగారిన వర్గాలకి' (అణగద్రొక్కబడ్డకాదు--గమనించండి) కొంత వెసులుబాటు కల్పించి, నిర్ణీత సమయం లో వాళ్ళని పై వర్గాలతో సమం చెయ్యడం" అనే వుదాత్త ఆశయం తో మన పెద్దలు రాజ్యంగం ద్వారా కల్పించిన రక్షణ కవచాలు అవి.

ఈ ఆశయం కోసం, కొన్ని కులాలనీ, వర్గాలనీ గుర్తించింది ప్రభుత్వం.

అసలు కులాలు యెలా యేర్పడ్డాయి?

మనిషి అవలంబించే వృత్తుల్ని, వంశ పారంపర్యంగా కొనసాగించడం తో, అవి కులాలుగా స్థిర పడ్డాయి. 

మనువు చెప్పాడు, విష్ణువు ముఖం లోంచి ఓ కులం, భుజాల్లోంచి ఓ కులం, పొట్టలోంచి ఓ కులం, తొడల్లోంచి మరిన్ని కులాల వాళ్ళూ పుట్టారు--ఇవన్నీ 'ట్రాష్'!--"ప్రక్షిప్తాలు"--అంటే "ఇన్సర్టెడ్"!

శతాబ్దాలుగా ఈ కుల వ్యవస్థ మన దేశం లో వ్రేళ్ళూనుకోడానికి, 'ముందుబడిన కులాలతో' సమానం గా 'వెనుకబడ్డ కులాలకీ' బాధ్యత వుంది!

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)

Monday, March 15, 2010

నా ఇంకో కొండె.....3

వెంకట 'మరణ'

వాళ్ళ రూమ్ ప్రక్కన వుండే ఫంక్షన్ హాళ్ళలో దాదాపు సంవత్సరమంతా యేదో ఫంక్షన్ జరుగుతూనే వుండేది--దాంట్లో మనవాడికీ, వాళ్ళ అన్నదమ్ముల అనుబంధానికీ ఉచిత భోజన పథకం అమలయ్యేది. (అదీ అడ్వాంటేజ్!)

మా ఇంకో స్నేహితుడు వరప్రసాద్, బీసెంటురోడ్డులో యేవో జాతరలు జరిగి, పేదవాళ్ళకి అన్న సంతర్పణలు జరుగుతుంటే, 'ఒరే! పందిరేసి, విస్తరేశారు.....ఇక మనదే ఆలస్యం!' అని మమ్మల్ని వేళాకోళమాడేవాడు............వాడి ముందు!

(దయచేసి వాణ్ణి హేళన చెయ్యడానికి ఈ టపాలు వ్రాస్తున్నాననుకోవద్దు! వాడు చిరునవ్వుతో అనుభవించిన కష్టాలని మీ చెవిన వేద్దామనే నా తపన.)

అలాంటి మా రమణ (వాళ్ళది ప్రకాశం జిల్లా), గోదావరి జిల్లాల్లోని ఓ పట్టణం లో వుండే కుటుంబం లో అమ్మాయిని పెళ్ళిచేసుకొన్నాడు!  వాళ్ళ అత్తవారిది కూడా పెద్ద కుటుంబం. ఆ వూళ్ళో మెయిన్ బజారులో ఓ వీధంతా రెండువైపులా వాళ్ళ షాపులే వుంటాయి. ఇంకో పేటలో ఒక వీధిలో రెండువైపులా వాళ్ళ ఇళ్ళే వరసగా వుంటాయి.

వాడి అదృష్టం ఆ అమ్మాయిరాకతో తిరిగింది. బాగా సంపాదించాడు. ఇంకో జిల్లా ముఖ్యపట్టణం లో రాజభవనం లాంటి ఇల్లు కట్టాడు. ఇద్దరు మగపిల్లల్నీ ఇంజనీర్లని చేశాడు. ఆడపిల్లకి అమెరికా సంబంధం చేశాడు! అందరూ చాలా సంతోషం గా వున్న సమయం లో.............

యాభయ్యారేళ్ళ వయసులో 'మహమ్మారి' బారిన పడ్డాడు......కొండనాలుకకి కేన్సరు వచ్చింది. రెండేళ్ళు బాధపడి, లక్షలు ఖర్చుపెట్టి, చివరకి యేడాది క్రితం పై లోకాలకి వెళ్ళిపోయాడు.

కాకతాళీయం గా వాడు పోవడానికి ఓ వారం ముందు నాకు ఫోన్ లో కలిసాడు. అప్పుడు వాడు వేసిన జోకు--"ఒరే! వక్కపొళ్ళు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందుకొట్టేవాళ్ళు మన ఫ్రెండ్స్ అందరికీ రాని జబ్బు నాకొచ్చిందేమిట్రా?" అనడిగితే, నా సమాధానం "కేరేఝాట్ అనేవాళ్ళకి యేమీ రావు. నువ్వుకూడా కేరేఝాట్ అను............నా అంత్యక్రియలకి నువ్వు వద్దూగాని!' అని. "అంతమాటనకురా! నా టైము అయిపోయింది........అంతే! పైలోకాన్నించి వస్తాన్లే!" అన్నాడు.

ఇంకో చిన్న జోకు చెప్పి వాడి కథనం ముగిస్తాను.

వాడు ఓ నేమ్ బోర్డు వ్రాయించి పెట్టుకున్నాడు. యే వూరు వెళ్ళినా, ఇంటిముందు అది తగిలించేవాడు. దాని కొలతలు--వెడల్పు 3 అడుగులు, పొడవు 4 అడుగులు.

దానిమీద అందంగా తన పేరు, భార్యపేరు వ్రాసివుండేవి.

ఆ క్రింద, తన పిల్లల అందరివీ (అసలు పేర్లుకాదు) ముద్దుపేర్లు వ్రాసి వుండేవి! (వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ ఇంట్లో వాళ్ళు వుంటారని తెలియాలి కదురా! అనేవాడు. మరి ముద్దు పేర్లు యెందుకు? స్కూల్లో పేర్లు వ్రాయించవచ్చుకదా--అంటే--అక్కడే వుంది మజా! అని నవ్వేవాడు!)

ఓ రోజు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. (హనుమంతు అని, వాడింకా పెద్ద జోకర్!)

నేమ్ బోర్డు చూసి, "ఇంకా చాలా వ్రాయడం మరిచిపోయారు! వెంటనే వ్రాయించండి. 'పని మనిషి సావిత్రి, చాకలి మంగమ్మ, మంగలి ముఖలింగం.............' ఇలా......"

అదీ సంగతి!

Sunday, March 14, 2010

నా ఇంకో కొండె.....2

వెంకట 'మరణ '

అప్పట్లో, బ్యాంకుల్లో ఐదు రూపాయలు, రెండు రూపాయలు, ఒక రూపాయి కూడా తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లోంచి డ్రా చేసుకోడానికి వచ్చేవారు జనం.

ఇక మా రమణ తన బ్యాంకులో డ్యూటీలో వుండగా, ఓ తమ్ముడు వచ్చేవాడట. 'నాకు ఓ కొత్త రబ్బరు (ఇరేజరు) కావాలన్నయ్యా' అంటే, ఓ విత్ డ్రాయల్ ఫారం తీసి, తన ఖాతాలోంచి ఓ ఇరవై పైసలకి వ్రాసి, ఆ డబ్బు తన తమ్ముడికిచ్చి పంపించేవాడట.

కాసేపటికి ఇంకో తమ్ముడు వచ్చి, 'నా పెన్నులో రీఫిల్ అయిపోయింది' అంటే, ఇంకో యాభై పైసలకి విత్ డ్రాయల్ వ్రాసేవాడట.

ఇంకో తమ్ముడు వచ్చి, 'లెఖ్ఖల పుస్తకం అయిపోయిందన్నయ్యా' అంటే, ఓ రూపాయి ఇరవై పైసలకి ఇంకో విత్ డ్రాయాల్ వ్రాసేవాడట.

కేషియర్ వీరాస్వామిగారు 'బుధ్ధి లేదా? ప్రతీరోజూ ఓ ఐదు రూపాయలు డ్రా చేసి జేబులో వుంచుకోవచ్చుకదా?' అని కోప్పడేవాడట.

వుత్తర భారతం నించి వచ్చిన ఓ ప్రొబేషనరీ ఆఫీసరు (తెలుగు రానివాడు) వాణ్ణి 'అన్నదమ్ముల అనుబంధం వచ్చింది' అని గేలిచేసేవాడు.

ఇవిలా వుండగా, బ్యాంకు వాళ్ళందరికీ కొత్త సినిమాలు రిలీజు అయ్యే ముందు మొదటిరోజు మొదటి ఆటకి టిక్కెట్లు ఇప్పించేవారు--ఆంధ్రా బ్యాంకులో ఖాతాలు వున్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు.

మా రమణ సినిమా చూస్తూంటే, ఆహ్లాదకరమైన సన్నివేశం వచ్చినప్పుడు, ప్రక్కవాడి తొడమీద చరిచి, వ్రేళ్ళని దగ్గరకిలాక్కుంటూ చెయ్యి పైకిలాగి, 'హహ్హహ్హా' అని నవ్వేవాడు. వూహించండి మీ తొడని అలా లాగితే మీకెంత నెప్పెడుతుందో!

అందుకని మా రాంబాబు (వీడిని మా 'డైరెక్టరు' అనేవాళ్ళం. ఆక్కడక్కడా వచ్చిన మా బ్యాంకువాళ్ళ సీట్లని 'అడ్జస్ట్' చేసి, అందరినీ ఒకే వరుసలో కూచోబెట్టేవాడు) వాడికి ప్రత్యేకంగా తెలియనివాళ్ళ ప్రక్కన సీటు వచ్చేలా యేర్పాటు చేసేవాడు.

హైలైట్ యేమిటంటే, 'షోలే' సినిమా మొదటిరోజు మొదటి ఆట చూస్తున్నాం--అమితాభ్ 'ఆ తుపాకీ నాకందించండి' అని అడుగుతాడు సంజీవ్ కుమార్ని. అందించడు! తరువాత కాస్సేపటికి, ఓ పెద్ద గాలి వీచి, సంజీవ్ కప్పుకున్న వుత్తరీయం యెగిరి పడ్డాక, కనిపిస్తుంది--తనకి రెండు చేతులూ లేవు--అని!

వెంటనే మా రమణ 'అర్రే! చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడ్రా!' అన్నాడు.

మా రాంబాబు 'నువ్విచ్చే రెండున్నర రూపాయలకోసం వాడి చేతులు నిజం గా నరికేస్తారన్నుకున్నావేంట్రా? బేవకూఫ్' అని వాణ్ణి తిట్టాడు. చుట్టూ జనాలందరు 'ఘొల్లు '!

.............మిగతా ఇంకోసారి.

నా ఇంకో కొండె.....

వెంకట 'మరణ'

మేము వుద్యోగాల్లో చేరిన కొత్తల్లో, విజయవాడ లో వుండే రోజుల్లో, మా స్నేహితుల్లో వెంకట రమణ అని వుండే వాడు. (చనువు పెరిగాక వాడినే 'మరణా' అని యేడిపించేవాళ్ళం).

వాళ్ళ తండ్రిగారు అప్పటికే రిటైర్ అయ్యారు. పెద్ద కుటుంబం--వాడితో పాటు యేడుగురు అన్నదమ్ములూ, ఇద్దరో ముగ్గురో అక్క చెల్లెళ్ళూ. వీడు రెండో వాడనుకుంటా. వాళ్ళన్నయ్యకో చిన్న వుద్యోగం.

మంచి సరదాగా వుండేవాడు. యెవరేమన్నా యేడిచేవాడు కాదు. తనమీద తనే జోక్స్ వేసుకొని నవ్వించి, నవ్వేవాడు.

వీడు ఆంధ్రా బ్యాంకులో పని చేసేవాడు. కొత్తల్లో వాణ్ణేడిపించడానికి 'యెలావుంది మీ 'అంధేరా' బ్యాంకు?" అనడిగితే, "అంధేరా అనకండి సార్! 'ఆంధ్రా బంకు' అనండి కావాలంటే!" అనేవాడు.

"సరే, మీ బంకు యెలావుంది" అంటే, "మాది బంకు అయితే, మీది కూడా బంకే కదా? మీ బంకు యెలా వుందో మా బంకూ అలాగే వుంది!" అని చంకలు గుద్దుకొనేవాడు!

కులానికి శూద్రులైనా, చక్కటి సంస్కారం వుండేది వాళ్ళ కుటుంబం లో అందరికీ. మా స్నేహితుల్లో యెవరైనా 'వెధవా' లాంటి తిట్లు తిట్టినా, బూతులు మాట్లాడినా, నవ్వుతూ 'బూతులు మాట్లాడకండిరా--తప్పు!' అనేవాడు. 

వాళ్ళ కుటుంబంలో యెవరికైనా ఇంకెవరిమీదైనా కోపం వస్తే, 'నీకివాళ బాగా ఆకలెయ్యా!' అనో, 'అమ్మ నిన్ను బాగా తిట్టా!' అనో, 'దారిలో నిన్ను చీమ కుట్టా!' అనో, 'సాయంత్రం దోమ నిన్ను బాగా కుట్టా!' అనో, ఇంకా బాగా కోపం వస్తే, 'దారిలో నీ కాలికి యెదురుదెబ్బ తగలా!' అనో తిట్టుకొనేవారట!

మొదట్లో, ఓ ఇంట్లో వీధి కొట్టుగది (7 X 5 అడుగులు) లో అద్దెకు చేరాడు--అద్దె నెలకి ఇరవై రూపాయలు! 

(ఆ యింటివాళ్ళు వెన్న వ్యాపారం చేసేవారు--అంతకు ముందు ఆ గదిని వెన్న డబ్బాలు వుంచడానికే వాడుకొనే వారు). 

దానికి కిటికీలుగానీ, వెంటిలేటర్లు గానీ వుండేవి కాదు. యేడడుగులు వెడల్పులోనే గోడ మధ్యలో ఆ గదికి ద్వారం. 

ద్వారానికి యెడం పక్క (దక్షిణం వేపు) ఓ ట్రంకు పెట్టె, దానిమిద ఓ గాలి దిండు, దుప్పటి వుండేవి. ఓ మూల చాప వుండేది. దానికి వ్యతిరేక దిశలో, వుత్తరం వైపు తన పుస్తకాల అట్ట పెట్టె! 

(వాడో పుస్తకాల పురుగు! ఇంకేమీ చదవడానికి లేకపోతే, డిక్షనరీ చదివేవాడు! అలాగే బ్యాంకు పరీక్షలు ప్యాసు అయ్యాడు మా అందరికన్నా ముందుగా!)

పగలైతే, గదిలో నిలువుగా చాప వేసుకొని,  అడ్డంగా పడమరవైపు తలపెట్టుకొని, గుమ్మం లోంచి కాళ్ళు బయట పెట్టుకొని పడుకొనేవాడు. రాత్రి, నిలువుగా దక్షిణ వుత్తరాలుగా పడుకొనేవాడు.

భోజనం తప్ప, టిఫిన్, టీ, కాఫీ, వక్కపొడి--ఇలాంటివన్నీ నిషిధ్ధం. మేము స్వేచ్చగా మా జీతాలు ఖర్చుపెట్టుకొని, పైవాటితో పాటు సిగరెట్లు, సినిమాలు కూడా అలవాటు చేసుకొని ఆనందిస్తుంటే, వాడు 'యెందుకురా చెడిపోతారు?' అని బాధపడేవాడు.

ఓ పదినెలలు వుద్యోగం చేసి, జీతం లో కొంత నిలువచేసుకోగలగ గానే, కొత్త 'రూమ్' (ఓ ఫర్నిచరు వర్క్ షాపు వాళ్ళ రేకుల షెడ్) లోకి మారి పోయాడు--నెలకి 50 రూపాయల అద్దెకి. ఆ షెడ్ లో ఒకగది, వసారా వుండేవి. 

ఆ గదికి వుండే అడ్వాంటేజ్ యేమిటంటే, ప్రఖ్యాత ఫంక్షన్ హాల్స్ రెండుమూడు వుండేవి చుట్టుపక్కల. (ఆ అడ్వాంటేజ్ యేమిటో తరవాత చెపుతాను.)

అప్పటికి అకడమిక్ ఇయర్ అయిపోయి, మళ్ళీ కొత్త ఇయర్ మొదలవగానే, వాళ్ళ తమ్ముళ్ళనందరినీ తనదగ్గరకి రప్పించేసుకొని, స్కూళ్ళలో చేర్పించేశాడు. (వాళ్ళ పెద్దతమ్ముడు అప్పటికే డిగ్రీ అయిపోయి, వుద్యోగ ప్రయత్నాల్లో వుండేవాడు.  తరవాత రైల్వే లో మంచి వుద్యోగం వచ్చింది--ఈ పాటికి యే జనరల్ మేనేజరో అయిపోయి వుంటాడు)

............తరువాయి మరోటపాలో!

   

Sunday, March 7, 2010

ఇంకో.......

వింతాభిషేకం

తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి లోని సిధ్ధి వినాయక స్వామికి మొన్న లక్ష కలాలతో అభిషేకం నిర్వహించారట.

వ్యాసమహర్షి ఆఙ్ఞతో గణపతి మహాభారతాన్ని వేగం గా లిఖించినట్లు పురాణాల్లో వుందట--అందుకని!

మరి ఆయన రాసినది 'గంటం' తో ననుకుంటా!

ముందుగా స్వామికి గరికగడ్డి, నారికేళఫలాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారట!

సరే, గరిక అయితే, విగ్రహం నెత్తిమీద వేసేస్తారనుకోవచ్చు--మరి కొబ్బరికాయలు యెలా అభిషేకిస్తారో?

ఆ తరవాత లక్ష పెన్నులను స్వామి పాదాల ముందు గుట్టగా పోసి, పూజలు చేశారట. ఈ కలాలతో పరీక్షల్లో వ్రాస్తే, తప్పకుండా ప్యాసు అవుతారట.

మరి అవి చెక్కకలాలా, వూట కలాలా, బంతి కలాలా--యెలాంటివో తెలియదు. వాటికి ఖర్చు యెంతయిందో తెలియదు. ఆ డబ్బు మాత్రం ప్రజలదే అయి వుంటుంది.

అక్కడి ప్రజా ప్రతినిథులు నలుగురో యెంతమందో ఆ పెన్నులని విద్యార్థులకి అందించారట--ఆ పెన్నులకోసం విద్యార్థులు రెండుకిలోమీటర్ల మేర బారులు తీరారట!

అదండీ సంగతి!